Monday, November 19, 2012




తెగని బంధాలు
-------------


శకుంతలకి జనవరిలో పెళ్ళయింది. నేను పగలంతా మా నాన్న పెట్టిన సైకిల్ షాపులో పని చేస్తూ గడిపేస్తాను. కానీ పొద్దుపోయాక నా మనసు ఎటో వెళ్ళిపోతుంది. పని మీద ధ్యాస పెట్టలేకపోతాను. అందుకే ఏదో ఒక సాకుతో బైటికెళ్ళిపోతాను. జనవరి నెలలో సాయంకాలమవగానే చలి ప్రారంభమవుతుంది. తన వాడి గోళ్ళతో ఒళ్ళంతా రక్కటం మొదలు పెడుతుంది. నేను ఒకప్పుడు శకుంతలతో కలిసి తిరిగిన ప్రదేశాలన్నీ ఒకసారి చుట్టబెట్టి, ఆమె జ్ఞాపకాలలో తడిసి ఇంటికి చేరతాను.
ఎంత చలిగా ఉన్నా ఓవర్ కోట్, మఫ్లర్, మేజోళ్ళు, షూలు లాంటివి తొడుక్కోను. మామూలుగా ప్యాంటూ, షర్టూ, స్వెటర్, చెప్పులూ వేసుకుంటాను. చలి నన్ను బాధ పెడుతుంది. వేళ్ళ కొసల్నించి ఒళ్ళంతా పాకుతుంది. ప్రేమని పోగొట్టుకున్నందువల్ల కలిగే బాధలో అది కూడా ఒక భాగమేననీ, దాన్ని భరించక తప్పదనీ అనిపిస్తుంది నాకు.
కానీ అది ప్రేమ లేకపోవటం కాదనీ, శకుంతల నాకు దక్కక పోవటమనీ నాకు తెలిసేందుకు ఏడాది కాలం పట్టింది. నా ప్రేమని నేను పోగొట్టుకోలేదు. నా మనసులోనూ శకుంతల మనసులోనూ ఇంకా ఒకరి మీద ఒకరికి ప్రేమ అలాగే ఉందని నా నమ్మకం. ఒక సారి పుట్టింటికి వచ్చినప్పుడు నన్ను కలుసుకుంది. అప్పుడు భోరున ఏడుస్తూ ఇంకా తను నన్ను...నన్ను...నన్నే,. ప్రేమిస్తున్నానని చెప్పింది! కానీ కొంత సేపటికి ఏడుపు ఆపి, కళ్ళు తుడుచుకుని, "అయినా ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? నేనింక పరాయి దాన్నే కదా నీకు?" అంది.
ఆమె మొదట అన్న మాటలతో వేడెక్కిన నా తల హఠాత్తుగా మంచుకొండకి గుద్దుకున్నట్టనిపించింది. శకుంతల చివరగా అన్న మాటల అంతరార్థం ఏమై ఉంటుంది? నా మీద అభియోగం వేసిందా? లేక ఆ మాటల్లో గూడార్థమేమైనా ఉందా? నాకోసం ఏదైనా రహస్య సందేశం ఉందా?

అలా అనుకోగానే నా ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది. కొంతసేపటికి శకుంతల నా ముందు ఒక సవాలు విసిరిందన్న నమ్మకం కలిగింది. ఆమె ఇంకా నన్నే కోరుకుంటోంది. మధ్యలో ఆగిపోయిన మా ప్రేమాయణాన్ని మళ్ళీ మొదలు పెడదామని చూచాయగా చెప్పకనే చెప్పింది. అంతే! ఒక తియ్యటి వెచ్చదనం నన్ను పూర్తిగా కమ్మేసింది. ఆ రోజు కూడా చలికాలపు సాయంకాలమే ఇద్దరం కలుసుకున్నాం. సాయంకాలపు పొగమంచులో కలిసిపోయి వెలుతురు కొత్త రంగులి సంతరించుకుంది. మరిచిపోలేని సుగంధమేదో పరుచుకుంది. అంత చలిలో కూడా వెచ్చగా అనిపించింది. ఆమె బుగ్గల మీదికి కారిన కన్నీటిని ఆప్యాయంగా నా వేళ్ళతో తుడిచాను.
లోకం ఏమనుకున్నా సరే, ఇద్దరం కలుస్తూ ఉండాలనీ, ఇంకా మాట్లాడితే కలిసే జీవించాలనీ నిర్ణయించుకున్నాం. ఎటువంటి అడ్డంకులనీ లెక్క చెయ్యకూడదని అనుకున్నాం.
"ధీరజ్ నన్ను మోసం చేశాడు, రాకేష్! పెళ్ళప్పుడే అతని ఆరోగ్యం సరిగ్గాలేదన్న సంగతి వాళ్ళు దాచిపెట్టారు. పెళ్ళి అయిన తరవాత కూడా తనకి ఉన్న వ్యాధికి చికిత్స లేదనీ, తను ఎక్కువకాలం బతకననీ ధీరజ్ నాకు చెప్పలేదు. తన వ్యాధి ఏమిటో డాక్టర్లకే ఇంకా అంతుపట్టలేదనీ, కానీ నయం అవుతుందని మాత్రం హామీ ఇస్తున్నారనీ అన్నాడు. శోభనం రాత్రి కూడా అతను నాతో పడుకోలేదు, ఆస్పత్రి కెళ్ళి అక్కడే పడుకున్నాడు. ఈ నాటి వరకూ దాంపత్య సుఖం అంటే ఏమిటో నేనెరగను. ఒక్కోసారి ఎప్పుడైనా ఆస్పత్రినించి ఇంటికి వచ్చినా, అతను విడిగా ఇంకో గదిలో పడుకుంటాడు. ఒకసారి అతను మామూలుకన్నా కాస్త తెరిపిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటం చూసి, నేనే చొరవచేసి శోభనం గురించి ఎత్తాను. నేనలా అనగానే అతను విపరీతంగా కంగారు పడ్డాడు. "నన్ను క్షమించు శకుంతలా! నిన్ను మోసం చేశాను, నీకు ద్రోహం చేశాను! నేను శోభనానికి పనికి రాను!" అన్నాడు. ఇన్నాళ్ళుగా అతనికి ఆరోగ్యం బాగాలేదని ఎంతో ఓర్పుతో నెలల తరబడి ఎదురుచూస్తున్న నాకు ఈ మాట వినగానే పట్టరాని కోపం, దు:ఖం వచ్చాయి. "అలా అయితే నన్నెందుకు పెళ్ళి చేసుకున్నట్టు? నన్నూ, నా తలిదండ్రులనీ, ఈ సమాజాన్నీ, చివరికి నిన్ను నువ్వే మోసంగించుకున్నావు! ఎందుకలా చేశావు?" అని అరిచాను. కానీ అతను జవాబేం చెబుతాడు? నా కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అతన్ని ఒక్క తన్ను తన్ని, నేరుగా నీ దగ్గరకి పరిగెత్తుకు రావాలని ఆ క్షణంలో నా కనిపించింది.." అని చెప్పటం ఆపింది శకుంతల.

శకుంతల చెప్పినది విని నేను మ్రాన్పడిపోయాను. ఆ రోజు సాయంకాలం దట్టమైన మంచు కురుస్తుంటే పార్కులో చల్లటి రాతి బెంచీమీద కూర్చుని ఇద్దరం చలికి గజ గజ వణికిపోతున్నాం. ఆయినా నా రక్త ఉడికిపోయింది. "శకుంతలా, నీకు తీరని అన్యాయం జరిగింది. నిజం చెప్పాలంటే నాకు కూడా! కానీ ఇప్పుడు మనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఒకటే మార్గం: మనం ఎదురు తిరగాలి. రక్త మాంసాలున్న మనుషులమని లోకానికి చాటాలి. సమాజం ఆడించినట్టల్లా ఆడే తోలుబొమ్మలం కామని ఇప్పటికైనా చెప్పాలి. నువ్వు సాహసం చెయ్యాలి. ఆ నపుంసకుణ్ణి వదిలేసి నా దగ్గరకి వచ్చెయ్యాలి. ఆ పని చేస్తావా? చెయ్యగలవా?"
శకుంతల అనురాగం నిండిన కళ్ళతో నా కేసి చూస్తూ "అది సాధ్యమేనంటానా, రాకేష్? నువ్వు నన్ను స్వీకరిస్తావు, కానీ ఈ సమాజం...లోకం..?
"సర్లే, ఈ సమాజం మనకేమిచ్చింది? మన ప్రేమకి అడ్డుపడే హక్కు దానికి లేదు. నీకు అన్యాయం జరిగితే నోరు విప్పని లోకం గురించి మనమెందుకు పట్టించుకోవాలి?" ఆ మాటలంటున్నప్పుడు నా గొంతు పెద్దగా అరిచినట్టు ధ్వనించింది.
కానీ నా భావావేశాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా శకుంతల నెమ్మదిగా ఇలా అంది, "సమాజం గోడమీది పిల్లిలాంటిదని నాకు తెలుసు, అబధ్ధాలు చెపుతుందనీ తెలుసు. కానీ అది మనిద్దరికన్న బలమైనది. ఒక నపుంసకుడికి భార్యగా ఉంటూ, పరాయి మగాళ్ళకి పిల్లల్ని కనే ఆడదాన్ని పతివ్రత అంటుంది, గౌరవిస్తుంది. కానీ అలాటి భర్తని విడిచిపెట్టి చిత్తశుధ్ధితో మనసారా ప్రేమించినవాడి దగ్గరకెళ్తే మాత్రం శీలం చెడిందని ముద్ర వేస్తుంది. నీ తలిదండ్రులూ, బంధువులూ నేను నీ భార్యనని ఒప్పుకుంటారా?"
నేనింకా గొంతుపెంచి, "ఒప్పుకోరని నాకు తెలుసు. కానీ వాళ్ళకి భయపడి మనం జీవితాంతం జీవఛ్చవాల్లా బతుకుదామంటావా? లేదు, నాకలా బతకాలని లేదు. నిన్ను కూడా అలా బతకనివ్వను. నీ పెళ్ళయినప్పట్నించీ ఈ ఊళ్ళో ఉండటం నాకు నరకయాతన కన్నా భయంకరంగా అనిపిస్తోంది. ఇక్కణ్ణించి పారిపోవాలని ఉంది. ఇక్కడ ఏముందని? నాన్న ఉన్నన్నాళ్ళూ ఆ సైకిల్ షాపులో పని చెయ్యటం, ఆ తరవాత ఆ షాపు యజమానినై ఇక్కడే పాతుకుపోవటం, అంతేగా? నేను బి.ఎస్సి. చదివింది సైకిల్ షాపు నడిపేందుకా? నువ్వు ఒక పనికిమాలిని వాడికి భార్యగా బతకటానికేనా ఇంగ్లీషు బి.ఏ.ఆనర్స్ చేశావు? నువ్వు లేని ఈ ఊళ్ళో ఉండలేక అప్పట్నించీ వేరే ఊళ్ళో ఉద్యోగ ప్రయత్నాలను చేస్తునే ఉన్నాను. మొన్ననే ఉత్తరం వచ్చింది, లక్నోలో ఒక ప్రభుత్వోద్యోగం దొరికింది. వెళ్ళనా వద్దా అని ఎటూ తేల్చుకోలేకుండా ఉండగా ఇలా నువ్వు రావటం, నీకు జరిగిన అన్యాయం గురించి నాకు చెప్పటం అంతా మన అదృష్టం కొద్దీ జరిగిందనే అనుకోవాలి. నువ్వు సరేనంటే రేపే లక్నో వెళ్ళి ఉద్యోగంలో చేరిపోతాను. నువ్వు తరవాత నా దగ్గరకి వచ్చెయ్యి," అన్నాను.
ఆ రోజు నిర్ణయించుకున్నట్టే మేమిద్దరం లక్నో చేరుకుని కలిసి జీవించటం మొదలుపెట్టాం. మా ఆనందానికి అవధుల్లేవు. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. కానీ కొన్నాళ్ళయాక శకుంతల అప్పుడప్పుడూ దిగులుగా ఉండటం గమనించాను. ఒకరోజు ఉండబట్టలేక అడిగేశాను, "ఏమిటివాళ అంత దిగులుగా ఉన్నావు?"
"దిగులా? నాకా? లేదే!" అని నవ్వేసింది.
"నా దగ్గరకి వచ్చి తప్పు చేశానని అనుకోవటం లేదు కదా?"
"అలాంటిదేం లేదు, కానీ ధీరజ్ గుర్తొస్తూ ఉంటాడు. అతనెలాటివాడైనా, అబధ్ధాలు చెప్పి నాకు అన్యాయం చేసినా, పాపం అతను జబ్బు మనిషి, అతనికి ఉన్నది చాలా సీరియస్ రోగం."
"అతను నిజంగానే జబ్బు మనిషా? నీ మాటలవల్ల ఆ జబ్బు తనలోని లోటుని కప్పి పుచ్చుకునేందుకు ఆడుతున్న నాటకమేమో అనిపించింది నాకు."
"లేదు. అతను నిజంగానే జబ్బు మనిషి."
"అయితే ఇప్పుడేమంటావు?"
"ఏం లేదు. ఎటూ తోచటం లేదు. త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తోంది. అతన్ని వదిలి వచ్చేశాను. కానీ అతను బలహీనుడు. మెత్తని స్వభావం. ఇది పధ్ధతి కాదనో, చట్టరీత్యా నా భార్యవి, అలా ఎలా నన్నొదిలి వెళ్ళిపోతావ్ అనో రెట్టించి లాక్కెళ్ళే ధైర్యం అతనికి లేదు. అయినా...సర్లే, ఇప్పుడవనీ ఎందుకు? ఆలోచించి మాత్రం చేసేదేముంది?" అంది శకుంతల నిట్టూరుస్తూ.
"అలా కాదు. మించిపోయిందేమీ లేదు. బాగా ఆలోచించుకో. అతని దగ్గరకే వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు."
శకుంతల ఇష్టంలేనట్టు మొహం పెట్టి నా కేసి చూసింది."మళ్ళీ నన్నా నరకంలోకి వెళ్ళమంటావా?" అన్నట్టుగా ఉంది ఆ చూపు.
కానీ నేనేమీ మట్లాడలేదు. నా మనసులో ఎన్నో ప్రశ్నలు రొద చెయ్యటం మొదలుపెట్టాయి. ఇంత వరకూ మా ఇద్దరి మధ్యా ఉన్నది అద్భుతమైన ప్రేమ అనే భ్రమలోనే జీవిస్తూ వచ్చానా? అది నిజంగా అంత గొప్ప ప్రేమ కాదా? ఇది కూడా ఒక రకమైన వ్యభిచారం గాని కాదు కదా? ఇద్దరం నిజంగా మళ్ళీ కలుసుకున్నామా, లేక విడివిడిగా ఎవరి ప్రపంచంలో వాళ్ళం బతుకుతున్నామా?
అలా ఆలోచిస్తుంటే మేం పురుగుల కన్నా హీనమైన వాళ్ళమని అనిపించసాగింది. ఏక కణ జీవులం! ఎక్కడో చదివాను ఒక రకమైన ఏకకణజీవి ఉంటుందిట. అది నీళ్ళల్లో ఉంటూ తనంట తనే పేలి చనిపోతుందట. నాకొక అనుమానం వచ్చింది, అది అలా పేలిపోతే నీళ్ళల్లో అసలు ఒక్క బుడగైనా లేస్తుందా?  అలలు ఏర్పడతాయా? ఆంత సూక్ష్మ ప్రాణి చనిపోతే ఏర్పడే బుడగ ఇంకెంత సూక్ష్మంగా ఉంటుందో కదా? బహుశా అసలు బుడగే ఏర్పడదేమో! మరి ఇంత పెద్ద ప్రపంచంలో ఒక శకుంతల, ఒక రాకేష్, ఒక ధీరజ్ ఆ సూక్ష్మప్రాణికన్నా గొప్పవాళ్ళేమీ కాదుగా? మేం కలిసుంటే ఏమిటి, విడిపోతే ఏమిటి? బతికుంటే ఏం చస్తే ఏం..ఎవరు పట్టించుకుంటారు? అయినా ఎందుకిలా నైతిక విలువలు అంటూ పాకులాడాలి?
శకుంతలతో కలిసి జీవించటం మొదలుపెట్టాక ఈ సమాజంలోని నియమాలనీ, నిబంధనలన్నిట్నీ భస్మీపటలం చెయ్యగలిగానని గర్వించాను. నేను చేసిన పని వల్ల బూజు పట్టిన సంప్రదాయాల పొగమంచు తొలగిపోతుందనీ, నిర్జీవమైన సంబంధాలలోని గడ్డకట్టిన భావాలు కరిగి, వాటిలో కొత్త జీవం తొణికిసలాడుతుందనీ, అంతటా ప్రేమ తాలూకు వెచ్చటి వెల్తురు నిండుతుందనీ ఆశించాను. కానీ ఆ రోజు శకుంతల దిగులుకి అసలు కారణం తెలుసుకున్నాక నిజంగా ఏ బూజుపట్టిన సంప్రదాయాలూ, నియమాలూ, నిబంధనలూ భస్మీపటలం కాలేదని తెలియవచ్చింది. కాసేపు నిప్పురాజుకుని, కాస్త పొగ వచ్చింది, అంతే!
ఆ రోజు మొదలు శకుంతలలో నిజాయితీ లోపించిందన్న భావన నన్ను ఏడిపించసాగింది. శరీరం మాత్రమే నాకప్పగించి, మనసుని ధీరజ్ దగ్గరే వదిలి వచ్చిందన్న నమ్మకం బలపడింది.
ఒక సారి ఆఫీసుపని మీద నాలుగు రోజులు బైటికెళ్ళాను. పనులు పూర్తయాక సాయంత్రం ఇంటికొచ్చాను. మా గది గుమ్మానికి కర్టెను వేలాడుతూ దర్శనమిచ్చింది.అది చూసి నిర్ఘాంతపోయాను. కానీ లోపల శకుంతల ఒక్కతే లేదనీ, ఆమెతో మరెవరో ఉన్నారనీ గ్రహించాను. నాకు ఒళ్ళు మండిపోయింది, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు కొరకసాగాను. శకుంతల నాకింత ద్రోహం చేస్తుందా? ఎన్నాళ్ళుగా సాగుతోంది ఈ వ్యవహారం? ఈ రోజు బండారం బైట పడింది! నేను విసురుగా కర్టెన్ తొలగించాను.
బండారం బైట పడిందా? అక్కడ నాకు కనిపించిన దృశ్యం... శకుంతల గొంతుక్కూర్చుని నేలమీద పరుచుకున్న రక్తాన్ని శుభ్రం చేస్తోంది. ధీరజ్ నా మంచం మీద స్పృహలేనట్టు పడి ఉన్నాడు. అతను రక్తం వాంతి చేసుకున్నట్టున్నాడు. అతని మొహం తెల్లగా పాలిపోయి ఉంది. నేల తుడుస్తున్న శకుంతల గుమ్మం దగ్గర చప్పుడు విని తలెత్తి చూసింది. నన్ను చూడగానే చాలా కంగారు పడింది. నట్టుతూ, "నువ్వేనా! ... ఈయన ఆరోగ్యం విషమించిందని కబురొస్తే... ఇవాళే వెళ్ళి వెంట పెట్టుకొచ్చాను. సరిగ్గా సమయానికి వచ్చావు...ఎవరైనా డాక్టర్ ఉంటే వెంటనే పిల్చుకురావా, ప్లీజ్?" అంది దీనంగా.
నేను వెంటనే వెనుదిరిగి డాక్టర్ కోసం పరిగెత్తాను. మరుక్షణం పేలిపోతానేమో ననిపించింది..నేను పేలిపోవటానికి నిదర్శనంగా ఎక్కడా ఒక బుడగ కూడా కనిపించదేమో!

("స్టెంటర్" పీరుతో ౧౯౬౩ లో ప్రచురితమైన ఈ హిందీ కథ ౨౦౦౯ లో ’ఏక్ ఘర్ కి డైరీ’ పేరుతో కథాసంపుటిగా వెలువడింది. రచయిత అనుమతి తో ఈ కథ తెలుగులోకి అనువదింపబడింది.)
__________________________

మూల హిందీ రచయిత:
ప్రొఫెసర్ రమేష్ ఉపాధ్యాయ్

అనువాదం :
ఆర్.శాంతసుందరి,




Wednesday, April 11, 2012


బడ్జెట్‌
Share  ఆదివారం అనుబంధం    Sat, 1 Oct 2011, IST  
మంత్రి సిన్హా ఇస్తున్న 2000 సంవత్సరం బడ్జెట్‌ తాలూకు ఉపన్యాసం టీవీలో చూస్తున్నాడు అతీవ్‌. చానల్‌ మార్చాడు. స్టార్‌ న్యూస్‌లో కూడా బడ్జెట్‌ గురించే వస్తోంది. స్పో
ఆర్థిక ర్ట్స్‌ చానల్‌కి మార్చాడు. క్రికెట్‌లో ఆస్ట్రేలియా భారత జట్టుని చావబాది వదిలిపెడుతోంది! ఇక మన ఆటగాళ్లతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రోజులు అయిపోయాయని అనుకున్నాడు అతీవ్‌.
యాష్‌ ట్రేలో సిగరెట్‌ ఆర్పి పడేస్తూ ఆర్థిక మంత్రి మీద విసుగు ప్రకటించాడు అతీవ్‌. దొంగవెధవ... బీడీ, సిగరెట్ల మీద టాక్సు పెంచుతాడు. కానీ స్కూటర్లూ, కార్లూ చవగ్గా దొరికేటట్లు బడ్జెట్‌ తయారు చేస్తాడు. అంటే కార్లు, స్కూటర్ల మీద సరదాగా తిరగండి... పెట్రోల్‌ తగలబెట్టండి... అనేగా వీడు చెప్పేది? కోక్‌ చవక. పిల్లలకి చిన్నప్పట్నుండే చేదు పానీయం అలవాటు చేస్తే ఏదో ఒకరోజు తాగడం మొదలు పెడతారుగా? సరదాలకి టాక్స్‌ తక్కువ, అవసరమైన వస్తువుల మీదే టాక్స్‌... పేదోళ్లు బీడీ కొనుక్కోవాలన్నా వీల్లేని పరిస్థితి! సిన్హా సిగరెట్‌ తాగడు. అతనికి ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసినాయన కూడా పొగ తాగడు... మరి ఆయన సర్దార్జీ మన్‌మోహన్‌ సింగ్‌ కద!? ఇది కాక చాలా మంది నాయకులకు వ్యవసాయమనే ముసుగు ఉంది. పై సంపాదనంతా వ్యవసాయంలో వచ్చిన సంపాదన కింద గప్‌చుప్‌గా కలిపేసుకుంటారు.
అతీవ్‌ బెంగాలీ బాబు. అతనికి కాబోయే భార్య అణిమ ఉత్తరప్రదేశ్‌కి చెందిన స్త్రీ. ఆమె సాంగత్యంలో తను అన్నీ హిందీలోనే ఆలోచిస్తున్నానని, మాట్లాడుతున్నానని హఠాత్తుగా అనిపించింది. ఇప్పుడు కూడా అతని ఆలోచనలు హిందీలోనే సాగుతున్నాయి!
కుర్తా తొడుక్కుని గదిలోంచి బైటికి రాగానే వదిన మొహంలో వంకర నవ్వు కనబడింది. ఆమె ఏదో అనే లోపలే వీధిగుమ్మం తెరుచుకుని బైటికొచ్చేశాడు. కిళ్లీ కొట్లో సిగరెట్‌ కొంటుంటే షాపతను ధర పెరిగిందన్నాడు. అతనికి అప్పుడే బడ్జెట్‌ గురించి తెలిసిపోయింది. కొంత దూరం నడిచి ఇంకో కొట్లో ఫ్రూటీ కొన్నాడు. ఆ దుకాణం ఓనరుకు బడ్జెట్‌ గురించి తెలిసినట్లు లేదు. ధర తగ్గించలేదు.
అతీవ్‌ గడియారం వైపు చూశాడు. ఒకటింబావు. అణిమ క్లాసు మూడు గంటలకి గానీ అవదు. అతను బస్సెక్కి రెండు గంటలకల్లా చౌరంగీ చేరుకున్నాడు. ఫుట్‌పాత్‌ మీద నడుస్తూ కాసేపు విండో షాపింగ్‌ చేశాడు. లైట్ల వెలుగులో ప్రతి వస్తువూ ఉన్నదాని కన్నా అందంగా కనిపిస్తోంది. ప్రతి దుకాణంలోనూ సేల్‌ బోర్డ్‌లు వేలాడుతున్నాయి. ఎన్నో అధునాతనమైన వస్తువులు తక్కువ ధరకి అమ్ముడుపోయేందుకు ఆత్ర పడుతున్నాయి.
అతీవ్‌కి దిగులనిపించింది. గుమస్తా పని చేసే అతని మనసు రకరకాల ఆలోచనల్లో చిక్కుకుపోయింది. కొన్ని లక్షల కేసులు కోర్టుల్లో దశాబ్దాల నుండి దేకుతున్నాయి. జడ్జిల సంఖ్య వందో రెండు వందలో పెంచితే ప్రభుత్వానికి పెద్ద నష్టమేమీ ఉండదు. వాహనాల మీద డ్యూటీ తగ్గించకపోయి ఉంటే కొన్ని వేల మందికి ఈ ఇబ్బందులు తప్పేవి. సాఫ్ట్‌ డ్రింకుల మీద టాక్స్‌ తగ్గించే బదులు మందుల ధర తగ్గిస్తే రోగులు కోలుకుని పనిలోకి వెళ్తారు. అణిమ ఎప్పుడూ అంటుంది 'నీకు ఫైల్స్‌ తప్ప మరేదీ అర్థం కాదు. గ్లోబలైజేషన్‌ అనేది కొండచిలువ లాంటిది. అది ఊపిరి వదిల్తే చుట్టుపక్కల ఉన్నవన్నీ దాని విషప్రభావానికి గురవుతాయి. ఇక ఊపిరి పీల్చిందంటే దగ్గర్లో ఉన్నవన్నీ దాని పొట్టలోకే చేరిపోతాయి' అని.
ఆర్థికశాస్త్రం బోధించేందుకు మహిళా లెక్చరర్లు తక్కువగా ఉండడంతో దళితురాలు అణిమకి కాలేజీలో ఉద్యోగం వచ్చింది. కానీ అతీవ్‌ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతని తల్లిదండ్రులు ఇంట్లోనుండి వెళ్లగొడతామన్నారు. అంతేకాదు, మర్యాదస్తులుండే కాలనీలో అద్దెకి ఇల్లు కూడా దొరకలేదు.
హేంగర్లు అమ్మే కుర్రాడు వచ్చి అతీవ్‌ ఆలోచనలకి భంగం కలిగించాడు. అతను మళ్లీ గడియారం కేసి చూశాడు. ఇంకా రెండున్నరే అయింది. అణిమ రెస్టారెంట్‌కి చేరుకునేసరికి మూడుంబావు అవుతుంది. పేవ్‌మెంట్‌ మీద వార్తాపత్రికలమ్మే కుర్రాడి దగ్గర అతీవ్‌ ఈవినింగ్‌ న్యూస్‌ కొన్నాడు. అప్పుడే ఆర్థిక మంత్రి ఉపన్యాసం వార్తల్లోకి ఎక్కింది. వార్తాపత్రికలు ఎంత వేగంగా పని చేస్తున్నాయో! అనుకున్నాడు. మార్కెట్‌వాద ప్రభావం మరి! కానీ ఎకనమిక్స్‌ లెక్చరర్‌ అణిమ మార్కెట్‌ కొన్ని షరతుల సాయంతో పని చేస్తుంటుంది. అది ఏ దేశంలోనైనా సరే ప్రభుత్వం అదుపాజ్ఞల్లో ఉండదట... సరిగ్గా పెట్టుబడిదారీ విధానం లాగే. ఒక పక్క అది గుళ్లూ గోపురాలూ కట్టిస్తుంది. మరోపక్క మద్యం ఫ్యాక్టరీలని, కాంట్రాక్టులనీ నిర్వహిస్తుంది. అయినా ఈ ఆడవాళ్లకి మద్యం అంటే అంత రోత ఎందుకో? కాస్త వాసన తగిలితే చాలు, విడాకుల దాకా వెళ్లిపోతారు! కానీ ప్రభుత్వం తాలూకు ఆర్థిక వ్యూహం మొత్తం లిక్కర్‌ - ఎక్సైజ్‌ మీదే ఆధారపడి నడుస్తోందాయె!
అతీవ్‌ వెనక్కి తిరిగి రెస్టారెంట్‌ వైపు నడక సాగించాడు. అక్కడ కూర్చుని తాపీగా వార్తా పత్రిక చదువుకుందామనుకున్నాడు. ఇంతలో అణిమ వేగంగా నడుచుకుంటూ రావడం కనిపించింది. 'అప్పుడే ఎలా వచ్చేసింది?' అనుకున్నాడు కొంచెం ఆశ్చర్యపోతూ.
''పావుగంట ముందే ఊడిపడ్డావే?'' అన్నాడు.
''ఏమిటా భాష? సరిగ్గా మాట్లాడడం చేతకాదా?'' అంది చిరుకోపం ప్రదర్శిస్తూ.
''అది కాదు. ఇంత త్వరగా ఎలా వచ్చావు?''
''అది నీకు చెప్పినా అర్థం కాదులే. కేంద్ర ప్రభుత్వం భారతీయత ప్రదర్శిస్తోంది! సాయంత్రం ఐదు గంటలకి బడ్జెట్‌ ఏంటో చెప్పడం బ్రిటీష్‌ వాళ్ల పద్ధతి. ఇప్పుడు జ్యోతిష్యుణ్ని పిలిపించి, ఉదయం పదకొండు గంటలకి మంచి ముహూర్తం నిర్ణయించారు. అందుకని ఇన్‌కంటాక్స్‌ సమస్యల్లో మునిగిన సగం మంది లెక్చరర్లు చెక్కేశారు. మూడొంతుల మంది స్టూడెంట్స్‌ రానేలేదు! ఒక్కోక్లాసులో నలుగురైదుగురి కన్నా లేరు. మిగతావాళ్లేరని అడిగితే 'ఇవాళ బడ్జెట్‌ ఉంది కదా మేడమ్‌!' అన్నారు. ఒకమ్మాయిని మరి నువ్వు మాత్రం ఎందుకొచ్చావని అడిగితే 'ఈ రోజు నాన్న ఇంటిదగ్గరే ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉంటే అమ్మతో ఎప్పుడూ వాదిస్తూనో, పోట్లాడుతూనో ఉంటాడు. ఇక్కడైతే ప్రశాంతంగా ఉండొచ్చని వచ్చా. సాయంత్రాలు ఎలాగూ తప్పదు!' అంది విచారంగా. అసలు ఇవాళ నిన్ను కలిసేందుకు రాకూడదనే అనుకున్నాను. కానీ ఫోన్‌ చేస్తే మీ అమ్మ ఎత్తుతుంది. నా గొంతు వింటేనే ఆవిడ మళ్లీ స్నానం చెయ్యాల్సి వస్తుందని మానేశాను! మాట ఇచ్చి రాకపోతే నీకు కోపం వస్తుందాయె. అసలు ఇప్పుడే నీకు విసుగు మొహం పడింది'' అంది.
''అది టీ తాగగానే మామూలైపోతుందిలే రాణిగారూ!''
''రాణి గారేమిటి? అంట్లు తోముకునేది అను. రోడ్లూడ్చేది అను. మా ముత్తవ్వ ఎస్ల్పెనేడ్‌లో రోడ్లూడ్చే పని చేసేదట. మా తాత బిల్డింగ్‌ మెటీరియల్‌ అమ్మేవాడు. గాంధీ టోపీలతో ఎన్నో పరిచయాలుండేవి. మా నాన్న ఎమ్‌.ఎ చేసి సేనిటరీ ఫిట్టింగ్స్‌ అమ్మే వ్యాపారంలో బాగా సంపాదించాడు. పెద్ద మేడ కట్టుకున్నా ఉండేది మాత్రం మా కులంవాళ్లుండే పేటలోనే!''
''సరే. చరిత్ర పాఠాలు చెప్పడం అయిపోతే లోపలికెళ్లి కూర్చుందామా మేడమ్‌?''
లోపల కూర్చున్నాక అణిమ ఆర్డరిచ్చింది. ''రెండు ప్లేట్లు ప్యాట్టీస్‌, ఒక కోక్‌, ఒక టీ''
''నీకు కోక్‌, నాకు మాత్రం టీ ఎందుకు చెప్పావ్‌?''
''ఎండాకాలం టీ చల్లబరుస్తుంది. పైగా నీకు అదే పడుతుంది''
''కోక్‌ ధర తగ్గింది!''
''ఏప్రిల్‌ ఫస్ట్‌ నుండి వస్తువుల ధరలు పెంచదలచుకుంటే వాటిని బడ్జెట్‌కి ముందే పెంచేస్తారు. కానీ తగ్గేవి మాత్రం ఫూల్స్‌ డే నుండే తగ్గుతాయి''
''నాతో సహవాసం చేసి నువ్వు బాగా తెలివితేటల్ని సంపాదించుకున్నావు!''
''పిచ్చి వాగుడు మాని, త్వరగా తిను. తారకేశ్వర్‌లో 'తాజ్‌ మహల్‌' చూడాలి''
''భాష గురించి నాకు చెప్పావు. మరి నీ భాష ఎలా ఉంది?''
అణిమ నవ్వేసింది. ఇద్దరూ లేచి బైటికొచ్చారు.
''తారకేశ్వర్‌లో ఆ ఇల్లెక్కడుంది?'' అంది అణిమ.
''ముందు మనం మా ఆఫీస్‌ ప్యూన్‌ అసీమ్‌ మండల్‌ ఇంటికెళ్లాలి. అతనే చెప్తాడు''
తారకేశ్వర్‌ చేరుకుని ఒక ఇంటి ముందాగి అతీవ్‌ బెల్‌ కొట్టాడు. ఒక మధ్యవయస్కురాలు తలుపు తెరిచింది. ఆవిడే అసీమ్‌ భార్య అనుకుని అణిమ నమస్కారం చేసింది. అతీవ్‌ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
''ఇదేదో ప్యూను ఇల్లులాగ లేదు. ధనికుల మేడ లాగుంది!'' అంది అణిమ.
ఆమె వాళ్లని లోపలికి రమ్మని ఆహ్వానించింది. లోపల ఒక పెద్ద గదిలో అసీమ్‌ పడుకుని ఉన్నాడు. అతీవ్‌ని చూడగానే హడావుడి పడుతూ లేచి నిలబడ్డాడు. ''మీరా సార్‌! ఈవిడ.. అణిమ గారు కదూ? అర్థమైంది సార్‌! '' అన్నాడు.
ఇద్దర్నీ కూర్చోమని చెప్పి భార్యని కేకేశాడు. ''అరె, మధుమాలతీ! ఆఫీసులో పనిచేసే సారు వచ్చారు. స్వీట్లు అవీ పంపించు!'' జ్వరం తగిలి ఆఫీసుకు రాలేదని అతీవ్‌కి చెప్పాడు.
ఒక ప్యూను ఇంత గొప్ప హోదాలో బతకడం చూసి నోరెళ్లబెట్టింది అణిమ. అప్పుడే పని మనిషి చేతిలో రసగుల్లాల ట్రేతో బాటు మధుమాలతి అక్కడికి వచ్చింది. ఆమెని చూసి అణిమ అవాక్కయింది. ''ఎంత అందంగా ఉంది!'' అనుకుంది.
అతీవ్‌ ఇంటి విషయం అసీమ్‌ని అడిగాడు. ''స్టేషన్‌ నుండి కుడివైపుకి వెళ్తే ఐదో ఇల్లో, ఆరో ఇల్లో సార్‌. మొదటి అంతస్తులో రెండు గదులు, వంటిల్లు, డాబా. అద్దె పన్నెండొందలు. కరెంటు బిల్లు మీరే కట్టుకోవాలి'' అన్నాడు అసీమ్‌.
''చూడ్డం వీలవుతుందా?''
''అదే ముఖ్యం కద సార్‌. నచ్చితేనే అడ్వాన్స్‌ ఇచ్చేది?''
''మళ్లీ కులం ప్రసక్తి రాదు కదా? నువ్వు ముందుగా చెప్పావా?''
''మీరు మాత్రం ఎందుకు చెప్పడం? మీ కులమే అణిమ గారిది!''
''లేదు భారు. నాకు దాచిపెట్టడం ఇష్టంలేదు!'' అంది అణిమ.
''అవన్నీ వదిలేయండి మేడం! ముఖర్జీ ఇవాళ పెద్ద సేఠ్‌గా చెలామణి అవుతున్నాడు. కానీ అతని చరిత్ర నాకు బాగా తెలుసు. దొంగ వ్యాపారం చేసి నాలుగేళ్లు లోపల కూడా ఉండి శిక్ష అనుభవించి వచ్చాడు. కొడుకు తన కుటుంబంతో స్టేట్స్‌కి వెళ్లాడు. ఇప్పుడు అద్దెకివ్వాలని చూస్తున్నాడు. ఎందుకంటే అతనికి గుండె జబ్బు. నేను కూడా దళితుణ్ణే. కానీ నా ముందు ఎంతమంది డబ్బున్న ఆసాములు చేతులు కట్టుకుని నిలబడతారో తెలుసా? ఆ తర్వాత హుగ్లీలో మూడు సార్లు మునుగుతారనేది వేరే విషయం. నా చేత శివలింగానికి అభిషేకం చేయించేందుకు తారకేశ్వర్‌ పూజారుల్లో గొప్ప పోటీ ఉంటుంది ఏమనుకుంటున్నారో! ఎందుకంటే పూజ చేయించినందుకు కొత్త వంద రూపాయల నోటు ఇస్తాను'' అన్నాడు అసీమ్‌.
ఇద్దరూ అక్కడ్నుండి బైట పడ్డారు. ముఖర్జీ ఇల్లు వెతుక్కుంటూ బయల్దేరారు.
ముఖర్జీ మోశారు ఇల్లు బైటినుండి చూడ్డానికి చాలా బాగుంది. ముఖర్జీ తలుపు తెరిచి ఇద్దర్నీ లోపలికి రమ్మన్నాడు. ''ఒక సంగతి ముందే చెప్తే మంచిదనుకుంటాను, ముఖర్జీగారూ! అది విన్న తర్వాత లోపలికి రమ్మంటే వస్తాం'' అన్నాడు అతీవ్‌.
''చెప్పండి!'' అన్నాడు ముఖర్జీ కొంచెం ఆశ్చర్యపోతూ.
''నా పేరు అతీవ్‌ బోస్‌. ఈమె అణిమ... బీహారీ హరిజనురాలు. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం. అందుకే అద్దెకి ఇల్లు కావాలి. మరి మీరు మాకు ఇల్లు అద్దెకిస్తారా?''
ముఖర్జీ మొహం అసహ్యంగా పెట్టాడు. అతని మొహం అడవిపంది మొహంలా క్రూరంగా మారిపోయింది. ''అసీమ్‌ మీరు బోసులని చెప్పాడే మరి?'' అంటూ పక్కనే ఉన్న పెళ్లాం వైపు చూశాడు. హరిజన్‌ అన్న మాట విన్నప్పుడే ఆవిడ మొహం తిప్పేసింది!
ఇద్దరూ స్టేషన్‌కెళ్లి హౌరా వెళ్లే రైలు ఎక్కారు. ''ప్యూన్‌ పని చేసుకునే అసీమ్‌ ఎంత వైభవంగా బతుకుతున్నాడు!'' అంది అణిమ. ఆమె మొహంలో ఇల్లు దొరకలేదన్న బాధ ఏమాత్రం కనిపించలేదు. అన్ని చోట్లా 'నో' అనే మాట వినడం అలవాటైపోయిందామెకి.
''అవును. మొదట్లో రైడ్స్‌ చేసే ఆఫీసర్ల వెంట ఉండేవాడు. కానీ ఆ సేఠ్‌కీ, కాంట్రాక్టర్లకీ అసీమ్‌ ముందుగా హెచ్చరిక చేసేవాడు. దానికి బదులుగా నోట్ల కట్టలు సంపాదించుకునేవాడు. తర్వాత తన వడ్డీ వ్యాపారం మొదలు పెట్టాడు. ఇతని దగ్గర పెద్ద పెద్ద కంపెనీలు షార్ట్‌ టర్మ్‌ అప్పులు తీసుకుంటాయి.
''మరి అతని సంపాదన మీద రైడ్స్‌ జరగవా? మీ ఇన్‌ కమ్‌ టాక్స్‌ పనితీరు ఇదేనా?''
''అరే. ఎవరైనా కంప్లైంట్‌ చేస్తే కదా? కమిషనర్‌ దగ్గర్నుండి అందరూ ఇతనికి రుణపడి ఉంటారాయె!'' అన్నాడు అతీవ్‌.
స్టేషన్‌ నుండి బైటికొచ్చి టాక్సీ ఎక్కడానికి బదులు ఇద్దరూ స్టీమర్‌ ఎక్కారు. ఇద్దరి మొహాల్లోనూ దిగులన్నది లేదు... ఇల్లు దొరకదని వాళ్లకి ముందే తెలుసు! స్టీమర్‌లో గోలగోలగా ఉంది. అందరూ బడ్జెట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. అతీవ్‌ పేపర్‌ చదువుదామని తీశాడు.
''కాస్త వార్తలు చూసి చెప్పు అతీవ్‌! ఆర్థికమంత్రి దళితులకి టాక్స్‌ లేదని ఎక్కడైనా ప్రకటించాడేమో?'' అంది అణిమ వెటకారంగా.
''అలా ఎందుకు ప్రకటిస్తాడు?'' అన్నాడు అతీవ్‌ నవ్వుతూ.
''పాపులర్‌ అయ్యేందుకు! ఒక్క యూపీ ఏమిటి? బెంగాల్‌లో కూడా అప్పుడు బీజేపీ వచ్చేస్తుంది!''
''కానీ అప్పుడు కూడా మన ఇంటి సమస్య అలాగే ఉంటుంది కదా?'' అన్నాడు అతీవ్‌ భుజాలు ఎగరేస్తూ.
అణిమ నవ్వి ''ఇంద్రుడి వజ్రఘాతానికి భయపడి నన్ను మీ స్వర్గంలోకి తీసుకెళ్లలేకపోతే, మరో మార్గం ఉంది. నువ్వే మా లోకంలోకి రా. మా లోకం నిన్ను తరిమి కొట్టదు. స్వాగతం పలుకుతుంది!'' అంది.
అతీవ్‌ ఆలోచనలో పడ్డాడు. మరుక్షణం తలాడిస్తూ ''రియల్లీ. యూ ఆర్‌ ఇన్‌టెలిజెంట్‌!'' అన్నాడు.
అణిమా, అతీవ్‌కి సంబంధించినంత వరకూ పొద్దున ప్రకటించిన బడ్జెట్‌కి అర్థం లేకుండా పోయింది. బడ్జెట్‌ అనుమతించినా... పెద్ద మనుషులుండే కాలనీల్లో వాళ్లకి ఇల్లు దొరకడం అసంభవమని తేలిపోయింది!
హిందీమూలం : విజరు
అనువాదం : ఆర్‌.శాంతసుందరి