Monday, July 11, 2011

బురదగుంటలోంచి పైకి పొడుచుకొచ్చిన ఆ పిల్ల తల వాళ్లకి కనిపించింది. కళ్లు పూర్తిగా తెరిచిఉన్నాయి. పెదవులు కదులుతున్నాయి. కానీ ఏమీ బైటికి వినపడటంలేదు. ఆ శ్మశానం లాంటి ఆవరణంలో చావు వాసన దూర తీరాలనుంచి రాబందులను ఆకర్షిస్తోంది. అనాథల వాతావరణంలో ఆ చిన్నారి హాహాకారాలూ గాలిలో నిండిపోయాయి. అలాంటి వాతావరణంలో ఆ చిన్నారి ప్రాణాలను ఉగ్గబట్టుకుని ఇంకా బతికి ఉండటమే ఒక విషాదంలా తోస్తోంది. టెలివిజన్‌ కెమెరాలు ఆ భయంకరమైన దృశ్యాన్ని పదే పదే ప్రసారం చేస్తున్నాయి. ఆ పిల్ల తల బురదలోంచి విచ్చుకున్న నల్ల కలువలా ఉంది. ఆమెని గుర్తుపట్టేవాళ్లు అక్కడ ఎవరూ లేరు.
భూగర్భ శాస్త్రవేత్తలు, అగ్నిపర్వతం బద్దలైనప్పుడు బయల్పడిన వేడి వల్ల పర్వత శిఖరం మీద ఉన్న మంచు కిందికి జారే ప్రమాదముందని కొంతకాలం క్రితమే హెచ్చరించారు. కానీ దానిని ఎవరూ పట్టించుకోలేదు. భూమి మూలుగుతున్నా వినిపించుకోకుండా కొలంబియా పర్వతప్రాంతంలోని ఊరి జనం తమ పనుల్లో తాముండిపోయారు. 1985వ సంవత్సరం నవంబరు రాత్రి ఒక పెద్ద గర్జన చాలాసేపు వినిపించింది... ప్రపంచం అంతం కాబోతోందని ప్రకటించినట్టు బ్రహ్మాండమైన మంచు గోడలు విరిగి పడ్డాయి. అవి రాళ్లతోనూ బంకమట్టితోనూ కలిసి దొర్లుకుంటూ ఊళ్లమీద పడి వాటిని కప్పేశాయి. ఆ భీభత్సం నించి బతికి బైటపడ్డవాళ్లు, ఊళ్లకి ఊళ్లు మాయమయ్యాయనీ, తమ వాళ్లు
చాలామంది మట్టిలో కలిసిపోయారనీ తెలుసుకున్నారు.. చాలాసేపటి తరవాత ఆర్మీ వాళ్లూ, వాలంటీర్లూ వచ్చి ఇరవైవేల కన్న ఎక్కువమంది ఆ బురదలో కూరుకుపోయారనీ, లెక్కలేనన్ని జంతువుల కళేబరాలు కూడా కొట్టుకొచ్చాయనీ తేల్చారు.
టీవీ రీపోర్టర్‌ రాల్ఫ్‌ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని ఆ పిల్లతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని కెమెరా ఆ పిల్ల మీదికి జూమ్‌ అయి ఉంది. నల్లటి మొహం, అసహాయంగా చూస్తున్న పెద్ద పెద్ద కళ్లూ, అస్తవ్యస్తంగా చెదిరిన జుట్టూ. ఆమె చుట్టూ పరుచుకున్న బురద.. ఆమె దగ్గరకి వెళ్లాలని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లే మునిగిపోయే ప్రమాదం ఉంది. రాల్ఫ్‌ ఆ పిల్లవైపుకి ఒక తాడు విసిరాడు. కానీ అతను అరిచి చెప్పేదాకా లిల్లీ దాన్ని అందుకునే ప్రయత్నమే చెయ్యలేదు. బురదలోంచి తన చేతిని బైటికి తియ్యబోయింది. కానీ ఆ చిన్నపాటి కదలికకే మరి కొంచెం లోపలికి కూరుకుపోయింది.
రాల్ఫ్‌ ఆ బురదలోకి కొంతదూరం ఈదాడు. ''నీ పేరేంటి?'' అని అడిగాడు. ఆ పిల్ల తన పేరు చెప్పింది. ''లిల్లీ, కదలకు... అక్కడే ఉండు'' అంటూ రాల్ఫ్‌ ఆ అమ్మాయి వైపు నెమ్మదిగా కదలసాగాడు. బురద అతని నడుంవరకూ వచ్చేసింది. అక్కడ గాలి కూడా బురదలాగే కంపుకొడుతోంది. కాళ్ళూనటానికి గట్టి నేలకోసం వెతుక్కుంటూ ఒక చోటికి చేరుకున్నాడు. తన దగ్గరున్న తాడుని లిల్లీ చంకలకింద గట్టిగా కట్టాడు. అలా కడితే ఆమెని బైటికి లాగటం వీలవుతుందని అనుకున్నాడు.
రాల్ఫ్‌ లిల్లీకేసి చూసి చిరునవ్వు నవ్వి, ఇంకేమీ భయంలేదని చెప్పాడు. మిగతా వాళ్లకి ఆ పిల్లని బైటికి లాగమని సైగ చెసాడు. కానీ తాడుని లాగగానే అది లిల్లీ ఛాతీ చుట్టూ బిగుసుకుంది. ఆ పిల్ల కెవ్వుమని అరిచింది. లిల్లీ భుజాలూ, చేతులూ పైకి లేచాయి. కానీ ఆ తరువాత ఎంత లాగినా ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయారు. ఆ పిల్ల కాళ్లు ఎందులోనో ఇరుక్కుపోయాయి. ధ్వంసమైన భవనాల గోడల మధ్య ఆమె కాళ్లు ఇరుక్కుపోయాయేమోనని ఎవరో అన్నారు. కానీ, చనిపోయిన తన అన్నలూ అక్కలూ తన కాళ్లకి చుట్టుకుని ఉండిపోయారని లిల్లీ అంది.
''ఏం భయం లేదు లిల్లీ! మేం నిన్ను ఎలాగో ఒకలా బైటికి తీస్తాం... ప్రామిస్‌'' అన్నాడు రాల్ఫ్‌. లిల్లీ అతనివైపు చూసింది కానీ ఏం మాట్లాడలేదు.
కొన్ని గంటలపాటు రాల్ఫ్‌ తాను చెయ్యగల ప్రయత్నాలన్నీ చేశాడు. పొడుగాటి కర్రలూ, తాళ్లూ ఉపయోగించి లిల్లీని రక్షించాలని చూశాడు. కానీ అక్కడ చిక్కుకుపోయిన ఆమెకి అవి చిత్రహింసలుగా మారాయి. అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ల వల్ల కూడా పని జరగలేదు. లిల్లీ అస్సలు కదల్లేని స్థితికి చేరుకుంది. ఊపిరి తీసుకోవటం కూడా కష్టమనిపించింది. కానీ రాల్ఫ్‌ ఆమెని ఎలాగైనా మృత్యువాత పడకుండా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. బురదలో మునిగి లిల్లీ కాళ్లని విడిపించాలని చూశాడు. కానీ బురద కింద రాళ్ళూ రప్పలూ అతని చేతులకీ కాళ్లకీ అడ్డంపడి ముందుకి కదలనివ్వలేదు. అతని నోట్లోకి బురద వెళ్లింది. ఉమ్ముతూ బైటికి వచ్చేశాడు. ఆ బురదలోని నీళ్లని పంప్‌ చేసి బైటికి పారబోయించాలని అనుకుని దానికోసం ట్రాన్స్మిటర్‌లో మెసేజ్‌ పంపాడు. అది పంపేందుకు వాహనం ఏదీ లేదనీ ఉదయం దాకా ఆగాలనీ జవాబు వచ్చింది.
''అంతదాకా ఆగటం కుదరదు!'' అంటూ అరిచాడు రాల్ఫ్‌.
కానీ అక్కడున్న గందరగోళంలో అతని మాటలు ఎవరూ వినిపించుకోలేదు.
ఆర్మీ డాక్టర్‌ వచ్చి లిల్లీని పరీక్షించి, పొద్దున్న దాకా ప్రాణభయం లేదని చెప్పి వెళ్లిపోయాడు.
''కాస్త ఓర్చుకోవాలి లిల్లీ! రేపు పంప్‌ వస్తుంది, నిన్ను బైటికి తీస్తాం'' అన్నాడు రాల్ఫ్‌ ధైర్యం చెపుతూ.
'నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లరు కదూ?'' అందా అమ్మాయి దీనంగా.
''లేదు లిల్లీ, నేనెక్కడికీ వెళ్లటంలేదు!'' అన్నాడు రాల్ఫ్‌.
ఇంతలో ఎవరో కాఫీ తెచ్చారు. వేడి వేడి కాఫీ తాగాక ఆ పిల్లకి కొంచెం ప్రాణం వచ్చినట్టనిపించింది. తన చిన్న జీవితం గురించి చెప్పసాగింది. తన కుటుంబం, స్కూలూ, అగ్నిపర్వతం బద్దలు కాకముందు తమ ఊరు ఎలా ఉండేదో.. చెప్పింది. తనకి పదమూడేళ్లనీ, ఎప్పుడూ ఊరు విడిచి ఎక్కడికీ వెళ్లనే లేదనీ అంది. రాల్ఫ్‌ వార్తా ప్రపంచంలో తన అనుభవాలని ఆపిల్లకి సమయం గడపడానికని చెప్పాడు. వాస్తవాలు చెప్పటం అయిపోయాక, ఆ పిల్లకి వినోదం అందించే ఉద్దేశంతో ఏవేవో కల్పించి చెప్పసాగాడు. మధ్య మధ్యలో ఆ పిల్ల కునికి పాట్లు పడసాగింది, అయినా తను ఆ చీకట్లో అక్కడే ఉన్నానని తెలియజేయడం కోసం అతనలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏం జరగబోతోందో తెలీని ఆ స్థితిలో అతను కూడా ఏమీ ఆలోచించకుండా ఉండేందుకు అలా మాట్లాడటం పనికివచ్చింది. అది ఒక సుదీర్ఘమైన రాత్రిగా అనిపించింది.
లిల్లీ వణకటం మొదలు పెట్టింది. కదలకుండా ఉండిపోవటం వల్లా, నీరసం ఆ పిల్ల చాలా డీలా పనిపోయింది. కానీ స్పృహ కోల్పోలేదు. పొద్దువాలే వేళకి సన్నటి జల్లు మొదలయింది.
''ఆకాశం ఏడుస్తోంది!'' అంది లిల్లీ తనొకపక్క ఏడుస్తూనే.
''భయపడకు. గాభారా పడితే మరింత నీరసం వస్తుంది. పంపు వస్తుంది, రాగానే నువ్వు బయటపడేలా చూస్తాం'' అన్నాడు రాల్ఫ్‌. కానీ పంపు అక్కడికింకా చేరలేదు.
మర్నాడు మళ్లీ చీకటిపడింది. రాల్ఫ్‌ వాళ్లమ్మ దగ్గర నేర్చుకున్న ఒక జోలపాట పాడసాగాడు. కానీ లిల్లీకి నిద్ర రావటంలేదు.
రాల్ఫ్‌కి తన పాత రోజులు గుర్తుకొచ్చాయి. తన తండ్రి ఆవిడను పెట్టిన రకరకాల బాధలూ, తనని క్రూరంగా హింసించటం.. అతని కళ్ళు చెమ్మగిల్లారు.
అతను ఏడవటం చూసి లిల్లీ, ''మీరు ఏడవకండి.. నాకిప్పుడు నొప్పిలేదు!'' అంది.
''నేను నీ కోసం కాదు లిల్లీ, నా కోసం ఏడుస్తున్నాను,'' అన్నాడు రాల్ఫ్‌.
మూడో రోజు తెల్లారేసరికి ఆకాశం తుఫాను మబ్బులతో నిండిపోయింది.. చక్కటి సఫారీ సూట్‌లో ఆ దేశాధ్యక్షుడు అక్కడి పరిస్థితి చూసేందుకు వచ్చాడు. ఇది ఈ శతాబ్దంలోకల్లా ఘోరమైన సంఘటన అనీ, మొత్తం దేశమంతా విషాదంలో కూరుకుపోయి ఉందనీ ఆ ప్రాంతం మొత్తం పవిత్రమైన ప్రదేశంగా ప్రకటించాననీ, ఫాదరీలు మృతుల ఆత్మశాంతికై సామూహిక ప్రార్థనలను జరుపుతారనీ ఉపన్యసించాక, చివరగా లిల్లీ అంత ధైర్యంగా ఉన్నందుకు పొగిడి వెళ్లి పోబోతూండగా, రాల్ఫ్‌ ఆయన్ని పంప్‌ సంగతి అడిగాడు. తను వెళ్లి పంప్‌ పంపే ఏర్పాట్లు చూస్తానని హామీ ఇచ్చి ఆయన వెళ్లిపోయాడు.
మళ్లీ వాళ్లిద్దరే మిగిలారు. లిల్లీ తనకి ఇంతవరకూ ఒక్క బారు ఫ్రెండ్‌ కూడా లేడని చెప్పింది.
''ఇప్పుడు నేను ఉన్నానుగా?'' అన్నడు రాల్ఫ్‌. లిల్లీ కళ్లు మెరిసాయి.
''ఔను. నిజం ఇప్పటివరకు నాకు కూడా ఎవరూ లేరు.. కాని
ఇకనుంచి నాకు నువ్వు, నీకు నేను..' అన్నాడు. రాల్ఫ్‌.
ప్రేమ అంటే ఏమిటో తెలియకుండా, ప్రేమని చవిచూడకుండా ఎవరైనా ఈ లోకం వదిలి వెళ్లటం ఎంత బాధాకరం!'' అని అంటుంటే లిల్లీ గొంతు వణికింది. రాల్ఫ్‌ ముందుకు వంగి లిల్లీ నుదుటిని సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు.
రాల్ఫ్‌ అలా చేసేసరికి లిల్లీ లేద హృదయంలో ఏదో తెలియని నమ్మకం గూడు కట్టుకుని మనసు కుదుట పడింది. మొహంలో ఒక తృప్తి, ఒక ప్రశాంతత కనిపించింది. ఇక తనకి ఏమైనా పరవాలేదన్న ధీమాతో కళ్లు మూసుకుంది.
రాల్ఫ్‌ మనసులోనే లిల్లీ త్వరగా, ఎక్కువ బాధ పడకుండా చనిపోవాలని ప్రార్థించాడు, ఎందుకంటే మట్టిలో మెడ వరకు కూరుకుపోయి ముప్పైఆరు గంటలకు పైగా ఆమె అనుభవిస్తున్న చిత్రహింస భరింపశక్యం కానిదని అతనికి తెలుసు.
విధి అతని కోరికని మన్నించింది. ఆ మూడో రోజు రాత్రి, క్యార్ట్జ్‌ లైట్ల వెలుగులో, కెమెరాలు ఆమె మీద ఫోకస్‌ అయి ఉండగా, లిల్లీ తన చివరి క్షణం వరకూ తోడున్న రాల్ఫ్‌ కళ్లల్లోకి చూస్తూ, ప్రాణాలు విడిచింది. రాల్ఫ్‌ ఆమెని తన గుండెలకి హత్తుకుని, వదిలేశాడు. లిల్లీ నెమ్మదిగా బురదలోకి మునిగిపోయింది.. బురదలో ఒక కలువపూవులా...!
-ఆర్‌. శాంతసుందరి