Tuesday, April 19, 2011



సృజనకి ఆరంభ క్షణం


చెప్పాలన్న కోరిక
రచించాలన్న తపన
కేవలం తన అస్తిత్వాన్ని తాను వెతుక్కోవటమే !

ఒంటికి పువ్వో
గడ్డిపరకో
ఇసుకో
లేక రాయో తగిలితే
నరనరానా ఒక పులకరింత
మళ్ళీ మళ్ళీ తాకాలని...ఇంకా ముట్టుకోవాలని...
ఆ తరవాత తాకకూడదని...
ఉప్పొంగే రక్తం మాటలాడే 
ఆ క్షణం
అభివ్యక్తి క్షణం
అదే క్షణం సృజనకి ప్రారంభం !

కళ్ళముందు ఎన్నెన్నో రంగులు కదలుతూనే ఉంటాయి
కానీ ఏదో ఒక రంగు
ఎప్పుడో కనురెప్పలని దాటి వెళ్ళి
కలలో కదలాడినప్పుడు
మనసు లోతుల్లో
ఉత్సాహం ఇంద్రధనుస్సుగా విరిసినప్పుడు
దిగులు మబ్బులు చీలినప్పుడు
సత్సంకల్పమనే జ్యోతి వెలిగే
అదే క్షణం సృజనకి ప్రారంభం !

గాలిలో తేలివచ్చే ఒక సువాసన
ఊపిరిలో కలవగానే
రాగమేదో పలుకుతూ
శ్వాసల తీగలని బిగిస్తుంది
మనసు హరిణం కలత చెంది తిరుగుతూ
అలసిపోయి కూలబడుతుంది
ముడుచుకుని పడుకుంటుంది

ఆ కలవరం
ఆ పిచ్చి పరుగు
ఓటమి గురించి అవగాహన
ఉన్నట్టుండి ఏదో దొరికిన ఆనందం.

ఆజన్మాంతం దాహంతో ఆత్మ
వెదుకుతూనే ఉంటుంది
నదులూ,సరోవరాలూ,బావులూ
కాని బతుకు ఎండ
గొంతులో ముళ్ళు మొలిపిస్తుంది

ఎప్పుడో ఒక నది దొరికితే
శబ్దభేది బాణమొకటి
ఒక జీవాన్ని హరిస్తుంది
ఐనా చావదు దాహం

ఇంకెప్పుడైనా ఒక సరోవరం కనబడితే
యక్షుడొకడు ఎదురుపడి
సంధిస్తాడు ప్రశ్నలని వరసగా
దాహార్తి మూర్ఛపోయి విలవిల్లాడుతుంది

నీటికోసం వెతుకులాట ఆగదు
అప్పుడొక జలపాతం కనిపిస్తే
దోసిలిపట్టి నీళ్ళు తాగి సేదతీరితే
చిరకాలపు ఆ దాహం తీరుతుంది
నిర్మలమైన పాల ధార
అమృతంతో తడిసిన పయ్యెద
తృప్తినిస్తుంది.

మౌనం బద్దలై
హద్దులు చెరిగిపోయి
శరీరం దిక్కులలో కరిగిపోయి
కేవలం మిగులుతుంది శూన్యం...దేహరహితంగా,
శూన్యంలోంచి పదాల నక్షత్రాలు పొడిచినపుడు
ఆ క్షణమే
అభివ్యక్తికి ఆరంభం !

అలాటి దుర్లభమైన క్షణం నాకు దొరికిందొకటి
అప్పగిస్తున్నాను దాన్ని నీకీక్షణాన
స్వీకరించు నిష్కపటంగా
ఇదొక్కటే అభివ్యక్తికి ఆరంభ క్షణం
సృజనకి ప్రారంభ క్షణం !

***************************************************************************************************

హిందీ మూలం : ఋషభదేవ్ శర్మ
అనువాదం : ఆర్.శాంత సుందరి
( ఏప్రిల్ పాలపిట్ట మాసపత్రికలో ప్రచురించబడింది)

No comments:

Post a Comment