Sunday, June 5, 2011


అంతా గప్ చుప్!
------------

ఒక బ్రహ్మాండమైన పాత్రలో పదహారువందల  డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో కరిగిన ఉక్కు ఉంది.దాన్ని ప్లేట్ ఫార్మ్ మీదున్న  స్టీల్ ట్రాన్స్ఫర్ కార్ లో ఉన్న పెద్ద పెద్ద బాల్చీల్లోకి పోసే పని జరుగుతోంది.సరిగ్గా అదే సమయంలో పైనున్న ఓవర్ హెడ్ క్రేన్ పైనుంచి ఎవరో పనివాడు అగ్నిపర్వతం కన్నా వేడిగా మరుగుతున్న బల్చీలలో ఒకదానిలో దభాలున పడ్డాడు.ఎవరా దురాదృష్టవంతుడు?ఆ చోట ఇక మరునిమిషం ఒకటే ఉరుకులు పరుగులు, గాభరా...డిపార్ట్ మెంట్ లోని దాదాపు అందరూ పరిగెత్తుకుని వచ్చారు.కానీ రెప్పపాటులో జరిగిన ఆ ప్రమాదం ఎవరికో తెలీలేదు.తెలిసినా ఎవరూ ఏమీ చెయ్యగల పరిస్థితి కాదది.ఎందుకంటే ఆ పడ్డవాడు పడిన మరుక్షణం కాలిపోయి కరిగిపోయి నామరూపాలు లేకుండా పోయుంటాడని అందరికీ తెలుసు!ఆ బాల్చీలో ఉన్న కరిగిన ఉక్కు ఒక్క చుక్క ఎవరిమీదన్నా పడితే చాలు అది తుపాకీ లోని బులెట్ కన్న ఘోరమైన గాయం చేస్తుంది.ఇక్కడ మనిషే అందులో పడిపోయాడు.డివిజనల్ మేనేజర్ తో సహా ఆ స్టీల్ మేకింగ్ డిపార్ట్ మెంట్ లోని అందరు ఆఫీసర్లూ అక్కడికి వచ్చారు.వాళ్ళు అక్కడే ఏవో మంతనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చినట్టు,వర్కర్లందరినీ వెంటనే కాన్ఫరెన్స్ రూం లోకి రమ్మన్నారు.అక్కడ అటెండెన్స్ తీసుకుంటామని చెప్పారు.

ఆ షిఫ్ట్ లోని దాదాపు వంద మంది కార్మికులు తమ తమ స్నేహితులకోసం వెతుక్కున్నారు.ఇంతలో సీనియర్ మెకానిక్ తరుణ్ కూడా వాళ్ళతో వచ్చి చేరాడు.అతను తన స్నేహితుడు,ఎలెక్ట్రీషియన్ సందీప్ కోసం అంతటా వెతికాడు.సందీప్ ఎక్కడా కనబడకపోయినా అతనికి అటువంటి ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆలోచన రావటమే తరుణ్ కి నచ్చలేదు!

ఆ సమయంలో అక్కడున్నవాళ్ళు ఒక్క క్షణం బాల్చీలో కొద్దిగా కదలిక చూశారు, అంతే ఆ తరవాత ఏమీ లేదు.నిజంగా చావుకీ జీవించి ఉండటానికీ మధ్య దూరం ఎంత తక్కువ!ప్రాణాలని కాపాడేందుకు ఈ శరీరమనే కవచం ఎంత బలహీనమైనది!!

శోకం,దుఃఖం,సందిగ్ధం లాటి భావాలతో సతమతమవుతూ వర్కర్లు కాన్ఫరెన్స్ రూంకి చేరుకున్నారు.’ఏ’షిఫ్ట్ లోని వాళ్ళందరూ వచ్చేశారు.తరుణ్ కళ్ళు ఇంకా సందీప్ కోసమే వెతుకుతున్నాయి.కానీ అతను కనబడలేదు.కంప్యూటర్ లో ఫీడ్ చేసిన షీట్ అక్కడికి తెప్పించి ఒక్కొకరి పేరూ పిలిచి అటెండెన్సు మార్క్ చెయ్యటం మొదలుపెట్టారు.

రిటైరయే వయసుకి చేరుకున్న కార్మికుడెవరైనా కావాలనే చనిపోలేదు కదా, అనే అనుమానం వచ్చింది డెప్యూటీ మేనేజర్ కి.ఎందుకంటే,ఇప్పటికీ ఎవరైనా ప్రమాదంలో చనిపోతే అతని వారసుడికి ఫేక్టరీలో ఉద్యోగం ఇవ్వాలన్న రూల్ ఉంది.మొదట్లో కార్మికులు పాతికేళ్ళు పనిచేస్తే చాలు,వాళ్ళ కొడుక్కో,అల్లుడికో పని ఇచ్చేవాళ్ళు.ప్రస్తుతం సాగుతున్న పోటీప్రపంచంలో దాన్ని రద్దు చేశారు.పాతబడిపోయిన సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి ఎక్కువ పెట్టుబడితో తక్కువ నాణ్యత గల వస్తువులని తయారు చేసే పద్ధతి ఇప్పుడు లేదు.అప్పుడు ఉద్యోగంలో ఉన్న వర్కర్లకి బలవంతంగా పదవీ విరమణ ఇప్పించేవారు.

డీ ఎమ్ మనసులో ఏం జరుగుతోందో పసిగట్టిన తరుణ్ విలవిల్లాడిపోయాడు.ఎంత దారుణం!జీవితం ఇంత భయంకరంగా,ఇంత సిగ్గులేకుండా ప్రవర్తించేట్టు ఎలా తయారైంది? తమ పిల్లల భవిష్యత్తు కోసం...ఇంతా చేస్తే ఒక చిన్న ఉద్యోగం కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు వెనకాడరా?తరుణ్ మనసు పరిపరివిధాల బాధపడసాగింది.అటెండెన్స్ తీసుకున్నాక డీ ఎమ్ సందేహం తప్పని తేలింది,కానీ అసలు నిజం తెలిసేసరికి దాన్ని తట్టుకోటం కూడా కష్టమైపోయింది.బాల్చీ లో పడ్డది సందీపేనని తెలిసింది.అతను ముసలివాడు కాదు.మంచి యౌవ్వనం లో ఉన్న ఇరవైయారేళ్ళ యువకుడు.అతను ఆత్మహత్య చేసుకోలేదు.ఓవర్ హెడ్ క్రేన్ లో ఎదో ఎలెక్ట్రికల్ భాగం పాడైతే దాన్ని మరమ్మతు చేసేందుకు ఫోర్ మ్యాన్ పంపితే పైకి ఎక్కాడు.అప్పుడే జారిపడ్డాడు.నేలమీద పడినా బతికేవాడు కాదు.కానీ అప్పుడు అతని శరీరమన్నా దక్కేది.

ఆరోజు సాయంకాలం రాఖీ కట్టించుకునేందుకు అక్క దగ్గరకి వెళ్ళాలనుకున్నాడు.తరుణ్ ని కూడా తనవెంట రమ్మన్నాడు.పొద్దున్న పనిలోకొచ్చినప్పుడు కూడా ఇద్దరూ ఒకేసారి కంప్యూటర్ లో కార్డ్లు పంచ్ చేయించుకున్నారు!అవన్నీ గుర్తుకొచ్చి తరుణ్ కళ్ళనీళ్ళ పర్యంతమయాడు.

శరీరం కాలిపోతే వచ్చే ఘాటైన వాసన ఆ ప్రదేశమంతా అలుముకుంది.అది కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసేంతగా వ్యాపించింది.అక్కడ ఉన్న వర్కర్లు దాన్ని భరించలేక పోయారు.వాళ్లకి శ్మశానంలో ఉన్నట్టే అనిపించింది.తరుణ్ కీ భోరుమని ఏడవాలనిపించింది.ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్ళు ఆగలేదు.

డీ ఎమ్ అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు,"ఫ్రెండ్స్,సందీప్ ఎంతో అనుభవం ఉన్న ఎలెక్ట్రీషియన్,చాలా కష్టపడి పనిచేసేవాడు.ఈ దుర్ఘటన నన్ను బాగా కుదిపి వదిలింది.ఎవరో రిటైర్ అవబోతున్న వర్కర్ కావాలని పడ్డాడనుకున్నా గాని సందీప్ లాటి డైనమిక్ వర్కర్,స్మార్ట్ బాయ్ పడిపోయుంటాడని ఊహించలేదు.కానీ విధిని ఓడించటం ఎవరివల్లా కాదు.ఇప్పుడు మన ముందు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది."ఇంతవరకూ చెప్పాక డీ ఎమ్ ఒక రెండు క్షణాలు ఆగాడు.అందరి మొహాల్లోనూ కుతూహలం,అతను ఇంకా ఏం చెపుతాడో వినాలని.అది గమనించిన డీ ఎమ్ మళ్ళీ ఇలా అన్నాడు,"ఐ ఎస్ ఓ ౯౦౦౨ సర్టిఫికేట్ సంపాదించేందుకు ఒక ఏడాదిగా మనం ప్రయత్నిస్తున్నామని మీకు తెలుసు.ఆడిటింగ్ టీమ్ ఇక్కడికి వచ్చిందనీ మన డాక్యుమెంటేషన్ సిస్టమ్ ని ఆడిట్ చేస్తోందనీ కూడా మీకు తెలుసు.వాళ్ళు ఏ క్షణాన్నైనా షాప్ ఫ్లోర్ కి వచ్చి మిమ్మల్ని ఏమైనా అడగచ్చు.ఈరోజు ఈ విషాద సంఘటన జరిగిన వెంటనే నేనిలా మాట్లాడటం మీకు ఎబ్బెట్టుగా అనిపించచ్చు..."డీ ఎమ్ మళ్ళీ ఆగి అందరివైపూ ఒకసారి చూసి, మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు,"కానీ ఈ దుర్ఘటన వల్ల తలెత్తిన పరిస్థితుల  దృష్ట్యా ఇదంతా చెప్పవలసిన అవసరం వచ్చింది.మీకు ఈ సంగతి ముందే చెప్పటం అయింది,కానీ ఇవాళ ప్రత్యేకంగా మళ్ళీ చెపుతున్నాను ఐ ఎస్ ఓ ౯౦౦౨ ఇంటర్నేషనల్ స్థాయి సర్టిఫికేట్ మనకి దొరక్కపోతే మనం తయారుచేసిన వస్తువులు ఎవరూ కొనరు.పోటీ లో మనం వెనక్కే ఉండిపోతాం.అప్పుడు జరిగేదేమిటంటే, మన డిపార్ట్ మెంట్ మూతపడి మన భవిష్యత్తు కష్టాల్లో చిక్కుకుంటుంది." డీ ఎమ్ కి అందరి మొహాల్లోనూ ఆందోళన కనబడింది.వెంటనే తన ఉపన్యాసం కొనసాగించాడు,"ఒకవేళ ఆ ఆడిట్ టీమ్ కి ఇక్కడ ఇంత భయంకరమైన ప్రమాదం జరిగిందని తెలిసిపోతే మన గురించి వాళ్ళకున్న అభిప్రాయం దెబ్బతింటుంది.వాళ్ళు నెగెటివ్ రిమార్క్ రాసినా రాస్తారు.ఇటువంటి దుఃఖసమయంలో ఇదంతా మాట్లాడవలసి రావటం నాకు కూడా బాధగానే ఉంది,కానీ ఏం చెయ్యను,చనిపోయినవాళ్ళవెంట మనమూ పోలేం కదా? ఆఖరికి వాళ్ళ కుటుంబసభ్యులు కూడా ఎక్కువ రోజులు ఏడుస్తూ ఉండిపోరు...వాళ్ళ పనుల్లో మునిగిపోతారు!ఇది వినటానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే మనం చెయ్యక తప్పదు.సందీప్ చనిపోయిన సంగతి మనం మన మనసుల్లోనే పాతిపెట్టెయ్యాలి.గుండె రాయి చేసుకుని ఇక్కడేమీ జరగలేదని చెప్పాలి.ఈరోజు సందీప్ పనిలోకి రాలేదని చెపుతాం.మీ కోసం మీ మీ కుటుంబాల కోసం మీరిక్కడ ఒక ప్రమాదాన్ని చూసిన సంగతి మర్చిపోవాలి."

కొంతసేపు అక్కడ నిశ్శబ్దం తాండవించింది.చీకటిరాత్రి లాటి భయంకరమైన నిశ్శబ్దం!కానీ తరుణ్ మౌనంగా ఉండలేక పోయాడు,"అలా ఎలా చెపుతాం,సార్?"అంటూ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు.అతని కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి,"ఉదయం సందీప్ ,నేనూ ఒకేసారి డ్యూటీలోకొచ్చాం.అతని తలిదండ్రులకి అతని డ్యూటీ శాశ్వతంగా ముగిసిపోయిందని తెలియజేసే బాధ్యత మనమీద ఉంది.వాళ్ళు నన్నే అడుగుతారు.నేను అబద్ధం ఎలా చెప్పను?"అన్నాడు.అతను ఇక ఆపుకోలేక చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు.

డీ ఎమ్ అతన్ని ఓదారుస్తున్నట్టు నటించి,తరుణ్ ని ఒక ఆఫీసర్ ని సాయమిచ్చి తన చేంబర్ లోకి పంపేశాడు.తరవాత చాలా బాధపడుతున్నట్టు మొహం పెట్టి,"నేను తరుణ్ బాధని అర్థం చేసుకోగలను.కానీ ఇలాటి సమయంలో మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి.అతని కుటుంబంలోని ఐదారుగురికోసం ఇక్కడ పనిచేస్తున్న వందమంది కార్మికులు సమస్యకి గురవటం సరికాదు.అందుకని నేను మీకు ఇచ్చే చివరి సలహా, ఎవరూ సందీప్ కి జరిగిన ప్రమాదం గురించి నోరు విప్పద్దు.ఇది అందరి మంచికోసమూ నేను ఇస్తున్న సలహా.ఇక మీరు వెళ్ళి పనులు చూసుకోండి," అన్నాడు.


అక్కడినించి కదిలిన వాళ్ళందరి మొహాల్లోనూ పెద్ద బరువు మోస్తున్న భావం చోటు చేసుకుంది.వాళ్ళ గుండెల్లో ఉన్న భారమే వాళ్ళ మొహాల్లో ప్రతిబింబించింది.ఎటూ తేల్చుకోలేని ఒక సందిగ్ధావస్థ!డీ ఎమ్ మాటల్లో ఉత్త సలహా మాత్రమే లేదనీ అది ఒక ఆదేశమేననీ వాళ్ళకి అనిపించింది.అతను చెప్పినట్టు చెయ్యకపోతే ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందన్న బెదిరింపు కూడా ధ్వనించింది.

అక్కణ్ణించి డీ ఎమ్ తన గదిలోకెళ్ళాడు.ఏసీ తో చల్లగా ఉన్న ఆ గదిలో తరుణ్ కి అతను చల్లటి నీళ్ళు తాగటానికిచ్చాడు.అతని భావాలని గౌరవిస్తున్నానని తెలియజేసేందుకు,"తరుణ్,సందీప్ నీకు ప్రాణస్నేహితుడని నాకు తెలుసు.అతని మరణాన్ని తట్టుకోటం నీకు కష్టమే.కానీ నువ్వు చదువుకున్నవాడివి, తెలివైనవాడివి,కంపెనీ,అందులో పనిచేసేవాళ్ళ మంచికోసం నువ్వు మనసును దిటవుపరుచుకోక తప్పదు,"అన్నాడు.

"నాకేమీ చెప్పకండి సార్!ఒద్దు ఆ విషయం మాట్లాడద్దు.ప్రస్తుతం నేనేమీ వినే స్థితిలో లేను..."అన్నాడు తరుణ్ ఇంకా ఏడుస్తూ.మరుక్షణం అక్కడినించి బైటికి వెళ్ళి,సందీప్ పడిపోయిన బాల్చీ దగ్గరకెళ్ళాడు.సలసలా మరుగుతున్న ఆ ద్రవాన్ని కళ్ళార్పకండా చూడసాగాడు.మాంసం కాలిన కమురు వాసన ఇంకా వస్తూనే ఉంది.అతని మనసు ఆక్రోశిస్తూ ప్రశ్నించసాగింది-

’సందీప్,ఒరే సందీప్! ఇలా చనిపోయావేమిట్రా?పెద్ద పెద్ద ప్రమాదాల్లో నలిగిపోయి,చితికిపోయి,తెగిపోయి అందరూ చనిపోవటం చూశాను...శవాలు గుర్తుపట్టలేనంతగా తయారవుతాయి...కానీ నువ్వు , నువ్వు చనిపోయిన తీరు...శవం కూడా మిగల్లేదే!?ఇలాటి చావు ఇంతకుముందెన్నడూ చూడలేదు సందీప్!చూస్తూండగా నువ్వు మృత్యుముఖంలోకి వెళ్ళిపోయావు...ఎవ్వరం ఏమీ చెయ్యలేకపోయాం!మా కళ్ళముందే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.ఒక్క ఎముక,ఒక్క వేలైనా మిగల్లేదు కదరా గుర్తుకి?అసలు సందీప్ అనే మనిషి లేనేలేడన్నట్టు అయింది...ఎందుకిలా జరిగింది?

అసలు నేను ఇంతకుముందే నిన్ను హెచ్చరించాను.నువ్వెప్పుడూ ఒక్కడివే క్రేన్ పైకి ఎక్కిపోతూ ఉండేవాడివి.ఎంత చిన్న మరమ్మతైనా కరెంటుతో పని...అది చాలా ప్రమాదకరమైనది,అని పోయిన వారమే నీకు చెప్పాను...అంత పైకి ఒంటరిగా ఎక్కి ఏమీ చెయ్యకురా అని.అసలు కరెంటు పని అంటేనే ఇద్దరు మనుషులు ఉండాలి.

నువ్వేమన్నావు?’ఇదేమీ అంత ప్రమాదకరమైనది కాదులేరా, పేనల్ లో స్విచ్ ట్రిప్ అవుతుంది,దాన్ని సరిచెయ్యటమే.కానీ ఫోర్ మ్యాన్ కూడా ఎప్పుడూ నన్నొక్కణ్ణే వెళ్ళి బాగుచెయ్యమంటాడు.ఇక నేనొక చవటని,ఎదురుచెప్పటం కూడా రాదు!’అన్నావు.

ఇప్పుడేమో ఈ డీ ఎమ్ నీ చావు గురించి ఒక్క మాట మాట్లాదటానికి వీల్లేదంటున్నాడు.నన్నేం చెయ్యమంటావురా?

తరుణ్ మనసు ఇలా కొట్టుమిట్టడుతూనే ఉంది.ఇంతలో అతని భుజం మీద ఎవరిదో చెయ్యి పడింది.అది అతని మరో స్నేహితుడు,కేతన్ చెయ్యి."తరుణ్ ఇక్కడ అలా ఎంతసేపు నిలబడ్డా నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు.పద,పోదాం!"అన్నాడు కేతన్.

వాళ్ళ వెనకాల విభాగంలోని ఆఫీసర్లు నిలబడి ఇటే చూస్తున్నారు.వాళ్ళ హావభావాలు,’నాటకాలు చాలు,చెప్పినట్టు వినకపోతే అనుభవిస్తావు!’అన్నట్టు గా ఉన్నాయి.

కొంతసేపటికి ఆ పెద్ద పాత్ర ని ఓవర్ హెడ్ క్రేన్ సాయంతో పైకి ఎత్తసాగారు.తరుణ్ వాళ్ళు ఏం చేస్తారా అని ఆశ్చర్యంగా చూడసాగాడు.క్రేన్ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ౧౬౦౦ సెంటిగ్రేడ్ లో మరిగించేందుకు వెసల్ లో పోసేసింది.సందీప్ శరీరం తాలూకు చిన్న చిన్న ముక్కలేవైనా మిగిలుంటే అవి కూడా ఇక కరిగిపోతాయి.ఇది చూసి సందీప్ కి పట్టిన దుస్థితికి తరుణ్ మరింతగా కుమిలిపోయాడు.అతని అంతరాత్మ ఘోషించింది...అయ్యో సందీప్!నీ ఒళ్ళు ఇప్పుడు పూర్తిగా ఉక్కుతో కలిసిపోయింది.అంటే ఇప్పుడు నువ్వు ఒక వంతెనగానో,రైలు కమ్ములుగానో...ఒక ఓడలో భాగంగానో మారిపోతావు!లేకపోతే పార,గునపం.పైపు,స్తంభం,కత్తి,రివాల్వర్... ఏ వస్తువుగానైనా మారిపోయి గుర్తుపట్తలేకుండా పోతావు!మళ్ళీ మనిషిగా మాత్రం మారలేవు.కొత్తగా కాపరానికి వచ్చిన నీ భార్య,వయసుమళ్ళిన మీ నాన్న...ఎవరికీ నీ ఆచూకీ కూడా తెలీదు.బతికున్నావో లేదో కూడా తెలియనివ్వద్దంటున్నారు ఈ రాక్షసులు!వాళ్ళు మాత్రం కొన్ని వేల లక్షల టన్నుల ఉక్కు తయారు చేస్తూ లాభాలు గడిస్తూ ఉంటారు.

కేతన్ మళ్ళీ తరుణ్ వీపు తట్టి,"పద తరుణ్!ఇక సందీప్ ని మర్చిపో,అతను ఇక మనకి కనిపించడు.ఇంటికెళ్దాం పద!" అన్నాడు.

"కానీ కేతన్...సందీప్ ఉదయం ఇక్కడే ఉన్నాడు...ఇదే చోట!"

"అలాగని చెప్పేందుకు ఎటువంటి సాక్ష్యమూ మిగల్లేదు బ్రదర్!"

"కంప్యూటరుంది...ఇక్కడ ఆ సంఘటన చూసిన వాళ్ళెంతమందో ఉన్నారు...నేనున్నాను!"

"అవును,కంప్యూటర్ లో అతని అటెండెన్స్ ఉంది,కానీ ఇప్పుడు దాన్ని చెరిపేశారు.అందరూ అతని పేరు చూశారు,కానీ చూడనట్టు నటిస్తున్నారు.నువ్వొక్కడివే మిగిలావు, నువ్వు నిర్ణయించుకో ఏం చేస్తావో...సందీప్ చావు గురించి అందరికీ చెపుతావా?నీ ఉద్యోగాన్ని రక్షించుకుంటావా?"

సందీప్ తండ్రి ఇదే ఫేక్టరీలో పనిచేసి రిటైర్ అయాడు.చాలా రోజులవరకూ ఆయన సందీప్ కోసం అన్నిచోట్లా వాకబు చేస్తూనే ఉన్నాడు.అందరి మొహాలమీదా ముసుగులున్నాయని తెలుసుకోటానికి ఆయనకి ఆట్టే కాలం పట్టలేదు.తరుణ్ అబద్ధం చెప్పవలసివస్తున్నందుకు లోలోపల విపరీతంగా మధనపడసాగాడు.చివరికి ఒక నిశ్చయానికి వచ్చి,సందీప్ ఇంటికి బైలుదేరాడు.కానీ దారిలోనే సందీప్ వాళ్ళ నాన్న అతనికి ఎదురుపడ్డాడు...ఆయన మొహంలో వేదన,నిరాశ,దిగులు...తరుణ్ ఆయనతో,"నేను మీ ఇంటికే బైలుదేరానండీ,’అన్నాడు.

ఆయన ఒకసారి తరుణ్ కేసి విచిత్రంగా చూసి,"నీకెందుకు బాబూ కష్టం!నేనే వస్తున్నా మీ ఇంటికి...నీ మౌనాన్ని వినేందుకు...నీ మనసు పడే సంక్షోభాన్ని చూసేందుకు!"అన్నాడు.

తరుణ్ మొహంలో నిస్సహాయతని చూసి మళ్ళీ ఆయనే, ’ఒక పాతిక ముప్ఫై ఏళ్ల క్రితం కార్మికులలో ఎంత వేడి...ఎంత ఐకమత్యం ఉండేదనుకున్నావు?ఏదైనా అన్యాయం జరిగితే అందరూ ఏకమై ఎదిరించేవారు...పోరాడేవారు...అప్పట్లో ఇన్ని సౌకర్యాలు కూడా లేవు...ఎప్పుడూ అన్నిటికీ కొరతే, ఎన్నో రకాల కష్టాలుండేవి...ఐనా ఐకమత్యమే బలంగా ధైర్యంగా ఎదుర్కొనేవాళ్ళం!"అన్నాడు.

కొంచెంసేపు ఆగి ఆయన తరుణ్ మౌనాన్ని ఛేదించేందుకు మళ్ళీ,"ఇవాళ అందరికీ అన్ని రకాల సౌకర్యాలూ ఉన్నాయి,కొత్త కొత్త సాధనాలున్నాయి,ఐనా వీళ్ళ మనస్తత్వం ఎంత మారిపోయింది.మనకేమిటి అనేదే అందరి ఆలోచనా.కంపెనీ లోపల ఐనా బైట ఐనా ఏమైనా జరిగితే పెదవి విప్పరు కదా!"అన్నాడు.

ఆయాసం తీర్చుకునేందుకు కొంచెం ఆగి,"నేను పనిచేసే రోజుల్లో ఒకసారి ఒక వర్కర్ చెయ్యి తెగిపోయింది.అతను పరధ్యానంగా ఉండటంవల్లే అలా జరిగిందని మేనేజ్ మెంట్ నష్టపరిహారం ఇవ్వనంది.అతనికి నష్టపరిహారం ఇప్పించేందుకు మొత్తం కార్మికులందరూ సమ్మె చేశారు.అభివృద్ధి జరగాలంటే పోరాటం అవసరం...అలా వ్యతిరేకాన్ని తెలియజేసే ధైర్యం లేకుండా పోయిందంటే ఇక చెడ్డరోజులు వచ్చాయనే అనుకోవాలి!"అన్నాడు.

సందీప్ వాళ్ళ నాన్న మాటలు వింటున్నకొద్దీ తరుణ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి.కొంతసేపు మౌనంగా ఉన్నాక,ఆయన కళ్ళు చెమర్చాయి,గొంతు మూసుకుపోయింది.వణికే గోంతుతో,"బాబూ,వాడు నీకు చిన్నప్పట్నించీ తెలుసు.మీరిద్దరూ ప్రాణస్నేహితులు.వారం రోజులైంది...ఇప్పటివరకూ నీ నోటంట ఒక్క మాట కూడా రాలేదు.నీ మనసులో జరిగేసంఘర్షణ నాకు అర్థమౌతూనే ఉంది,తరుణ్!నువ్వు ఏం చెపితే అదే నిజమని నమ్ముతాను.చెప్పు...ఫేక్టరీలో మరిగే ద్రవంలో పడి కాలిపోయింది సందీపే కదూ?...చెప్పు తరుణ్..మావాడే కదూ? అక్కడక్కడా అలాటి మాటలేవో నాకు వినిపించాయి.నువ్వైతే అబద్ధం చెప్పవని నిన్ను అడుగుతున్నాను...చెప్పు,బాబూ!"అన్నాడు.

ఇక తరుణ్ సంబాళించుకోలేకపోయాడు.ఆయన్ని వాటేసుకుని భోరుమని ఏడ్చాడు."అవును ...వాడు సందీపే అంకుల్!...మీ అబ్బాయి సందీప్!నా ప్రాణస్నేహితుడు సందీపే!  నేను సందీప్ కన్నా అభాగ్యుణ్ణి... దరిద్రుణ్ణి.అసలు చచ్చిపోయింది నేనే...వాడు పోయాడని మీకు చెప్పే ధైర్యం కూడా నాకు లేకపోయింది..."

ఆ పైన తరుణ్ మాట్లాడలేక పోయాడు.సందీప్ తండ్రి తరుణ్ వీపు నిమురుతూ ఓదారుస్తూ ఉండిపోయాడు...ఇద్దరి కళ్ళలోంచీ కన్నీళ్ళు ధారాపాతంగా కారిపోతూనే ఉన్నాయి... .

------------------------------------------------------------------------------------

హిందీ మూలం : జైనందన్

అనువాదం : ఆర్.శాంత సుందరి