Friday, April 1, 2011


ఆర్తనాదం
========

శవం కుళ్ళిపోయింది.అవయవాలన్నీ చూసేందుకు వికృతంగా ఉన్నాయి.ఒక వారంక్రితం ప్రాణాలు పోయుంటాయేమో బహుశా.నాకు కబురు ఆలస్యంగా అందింది.నా మంచి కోరేవాళ్ళకి కూడా ఇంత ఆలస్యంగా ఈ సంగతి ఎలా తెలిసిందో!ఎంతో కష్టం మీద, ఎన్నో సమస్యలని ఎదుర్కున్నాక నేను వాళ్ళ సానుభూతిని పొందగలిగాను.ఇంతకు ముందైతే శవం ఎంత దూరాన కనిపించినా వెంటనే నాకు కబురు చేసేవాళ్ళు.

సరే,ప్రస్తుతం భయంకరమైన చావుకి గురైన ఆ శవాన్ని గుర్తించటం అంత తేలికేమీ కాదు.కానీ నా మనసులో ఆయన శరీరంలోని కొన్ని గుర్తులు ముద్రవేసుకుని ఉండిపోయాయి.వాటి ఆధారంతో ఈ శవం తప్పకుండా నా భర్తదే అని నేను కచ్చితంగా చెప్పగలను.రాత్రి డ్యూటీ చేసేందుకు ఇంటినించి ఫ్యాక్టరీ వరకూ ఉన్న నాలుగు మైళ్ళ దూరం ఎప్పుడూ నిర్జనంగానే ఉంటుంది.ఆయన కనపడకుండా పోయిన ఈ అర్నెల్లలో ఇది పన్నెండో శవం.ఇంతకు ముందు కబురందగానే వెళ్ళి పదకొండు శవాలనీ చూసి వచ్చాను.అన్నిటిలోనూ నా భర్త ఆనవాళ్ళు కనిపించి ఆ శవం ఆయనదే అని గట్టిగా చెప్పాను.ఎందుకంటే ఆ పదకొండు శవాల్లోనూ ఒక విషయం సమానంగా కనిపించింది...ఒక్క శవానికీ మొహం పూర్తిగా లేదు.

కానీ నేను గుర్తుపట్టటంలో నా లెక్కన ఎటువంటి పొరపాటూ లేనప్పటికీ,వాటిలో దేనినీ కూడా వాళ్ళు నాకు అప్పగించలేదు.అందరూ నాకు మతిస్థిమితం లేదని అనుకుంటారు...భర్త కనిపించకుండా పోయేసరికి నాకు కొద్దిగా పిచ్చెక్కిందని వాళ్ళ ఉద్దేశం.ఒకే మనిషివి ఇన్ని శవాలు ఉంటాయని నేననటంతో,వాళ్ళ అభిప్రాయం మరింత బలపడుతుంది.పైగా నేను ముత్తయిదువలా,బొట్టూ,పూలూ, మంగళసూత్రం ఏవీ తియ్యకుండా ఉండటం వాళ్ళకి మరీ ఆశ్చర్యం!శవాలని చూసినకొద్దీ నా భర్త మరణించలేదన్న నమ్మకం ఎక్కువవుతోందని వాళ్ళని నమ్మించటం నాకు మరీ కష్టంగా ఉంది.పన్నెండో శవాన్ని చూసేందుకు వెళ్ళినప్పుడు, నా శ్రేయోభిలాషులకి అది కూడా నా భర్తదే అని నేనంటానని నమ్మకం కలిగిపోయింది...నిజంగా నేను కూడా అదే చేశాను.నేను చేసింది తప్పా ఒప్పా,ఈ విషయం నిష్పక్షపాతంగా నిర్ణయించబడాలనే నేను మిమ్మల్ని ఎలుగెత్తి కోరుతున్నాను.

మొట్టమొదటి శవం ఇక్కడికి ఒకటి రెండు మైళ్ళవతల,సువర్ణరేఖ నదొడ్డున,ఒక గోనెసంచిలో మూటకట్టబడి ఉన్నది కనిపించింది.దాన్ని చూడగానే నేను  కెవ్వుమని అరిచాను.శవం ఒంటినిండా కత్తిపోట్లు...సందులేకుండా!నా కళ్ళతో ఇలాటి భయంకరమైన హింస చూడటం నాకిదే మొదటి సారి.శవం రెండు చేతుల గుప్పిట్లూ గట్టిగా మూసి ఉన్నాయి.నా భర్త కూడా ఎప్పుడూ గుప్పిట్లు మూసుకునేవాడు.శవం నల్లరంగులో ఉంది.నా భర్త తెల్లగా ఉంటాడు.కానీ ఫ్యాక్టరీ ఫర్నేస్ ముందు పనిచేసేప్పుడు ఆయన ఒంటి రంగు నల్లగా మారేది.ఆయన ఛాతీ మీద ఒత్తుగా పెరిగిన వెంట్రుకల మధ్య గాయంతాలూకు మచ్చ ఉందన్న సంగతి నాకు మాత్రమే తెలుసు.ఆ మచ్చ ఆ శవం మీద కూడా ఉంది.అందుకే అది నా భర్త శవమని నేను అనటం న్యాయమే అనుకున్నాను.

నేను గుర్తుపట్టిన మరుక్షణం అక్కడికి ఒక వృద్ధ దంపతులిద్దరు వచ్చారు.చేతివేళ్ళూ,మొహంలో మిగిలిఉన్న ఒకేఒక అవయవం ముక్కూ చూసి, అది వాళ్ళ అబ్బాయి శవమని అన్నారు.నిజంగానే శవం ముక్కూ,చేతివేళ్ళూ ఆ ముసలాయనకి కార్బన్ కాపీ లాగే ఉన్నాయి!నేనేం చెప్పినా లాభంలేదని తెలిసిపోయింది.వాళ్ళకా శవాన్ని ఇవ్వకపోతే వాళ్ళు తట్టుకోలేరు.పైగా వాళ్ళబ్బాయి, చదువుకున్న నిరుద్యోగుల సంఘానికి సెక్రటరీ అన్న విషయం కూడా నాకు తెలిసింది. నా భర్త ఫ్యాక్టరీలో విపక్ష యూనియన్ తాలూకు ఉగ్రవాద నివారణ సంఘర్ష సమితికి సెక్రటరీ.

మరయితే మీరే చెప్పండి...అది నా భర్త శవం కాదంటారా?

రెండో శవం ఎనిమిది మైళ్ళవతల,ఒక పేటలో వాటర్ ట్యాంక్ వెనక దొరికింది.దాని చాతీ నిండా తూటాల గుర్తులు.నేనక్కడికి చేరుకునేసరికి ఇంకెవరో మనిషి ఆ శవాన్ని తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఆ శవం తన అన్నదని అంటున్నాడతను.అన్యమనస్కంగానే ఆ శవానికీ నా భర్తకీ ఏమైనా పోలిక ఉందా అని వెతుకుతూండగా, ఆశ్చర్యానికి గురయ్యాను.
ఎక్కడైనా అన్యాయం కనబడితే నా భర్త దవడలు అలాగే బిగించేవాడు.శవం పొట్టిగా ఉంది,కానీ నా భర్తతో పరిచయం ఉన్నవాళ్ళు ఆయన పొడుగ్గా ఉండేవాడని మీకు చెపుతారు.కానీ వాళ్ళే ఇంకో సంగతి కూడా చెప్పేవాళ్ళు.అన్యాయాన్ని ఎదిరించి ఓడిపోయినప్పుడల్లా ఆయన ఎత్తు కుంచించుకు పోయెదట!నా భర్తకీ ఈ శవానికీ మరో అద్భుతమైన పోలిక ఉంది- ఈ శవానికి లాగే ఆయనకి కూడా ఎడమ తొడ మీద ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంది.ఇక ఈ శవం నా భర్తదే అని అనటం న్యాయమే.

కానీ ఆ రెండో వ్యక్తి,తిరుగులేని రెండు రుజువులు చూపించి ఆ శవం తన అన్నదేనని నిరూపించాడు.అన్నదమ్ములందరికీ బొడ్డు పైకి ఉబ్బి ఉంటుందనీ,ఎత్తుతో పోలిస్తే మణికట్టు చాలా చిన్నదనీ అతను రుజువులు చూపించాడు.ఇక నేనేమంటాను? అయినా కుతూహలం ఆపుకోలేక ఆ చనిపోయిన మనిషి వివరాలు అడిగాను.అవి వినగానే నా బుర్ర తిరిగిపోయింది.అతను కూడా తరచు,మోసగాళ్ళతోనూ,అబద్ధాలకోర్లతోనూ గొడవలు పెట్టుకునేవాడట.మా ఆయన కూడా మరి అంతే!

మీరే చెప్పండి ఆ శవం నా భర్తదని చెప్పటం తప్పా?

మూడో శవం పదిమైళ్ళ దూరాన,జిల్లా సరిహద్దులకి కొంచెం ఇవతల దొరికింది.ముక్కూ మొహం పూర్తిగా పచ్చడైపోయి ఉన్నాయి.గుర్తించటం కష్టమే.కానీ పెద్దపెద్ద కళ్ళు సూటిగా చూస్తున్నాయి...అచ్చం మా ఆయన కళ్ళలాగే.ఆయన ఎప్పుడూ కళ్ళు దించుకుని కాని,చూపులు మరల్చుకుని కాని ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.ఎవరైనా ఆయన్ని బెదిరించాలని చూస్తే ఆ కళ్ళు నిప్పులు చెరిగేవి.శవం బక్కపల్చగా ఉన్న వ్యక్తిది.మా ఆయన్ని తెలిసినవాళ్ళకి ఆయన బొద్దుగా ఉండేవాడని గుర్తుండేఉంటుంది.ఐనా,తప్పనిసరి డ్యూటీకి వెళ్ళేప్పుడు మాత్రం ఆయన రక్తం ఆర్చుకుపోయి,ఒళ్ళు కుంచించుకుపోయేదన్న సంగతి నాకు మాత్రమే తెలుసు.నా భర్తకి లాగే ఈ శవానికి కూడా  అరచేతులు బాగా ఒరుసుకుపోయి బండగా ఉన్నాయి.ఈ శవం నా భర్తదేనని నేను ప్రకటించచ్చు అనుకున్నాను.కానీ ప్రతిసారీ జరిగినట్టే ఈసారి కూడా ఇంకెవరో ఇది మాదంటూ వచ్చారు.వాళ్ళు కుటుంబసభ్యులతో వచ్చారు.అందరి మొహాల్లోనూ బోలెడంత నమ్మకం కనిపించింది.

అంతమందినీ తప్పని నిరూపించటం నాకు కష్టమైపోయింది.పోయిన వ్యక్తి గుణగణాల గురించి, అతనెంత దయాగుణం కలవాడో,ప్రేమకి ప్రతిరూపంలా ఎలా ఉండేవాడో ,ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి ఎలా సాయం చెసేవాడో చెపుతూంటే,నేను అవాక్కయి వినసాగాను.వాళ్ళు చెపుతున్నది తమ బంధువు గురించా లేక నా భర్త గురించా అన్న అనుమానం కలిగింది.

మీరే చెప్పండి ఇది నా భర్త భౌతిక దేహమని నేనెలా అనకుండా ఉంటాను?

నదిలో కొట్టుకొచ్చి ఇక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో దక్షిణాన ఉన్న ఒక ఊళ్ళో ఒడ్డుకు చేరిన ఒక శవం గురించి నాకు కబురు అందింది.ఆయన కనబడకుండా పోయాక ఇది నాలుగో శవం.తలా,మొహం పూర్తిగా ధ్వంసమైపోయి ఉన్నాయి.పొడుగాటి మెడా,నీళ్ళలో నాని ఉబ్బిపోయిన ఛాతీ చెక్కుచెదరలేదు.దాన్ని జాగ్రత్తగా గమనించాక ఇది నా భర్తదే అని చెప్పాలని నిర్ణయించుకున్నాను.కానీ నాకూడా వచ్చినవాళ్ళు ఒప్పుకోలేదు.నా భర్త మెడ పొట్టిగా లావుగా ఉంటుందని వాదించారు.ఆకాశంవైపుకి ఎప్పుడు తలెత్తి చూసినా,లేక దూరంగా ఉన్న దేన్నైనా గురిచూడాలన్నా ఆయన మెడ పొడుగ్గా సాగేదని ఎలా వాళ్ళని నమ్మించటం?

నేనీ శవం మీద నా హక్కుని తెలియచేసేలోపలే,ఇంకెవరో వచ్చి అది తన బంధువుదని అంటారని ఎదురుచూశాను.సరిగ్గా అలాగే జరిగింది.పెద్దచప్పుడుతో ఒక పోలీస్ వ్యాన్ వచ్చి అక్కడ ఆగింది.దాన్లోంచి పోలీసులు దిగి శవం ఆచూకీ తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు.చివరికి అది క్రితం రాత్రి అపహరించబడ్డ ఒక లోకల్ మంత్రిదని తేల్చారు.ఆ మంత్రి చాలా నిజాయితీ గలవాడనీ, ప్రజలకోసం కష్టపడతాడనీ,అవినీతినీ అక్రమాలనీ సహించడనీ చెప్పుకుంటారు.అసెంబ్లీ మళ్ళీ సమావేశమైనప్పుడు, భుజబలంతో కొట్టుకొస్తున్న ఒక మంత్రి బండారం బైట పెట్టబోతున్నాడనీ, అందుకని అతనికి చాలా రోజులనించీ బెదిరింపులు వస్తున్నాయని అన్నారు.

మరీ విడ్డూరంగా ఉందే! వీళ్ళంటున్నది నా భర్త గురించే!ఫ్యాక్టరీలో జరిగే మోసాలూ,అక్రమాల గురించి ఆయనెప్పుడూ క్షోభ పడుతూ ఉండేవాడు.కార్మికులందర్నీ కూడగట్టుకుని, అలాటివాళ్ళ గుట్టు రట్టుచేస్తానని ప్రకటించేసరికి, ఆయనకి బెదిరిస్తూ ఫోన్లూ, ఉత్తరాలూ రాసాగాయి.

మరి ఈ శవం మా ఆయనది కాదని అనగలనా? మీరే చెప్పండీ!

మా ఇంటి నించి మైలు దూరంలో దొరికిన శవానికి తల లెదు!  శవంలోని కొన్ని భాగాలని జంతువులూ పక్షులూ పీక్కు తినేశాయి.అయినప్పటికీ ఒకే మనసు రెండు తనువులుగా బతికాం కాబట్టి,నేను నా భర్తలోని కొన్ని లక్షణాలని గుర్తుపట్టగలిగాను!ఆయన తన గోళ్ళు ఎప్పుడూ కత్తిరించుకునేవాడు కాదు.వాటిని ఆయుధాల్లాగ కాపాడుకునేవాడు.ఆయన అరికాళ్ళు పగుళ్ళతోనూ,గాయలతోనూ నిండి ఉండేవి.డ్యూటీ చేశాక చెప్పుల్లేని కాళ్ళతో నడవటం ఆయనకి అలవాటు.బైటికి కూడా అలాగే వెళ్ళేవాడు.రాళ్ళూ రప్పలూ మనకి సమస్యలని ఎలా ఎదుర్కోవాలో అలవాటుచేసే ఆయుధాలని అనేవాడు.అంతేకాక,అలా ఉత్తి కాళ్లతో నడవటం వల్ల,మట్టి స్పర్శ తగిలి,మనలో కూడా నేలతల్లి అంటి ఓర్పూ,సహనమూ అలవడతాయనీ,మట్టిలోని సారవంతమైన గుణం మనలో వచ్చి చేరుతుందనీ నమ్మేవాడు.నేను శవాన్ని గుర్తుపట్టి,మావాళ్ళు నాకు వత్తాసు పలికేలోపల అక్కడికి ఒక పెద్ద గుంపు వచ్చింది.వాళ్ళు చాలా లోతుగా అన్ని విషయాలూ పరీక్షించి,ఆ శవం తమదేనని ఘంటాపధంగా చెప్పేశారు.శవం తమ ఊళ్ళోని ఒక అనాథ యువకుడిదనీ, వ్యవస్థని నిర్భయంగా ఎదిరిస్తూ,అందరికీ పక్కలో బల్లెంలాగ తయారయాడనీ,దళితులూ,పీడితులూ,పేదవాళ్ళతరఫున వాళ్ళ ఆర్తనాదాలని విద్రోహంగా మార్చే ప్రయత్నం చేస్తూ ప్రజలకి ఎంతో ప్రియమైన వ్యక్తిగా తయారయ్యాడనీ.తనగురించి ఏమాత్రం ఆలోచించుకోకుండా ఇతరుల కోసమే జీవించటం అతనికి ఆనందమనీ,అతను ఎప్పుడు ఎక్కడ వెనక్కి తిరిగి చూసినా, ఒక పెద్ద గుంపు ఆర్తనాదాలూ, కేకలతో కనిపించేదనీ,విద్రోహం అతని వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారిందనీ వాళ్ళు చెప్పుకొచ్చారు.తుఫానులూ,మాడ్చే ఎండలూ,లోకంలో ఎదురయ్యే  నేలా తలమీద ఆకాశం లేని వాళ్ళంతా తలదాచుకునేందుకు అతనిమీదే ఆధారపడసాగారు.సుడిగాలులూ, తుఫానులూ,మాడ్చే ఎండలూ,ఈ లోకంలోని మనుషుల నిర్దయతో కూడిన ప్రవర్తనా,మొదలైన చెత్తా చెదారంలోంచి పుట్టగొడుగులా భూమ్యాకర్షణ శక్తిని సవాలు చేస్తున్నట్టు తలెత్తుకుని నిలబడసాగాడు.అందుకే వ్యవస్థని పోషించే శక్తులు అతన్ని ఛిన్నాభిన్నం చేసేశాయి.

మీకు నమ్మకం కలగపోవచ్చు కాని, నా భర్తలో కూడా ఈ లక్షణాలన్నీ ఉన్నాయి.ఇలాటి అగ్గే ఆయనలోనూ ఎప్పుడూ మండుతూ ఉండేది.తన జీతాన్ని ఎవరెవరికో ధారాదత్తం చేసేశేవాడు.రేపెలాగ అని ఆలోచించటమే ఆయనకి ఇష్టముండేది కాదు.తన రేపు _ క్షణక్షణం అయోమయమైన భవిష్యత్తు అనే సుడిగుండంలో మెడలోతున చిక్కుకున్న అన్ని లక్షలమంది రేపుకి _ విరుద్ధంగా ఎందుకుండాలని ఆయన అనేవాడు. చిరుగులుపట్టి మాసిపోయిన నా బట్టలు చూడండి,పడిపోయేట్టున్న నా ఇంటిని చూడండి...మీకే తెలుస్తుంది.

చెప్పండి, ఈ శవం మీద నాకు హక్కుందని చెప్పటానికి ఇంకేమి రుజువులు కావాలి?

నా వాదనని ఇలా చాంతాడులా ఇంక పెంచదలచుకోలేదు నేను.తరవాత ఆరు శవాల విషయంలో కూడా నాకు ఇలాటి అనుభవాలే ఎదురయ్యాయి.అన్ని శవాలూ,మనిషిలోని ఆటవిక ప్రవృత్తికీ, క్రూరత్వానికీ పరాకాష్ఠగా కనిపించాయి.నా ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నంత బాధ కలిగింది.ఒంట్లోని రక్తమంతా, ఎముకలూ మాంసంతో సహా,కన్నీళ్ళరూపంలో కారిపోయినట్టనిపించింది.నేనొక కన్నీటి చారికగా మిగిలిపోయానని చూసినవాళ్ళందరూ అంటున్నారు.

ప్రస్తుతం నేను అక్రమాల పడవలో ఎక్కి,దుఃఖాల సముద్రంలో సుడిగూండాల మధ్య  చిక్కుకుని ప్రయాణం చేస్తున్నాను.నావ మునుగిపోయేముందు బహుశా ఇదే నా ఆఖరి ఆర్తనాదమేమో!పన్నెండో శవాన్ని చూసే చిత్రహింసకి గురి చేస్తున్నారు నన్ను.ఈ శవం పూర్తిగా కుళ్ళిపోయి దుర్గంధంతో నిండి ఉంది.ఊళ్ళోవాళ్ళు దాన్ని  కాకులూ,రాబందులూ,కుక్కలూ నక్కలూ పీక్కు తినకుండా దానిమీద తాటాకులు కప్పారు.ప్రాణంతో ఉన్నప్పుడు శరీరం మీద ఎంత ఘోరమైన,క్రూరమైన దాడులు జరిగినా పట్టించుకోని మనుషులకి శవాన్ని చూడగానే ఎందుకనో మనసు కరుణతో నిండి పోతుంది!బహొశా మనసు లోతుల్లో, జీవితం సారహీనంగా ఉండటం గురించీ, పరలోకం గురించీ ఆలోచనలు చుట్టుముడతాయేమో!

మిగతా శవాల గురించి నెను చెప్పినలాంటి లక్షణాలే ఈ శవాం విషయంలో కూడా కనిపించింది. శవం నోరు తెరుచుకుని ఉంది.నా భర్త కూడా అన్యాయాన్ని చూస్తే నోరుమూసుకుని ఉండలేకపోయేవాడు.ఈ శవం మాదని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఎవరూ కనిపించలేదు.అది అనాథ శవం.మేలుకోరేవాళ్ళమని చెప్పుకుంటూ నా వెనక తమాషా చూసేవాళ్ళందరూ కలిసి,శవాన్ని తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు.పోస్ట్ మార్టం అవీ చేయించటానికి మేం పోలీస్ స్టేషనుకి వెళ్ళాల్సివచ్చింది.

పోలీసులు శవాన్ని చూస్తూనే ఎదో ఆలోచనలో పడ్డారు.వాళ్ళ నుదుటిమీద ముడతలు పడ్డాయి.ఎన్నో పోలీస్ స్టేషన్లలో ఉద్ధార్ సింగ్ అనే దోపిడీ దొంగ ఫొటోలు ఉన్నాయి...అతనికీ ఈ శవానికీ వాళ్ళకి పోలికలు కనిపించాయి.ఉద్ధార్ సింగ్ ని బతికుండగా కాని, చనిపోయాక గాని పట్టుకున్నవాళ్ళకి లక్ష రూపాయల బహుమానం ప్రకటించబడింది.పోలీసులు తమ ఫైల్లోంచి ఆ దోపిడీ దొంగ ఫొటోలని బైటికి తీసి శవం మొహంతో పోల్చి, ఇది వాడి శవమేనని నిర్ధారించారు.

ఉద్ధార్ సింగ్ గురించి పోలీసులకి బాగా తెలుసు.వాడు డబ్బున్నవాళ్ళని దోచుకుని పేదలకి దానం చేసేవాడు.నేరప్రపంచంలో అడుగుపెట్టినప్పటికీ వాడికి దళితులన్నా,పీడితులన్నా, పేదలన్నా వల్లమాలిన జాలి.వాళ్ళకి అతనే దేవుడు.అవినీతినీ అక్రమాలనీ ఎదుర్కొనే మిత్రుడు.దేశాన్ని పాలించే నేతలని హెచ్చరిస్తూ వాడు గోడలనిండా పోస్టర్లు అతికించేవాడు...వెంటనే మీ వైఖరిని మార్చుకున్నారా సరే,లేకపోతే మీ అంతుచూస్తాను! అని ఆ పోస్టర్లమీద రాసేవాడు.

మా ఆయన కూడా ఫ్యాక్టరీలో కార్మికుల పక్షం వహించి యజమానులతో ఇలాటి పోరాటాలే చేసేవాడని చెప్పనవసరం లేదనుకుంటాను.ఆయన కనపడకుండా పోవటం వెనక ఇలాగే ఏ శక్తులో ఆయన్ని మట్టుపెట్టినవాళ్ళకి పెద్ద మొత్తాన్ని ఎర చూపి ఉంటాయి.

మరి చెప్పండి ఈ శవాన్ని మా ఆయనదిగా గుర్తించి తప్పు చేశానా?

ఈ విధంగా ఆరు నెలల్లో పన్నెండు ఘోరాతిఘోరమైన హత్యలు!కానీ నాకు దొరికిందేమీ లేదు.ప్రతిసారీ దుఃఖం వెల్లువై పొంగి పొర్లేది.నేను వితంతువునో  సుమంగళినో తెలీని స్థితి...ఆ సంధిరేఖ మీద తదబడుతూ!నా భర్త బతికిలేడని నాకు తెలుసు.అలాగే ఆయన వదిలివెళ్ళిన అడుగుల చప్పుడూ,మంచి గుణాల సువాసనా ఎప్పటికీ చనిపోవని కూడా నాకు తెలుసు.పన్నెండు కాదు లక్ష శవాలు చూసినా అది మాత్రం మారదు.

సోదర సోదరీమణులారా,మీరు న్యాయం,పోరాటం పక్షాన ఉన్నట్టయితే నాదొక మనవి...మీ చుట్టుపక్కల అనాథ శవమేదైనా కనిపిస్తే...దాని రంగూ,ఆకారం,ఎత్తూ ఏదైనప్పటికీ,ఆ శరీరంలోంచి,మంచితనం,ఆత్మగౌరవం,నిజాయితీ తాలూకు సుగంధం వస్తున్నట్టయితే,ఆ శవం మాదని చెప్పే వారసులెవరూ రాకపోతే,అది తప్పకుండా నా భర్తదే అని గ్రహించండి.ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నాకు కబురందించండి.మీరు నాకెంతో ఉపకారం చేసినవారవుతారు!

*******************************************************************************************************************************

హిందీ మూలం : జయనందన్

అనువాదం :ఆర్.శాంత సుందరి








No comments:

Post a Comment