Sunday, April 3, 2011





మను వెనక్కి వస్తాడా?
-----------------------

" వీడొకపట్టాన లేవడంలేదు, మీరు కాస్త లేపుతారా?" అంటూ వత్సల మొగుడు కప్పుకున్న దుప్పటి విసుగ్గా లాగేసింది.

"అబ్బా! ఏం చేస్తున్నావు?" అని కసిరాడు చరణ్.

"నేను లేపితే లేవడంలేదు. మీరు గట్టిగా కోప్పడితేగాని లేవడు వెధవ."

"మను ఇక్కడెక్కడ డున్నాడు వత్సలా? నీకేదో కల వచ్చుంటుంది! మను న్యూ జెర్సీలో కదా ఉన్నాడు?"

".............."

"హూం ! వాడు నీలాగ కలలు కంటున్నాడనుకుంటున్నావేమో నీ గురించి , అక్కడ వాడికి పగలూ రాత్రీ తేడా కూడా తెలీదు!వారానికో రెండు వారాలకో ఒకసారి ఫోన్ చేసి బాధ్యత తీర్చుకున్నాననుకుంటాడు.సర్లే, ఇక పడుకో!"అనేసి పదుకుండిపోయాడు.

చరణ్ ఒక డాక్టర్. ఎక్కువసార్లు వత్సలే కొడుక్కి ఫోన్ చేస్తుందని ఆయనికి తెలుసు. మను గురించి ఆలోచనలు బాధపెట్టకుండా ఆయన ఎప్పుడూ రోగులూ, మందుల్లో మునిగుంటాడు.

ఫోన్ చేసినప్పుడల్లా వత్సల కొడుకుని వెనక్కి వచ్చెయ్యమని ప్రాధేయపడుతుంది.అతనూ ఎప్పుడూ ఒకటే జవాబు చెపుతాడు,అక్కడికొచ్చి ఏం చేస్తాను అంటూ.

కొడుకు గుర్త్తొస్తూనే వత్సల లేచివెళ్ళి ఫోన్ చేసింది..."ఎలా ఉన్నవురా? ఇవాళ ఆదివారంకదా?ఇంట్లోనే ఉన్నావా?"

"ఆ,చెప్పు!"

"నువ్వు కల్లోకొచ్చావు,ఫోన్ చెయ్యాలనిపించింది.వెనక్కి రారా మనూ !ఇక్కడ ఉద్యోగాలకేమీ కొదవ లేదురా! పూనా,హైదరాబాదు,ఢిల్లీ,ముంబయి,బెంగళూరు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నీకు ఉద్యొగం దొరుకుతుంది మనూ!"

"సరే మరి జీతమో? ఇక్కడ నేను ఎంత సంపాదిస్తున్నానో తెలుసా అమ్మా?ఇక మన ఊరు? ఏమైనా మారిందా? నేను పుట్టినప్పుడున్న ఆ హైస్కూలూ,ఒకే ఒక కాలేజీ,ఒక డొక్కు రైల్వే స్టేషనూ. అయినా రాజకీయాలకేమీ కొదవ లేదు.కులం కుళ్ళూ, అవినీతీ...చెప్పక నాకు!"

"కానీ నువ్వు అక్కడికెళ్ళేందుకు చదువుకున్నది ఇక్కడే ,అది మరిచిపోకు!"

"అయితే ఏమిటిట? అందరూ ఎక్కడో ఒక చోట చదువుకుంటారు,పెరిగి పెద్దవాళ్ళవుతారు,అంతమాత్రం చేత అక్కడే పాతుకుపోవాలా?మా కంపనీ లో ఝార్ఖండ్ నించి వచ్చిన మిస్టర్  నిక్సన్ అనే ఒకతను  పనిచేస్తున్నాడు. అతని తలిదండ్రులు గిరిజనులు. అడవుల్లోంచి కాంట్రాక్టర్లు తరిమి కొడితే పట్నం పారిపోయి కంకరా మట్టీ ఎత్తుతూ కూలి పని చేసుకున్నారు.అక్కడ ఒక అమెరికన్ కూలివాళ్ళ పిల్లలకోసం ఒక క్రెష్ తెరిచాడు. ఒకప్పుడు నానీ అని పిలిపించుకున్న ఆ గిరిజన పిల్లవాడు ఇవాళ ఆ అమెరికన్ దయవల్ల మిస్టర్ నిక్సన్ గా మారాడు.అతని అమ్మా నాన్నా రాంచీ లో మంచి ఇంట్లో ఉంటున్నారు.వాళ్ళ రెండో కొడుక్కి అమెరికన్ దొర ఎవరూ దొరక్కపోవటంతో అతను నక్సల్స్ తో చేరిపోయి ఇల్లొదిలి వెళ్ళిపోయాడు.ప్రభుత్వం చేసే అక్రమాలతో ప్రజల పక్షాన పోరాడుతున్నాడు."

"చూడు మనూ, మనం గిరిజనులం కాము.మన ఊళ్ళో మనకంటూ ఒక పెద్ద ఇల్లుంది.మీ నాన్న కూడా ఇంకా రిటైర్ అవలేదు.నీకు సరిపోయేంత సంపాదన మనకుంది.నువ్వు ఏ పనీ చెయ్యకపోయినా, హాయిగా కాలుమీద కాలేసుకుని కూర్చున్నా మనకి బెంగేమీ ఉండదు."

"ఏమీ చెయ్యకుండా కూర్చోవటంకన్నా ఇక్కడే ఏదో ఒక పని చేసుకోటం మంచిది కదమ్మా!"అంటూ నవ్వాడు మను.

"ఉన్న ఒక్కడివీ అంత దూరంలో ఉన్నావు.నిన్ను చాలా మిస్సవుతున్నాం రా!"

"నాకూ అలాగే ఉందమ్మా.పోనీ నువ్వూ,నాన్నా ఇక్కడికొచ్చెయ్యకూడదూ?ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు!బోలెడంత సంపాదించుకోవచ్చు,పని కూడా తక్కువే."

"నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావేమిట్రా?"

"అమ్మా,చిన్న కుటుంబం,ఉండే ఇల్లు చిన్నది,అలాటప్పుడు మనిషి గొప్పతనానికి గుర్తింపు డబ్బొక్కటే మరి.డబ్బూ అధికారం ఎప్పుడూ హోదానే తెలియజేసేవే కదా?ఇండియా లో అధికారం కావాలంటే లోకల్ గూండా అవాలి.ఇక్కడ చచ్చేట్టు పనిచెయ్యాలి."

"సర్లే! ఆ పన్నాలాల్ జైన్ గుర్తున్నాడా నీకు? వాళ్ళ పెద్దబ్బాయి తాతలకాలం నాటి బట్టలకొట్టుని చక్కగా నడుపుకొస్తున్నాడు.చిన్నవాడు సాగర్ లో ఆటో షోరూం తెరిచి బోలెడంత సంపాదిస్తున్నాడు.ఇక ఆ జైనయితే మునిసిపల్ చైర్మన్ అయాడు.ఊళ్ళోని రోడ్లన్నీ పక్కాగా వేయించాడు.ఇదంతా అభివృద్ధి కాదా?"

"కబుర్లు చెప్పకమ్మా! అక్కడ ఇవాళ అవినీతిపరులైన పారిశ్రామికవేత్తలదీ, లంచగొండి రాజకీయనాయకులదే రాజ్యం.నేషనలిజం ఎవడికీ పట్టలేదు.ధారావీ మురికివాడలో తయారుచేసిన వస్తువులని తమ సొంత ముద్ర వేసి లక్షలూ కోట్లూ సంపాదించుకుంటారు.స్లం డాగ్ మిలియనీర్ నేనూ చూశాను.మనదేశంలోని ప్రతి పెద్ద పట్నమూ స్లమ్స్ మీదే ఆధారపడి బతుకుతోంది."

"సరే నీకు దేశభక్తి ఉందికదా?ఇక్కడికొచ్చి ఈ అవినీతినీ అక్రమాలనీ పోగొట్టేందుకు పోరాడు..." వత్సల ఈమాటనగానే మను ఫోన్ కట్ చేసేశాడు.

వత్సల లేచి కూర్చుని ఆలోచనలో పడింది.ఇంకా పూర్తిగా తెల్లవారలేదు కానీ ఆమెకి మళ్ళీ నిద్ర పట్టలేదు...

తల్లి పాలకీ ప్రేమకీ చాలా శక్తి ఉంటుందంటారు.మను నా పాలు తాగాడు,నా ప్రేమని పూర్తిగా పొందాడు.మరి నేను ఇన్నిసార్లు రమ్మని పిలుస్తూంటే అసలు పట్టించుకోడేం?

ఆమెకి భర్త మాటలు గుర్తొచ్చాయి,జనరేషన్ గ్యాప్,మార్పూ ప్రకృతి సహజం.అవి ఎప్పుడూ ఉన్నాయి.ప్రకృతి మనిషిని సృష్టించి ఊరుకుంది.మనిషి తన లక్ష్యాలని తనే నిర్ణయించుకుంటాడు.ప్రతి యుగంలోనూ అవి మారుతూ కూడా ఉంటాయి.చంద్రుడిమీదికి వెళ్ళివచ్చినా అతని బుద్ధి ఎత్తులకి ఎదగలేదు.ఇరాక్,పాకిస్తాన్,పాలస్తీనా,లాటి దేశాలు పేలుళ్ళని ఎదుర్కుంటున్నాయి.బాగుపడటం పేరుతో ఒకర్నొకరు చంపుకుంటున్నారు,గాయపరచుకుంటున్నారు.శ్మశాలను తయారుచేస్తూ దాన్ని మంచి చెయ్యటమని అంటున్నారు.లోకం నిజంగా బాగుపడుతోందా?బాగు అనేది ఒక ఆలోచన,తన బాగుతోపాటు అవతలివాడి బాగుకూడా కోరినప్పుడే లోకం బాగుపడుతుంది.అలా కానప్పుడు, అందరికీ అది అందనప్పుడు ఇక లోకం బాగుపడిందని ఎలా అంటాం?
 పని చెయ్యి కాని ఫలితాన్ని ఆశించద్దనే భగవద్గీత లోని  మాట వత్సలకి విచిత్రంగా అనిపిస్తుంది.ఒక పని చేస్తే దానికి ఫలితం లేకుండా ఎలా ఉంటుంది?తమ ఊళ్ళోనే మను కన్న రెండేళ్ళు పెద్దవాడు,యశరాజ్,తండ్రికి పెద్దగా డబ్బూ,తాహతూ లేకపోయిన ఎమ్.ఏ.వరకూ చదువుకుని కాంపిటిటివ్ పరీక్షల్లో ఐఏఎస్ పాసయి,ధిల్లీ లో ఏదో మినిస్ట్రీ లో అండర్ సెక్రెటరీ గా పనిచేస్తున్నాడు.అమ్మా నాన్న చూసిన అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు.మూడు నాలుగు నెలలకొకసారి తలిదండ్రులతో గడపటానికి ఒక వారం రోజులు సెలవపెట్టి మరీ వస్తాడు.ఇంత పెద్ద ఆఫీసరై కూడా నువ్వేమీ మారలేదోయ్ అంటే,ఏడాదిలో పదకుండు నెలలు మనకోసం బతుకుతున్నాం,మనని పెంచి పెద్దచేసిన అమ్మా నాన్నలకోసం ఒక్క నెల బతకలేమా?వాళ్ళు ఎంత కష్టపడితే నేనింతవాణ్ణయాను! అంటాడు.

ఇలాటి ఆలోచన మనుకి ఎందుకుండదని వత్సల బాధపడుతుంది.ఏడాదికొకసారైనా అమ్మా నాన్నలని చూడాలని అనిపించదా వాడికి?సెలవ దొరికినా,ఏ జర్మనీకో,ప్యారిస్ కో, స్విట్జర్లండ్ కో సరదాగా తిరిగి రావటానికి వెళ్తాడు.అక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయిట!

ఇల్లు అంటూ ఏర్పాటు చేసుకుంటే అమెరికాలోనే చేసుకుంటానని అంటాడు.అక్కడ ఏ ఊరైనా సరే ఎంతో బావుంటుందిట.కానీ వత్సల ఒప్పుకోదు.ఇండియాలో ఉన్నంత వెరైటీ ఇంకెక్కడా ఉండదంటుంది.కేరళలో పచ్చదనం,ఉత్తరాఖండ్ లోని పర్వతాలూ,మేఘాలయ లోని ఆ ప్రకృతి సౌందర్యం, ఇంకెక్కడుంటాయని అడుగుతుంది.తల్లీ కొడుకులకి ఎప్పుడూ వాదనే!

ఆ రోజు మను తనే ఫోన్ చేశాడు.

మను ,"అమ్మా! ఇంకా ఇక్కడికి వచ్చే విషయం ఆలోచించలేదా?అక్కడ ఏముందని?? ఎక్కడ చూసినా మురికీ ,చెత్తా.  గోండుల కిల్లా శిథిలమైపోయింది.వాళ్ళు మురికివాడల్లో బతుకుతున్నారు.వాళ్ళు  వారానికొకసారి ఊళ్ళోకొచ్చి, పందుంపుల్లలూ ఏవో బెరడులూ అవీ అమ్ముకుని పొట్టపోసుకుంటున్నారు.చూస్తేనే అసహ్యం వేసేట్టుండే మురికి మనుషులు.ఐ హేట్ టు హేవ్ బీన్ బార్న్ దేర్!"అన్నాడు.

"మరి మా ఇద్దరి మాటేమిట్రా?మేమిద్దరం ఉండటంలేదా?"

"అందుకేగా ఫోన్ చేస్తూ ఉంటాను? నా మాట విని ఇక్కడికొచ్చెయ్యండి.నాన్న ఆ పనేదో ఇక్కడే చెయ్యచ్చు."

"మీ నాన్నకి మన ఊరే స్వర్గం.అన్ని దేశాల్లోకీ ఇండియా అంటేనే ఇష్టం.ఇక నాకు ఆయన ఎక్కడుంటే అక్కడే ఉండటం ఇష్టం.ఈ ఊరితో మాకు ఎన్ని జ్న్యాపకాలు ముడిపడి ఉన్నాయో నీకు తెలీదు."

"సరే అయితే అక్కడే ఉండండి.కొన్ని రోజుల్లో ఒక ఫోన్ కొంటున్నాను,అందులో నా మొహం కనిపిస్తుంది నీకు.మనిద్దరం ఒకరినొకరం చూసుకోవచ్చు."

"ఆ ఫొన్ కనిపెట్టినది ఎవరో ఆసియా వాడే అయిఉంటాడు.కానీ పేరు మాత్రం ఎవడో తెల్లవాడు కొట్టేస్తాడు. బోస్ విషయంలో జరిగినట్టు.అదరికీ మార్కోనీ పేరే తెలుసు,బోస్ ని ఎవరూ తల్చుకోరు!"

మను మాట మార్చాడు,"నీకు ఆ ఊళ్ళో ఉండటం భయంగా లేదా అమ్మా? చుట్టూ కుష్టు రోగులే.నాన్న గ్లవ్స్ కూడా వేసుకోకుండా కుష్టురోగులని ముట్టుకోవటం నేను కళ్ళారా చూశాను!"అన్నాడు.

"ఒరే మనూ, నన్ను భయపెట్టేందుకు ప్రయత్నించకు.కుష్టు అంటురోగం కాదు.గాంధీ మహాత్ముడూ,బాబా ఆంటే, మదర్ థెరిసా .. వాళ్ళకి ఆ రోగం అంటుకోలేదే?ఒక వేళ ఖర్మ కొద్దీ అంటుకుందే అనుకో,దానికి మందులున్నాయి.మా పెళ్ళయి ముప్ఫై ఏళ్లయింది,రెండేళ్ళకి నువ్వు పుట్టావు.మనకెవ్వరికైనా ఆ రోగం వచ్చిందా?మనింట్లో తోటమాలికి కుష్టు వచ్చి తగ్గింది.నువ్వతని చంక దిగేవాడివేకాదు!"

"షిట్! కాస్త బాగా బతుకుదామంటే ఏమిటేమిటో చెపుతావు!"

"మీ నాన్న ఎప్పుడూ అనే మాటేమిటో తెలుసా?పరిగెత్తి ముందుకుపోవాలన్నది రేసుల్లో పరవాలేదు కానీ, జీవితంలో అందర్నీ కూడగట్టుకుని వెళ్ళాలి అంటారు.త్యాగంలో ఉన్న ఆనందమే వేరు.నోఆ తన నావలోకి మానవ జాతిని మాత్రమే ఎక్కించుకుని తీరం చేర్చలేదు,మనూ!"

"ఏమిటమ్మా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావు? అక్కడ ఆనందమా?నవ్వొస్తోంది నాకు."

"అవును రా నీకు సుఖానికీ ఆనందానికీ తేడాయే తెలీకుండా పోయింది."

"తేడా ఏముందసలు?"

"ఉంది...చాలా తేడా ఉంది.సుఖాన్ని డబ్బుతో కొనచ్చు.ఆనందం సంఘర్షణలో,త్యాగంలో,అంకితభావంలో దొరుకుతుంది.కుంగిపోయిన ఒక వ్యక్తి జీవితాన్ని మార్చు.అవిటివాడికి చేయూతనియ్యి.దు:ఖంలో ఉన్నవారిని ఆదుకో,అందులో ఉంది ఆనందం."

"సర్లే,నీ గాంధీ మహాత్ముడు చెప్పిన మాటలేనా ఇవన్నీ? ఇంక ఫోన్ పెట్టెయ్యి..."మను ఫొన్ పెట్టేశాడు.

అప్పుడు మను వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు.వత్సల మాట్లాడేదంతా విన్నాడు.ఆవిడ వచ్చి తన పక్కన కూర్చోగానే ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని,"మనూకి నువ్వు చెప్పేదంతా అర్థంకాదు వత్సలా.వాడు అమెరికనయిపోయాడు.వాళ్ళలాగే అలోచిస్తున్నాడు.వాళ్ళకి డబ్బే ప్రధానం.కొలంబస్ అమెరికాని కనుక్కున్నాడు,కానీ అక్కడికి బంగారం కావలన్న వ్యామోహంతో వెళ్ళిన తెల్లవాళ్ళు వీళ్ళు.ఫాసిజమ్ హిట్లరే తీసుకొచ్చాడంటారు కానీ వీళ్ళు చేసేది మాత్రం ఏమిటి?అంత నిర్దాక్షిణ్యంగా హిరొషిమా,నాగసాకీ మీద దాడులు చేసిన వాళ్ళని ఫాసిస్టులని కాక ఏమనాలి?తాలిబాన్ ని తయారుచేసింది వీళ్ళు కాదూ?వీళ్ళు తయారు చేసిన మిస్సైల్సే కదా ప్రపంచమంతా ఉగ్రవాదులని సృష్టించాయి?ప్రపంచమంతటా వాళ్ళ వస్తువులతో మార్కెట్లు తయారయాయి.అనవసరమైన చెత్తంతా ఈ రోజు మనిషి అవసరమని కొనుక్కుంటున్నాడు.తమ ఫాసిజాన్ని మానవ హక్కులతో పేరుతో కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు, కానీ స్వభావం మాత్రం అదే, ఏమీ మారలేదు.ఇక్కడి డాక్టర్లూ,ఇంజనీర్లూ,శాస్త్రగ్న్యులూ,అందరూ దూరపుకొండల మాయలో పడి దేశాన్ని అరాజక శక్తుల చేతుల్లో అప్పజెప్పి వెళ్ళిపోతున్నారు. దేశం గురించి ఏంతమాత్రం దిగులుపడకుండా సుఖంగా బతికేస్తున్నారు."

వత్సల ఆలోచనలు ఎప్పుడూ భర్త ఆలోచనలతో కలుస్తాయి.కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది...మను గురించి బాధపడుతూ.

ఒకరోజు ఫోన్ కి బదులు పోస్ట్ లో ఒక పెద్ద కవరొచ్చింది.అందులో కొన్ని కాయితాలతోపాటు ఒక ఉత్తరం కూడా ఉంది... నేను రంజన అనే అమ్మాయిని పెళ్ళిచేసుకోబోతున్నాను.తన తలిదండ్రులు న్యూజర్సీ లోనే ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నారు.రంజన నేను పనిచేసే కంపెనీలోనే కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది.వచ్చేవారం ముంబయి నించి మీ ఇద్దరికీ ఫ్లైట్ బుక్ చేశాను.మీరిద్దరూ వస్తే నాకు చాలా బావుంటుంది.మమ్మీ...ప్లీజ్...!

వత్సల మురిసిపోయింది."ఎంతైనా వాడు మనబ్బాయి!వీడి కోరికలు మనం కాకపోతే ఎవరు తీరుస్తారు?"అంది.

చరణ్ సీరియస్ అయిపోయాడు."నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు.నేను రాను.ఒక్కసారి మనకి చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు వాడికి!"అన్నాడు.

"మన బాధ్యత మనం నిర్వహిద్దాం!"అంది వత్సల.

"బాధ్యత ఒక వైపే ఉండదు వత్సలా!వాణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యటంవరకే మన బాధ్యత.ఇప్పుడిక వాడు తన బాధ్యత నిర్వహించాలి.ఎప్పుడన్న ఇక్కడికి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకోండి,అన్నీ నేను చూసుకుంటానని అన్నాడా? అక్కడ నన్ను ప్రాక్టిస్ చెయ్యమనే కదా ఎప్పుడూ వాడనేది?నేను కూడా డబ్బు సంపాదించి పెట్టాలి వాడికి!"

"ఇప్పుడు రమ్మని పిలుస్తున్నాడుకదండీ!"

"అది మనమీద ప్రేమతో కాదు,రంజన తలిదండ్రులు ఏమైనా అనుకుంటారని.ఆ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను,మీ ఉద్దేశం ఏమిటని ఒక్కసారైన అడిగాడా?అడిగితే కాదంటామా?"

భర్త మొహంలో బాధ కనిపించింది వత్సలకి.ఆయన లేచి బైటికెళ్ళాడు.వత్సల పని మమకారం ఒక వైపూ, కర్తవ్యం ఒక వైపూ అన్నట్టు తయారైంది.నిట్టొర్చి,ఆశీస్సులు పంపుతున్నామని ఉత్తరం ముక్క రాసి,ఫ్లైట్ టిక్కెట్లతో కలిపి పోస్ట్ చేసెయ్యాలని నిర్ణయించుకుంది.మర్నాడే ఆ పని చేసేసింది.

మను యశ్రాజ్ కి ఫోన్ చేసి తన తలిదండ్రులు మహా చాదస్తులనీ, టిక్కెట్లు కూడా వెనక్కి పంపేశారనీ ,ఆ దిక్కుమలిన చెత్తా ఊళ్ళోనే ఉండమను అని కోపాన్ని వెళ్ళగక్కాడు.

యశ్రాజ్ మను కి నచ్చజెప్పాడు.నువ్వు ఎవరో పరాయి మనిషి పిలిచినట్టు వాళ్ళని పెళ్ళికి రమ్మని పిలిచావు.వారం రోజుల్లో పాస్ పోర్టూ,వీసా ఎలా రెడీ అవుతాయనుకున్నావు? అని మందలించాడు.

"డేమ్ యువర్ కంట్రీ!మనుషులని టెర్రరిస్టుల్లాగ చూసే ఆ దేశంలో ఏముందని అక్కడ పాతుకుపోయారు?లెట్ దెమ్ లివ్ ఎండ్ డై ఇన్ దేర్ ప్యారడైజ్!ఐ కేర్ ఎ డేమ్ ఫర్ దెమ్!!"

వత్సల చాలాసార్లు కొడుక్కి ఫోన్ చేసింది,కానీ అతను సంబంధం తెంచుకున్నాడు.ఫోన్ కట్ చేస్తూనే ఉన్నాడు.భర్త దగ్గర తన బాధ కక్కింది వత్సల,"ఏమిటండీ వీడు? మనరక్తం పంచుకుని పుట్టిన వాడు...!"

చరణ్ నవ్వాడు,"ఆ రక్త సంబంధాలన్నీ రాముడితోనూ దశరథుడితోనూ చెల్లు.కృష్ణుడు చూడు,దేవకి మీదకన్నా యశోద మీదే ప్రేమ ఎక్కువ!నందుణ్ణి తండ్రిలా ప్రేమించలేదూ?"

"అన్నిటికీ ఏదో ఒకటి చెపుతూ ఉంటారు.అవన్నీ మూటకట్టి గంగలో పారెయ్యండి! నా కొడుకు నాకు కాకుండా పోయాడు!"భార్య నోట ఇంత కర్కశమైన మాటలు ఎన్నడూ వినని చరణ్ నిర్ఘాంతపోయాడు.

కానీ మను యశ్రాజ్ కి తరచు ఫోన్ చేస్తూనే ఉన్నాడు."ఏమోయ్ ఐఏఎస్!ఎలా ఉన్నావు? కాశ్మీరు మాత్రమే కాకుండా మిగతా ఊళ్ళమీద కూడా ఉగ్రవాదుల కళ్ళు పడ్డాయిట?అసలు ఈ భూమ్మీద పెరిగిపోతున్న అన్యాయానికి బైటెక్కడినుంచో ఉగ్రవాదులు రానక్కరలేదు.అందరూ లోపలే అవకాశంకోసం చూస్తున్నారు!ఉల్ఫాలూ,నక్సలైట్లూ,సిక్కులూ.అక్కడి నేతలు టిక్కెట్టు దొరక్కపోతే ఎదురుతిరుగుతారు,మరో పార్టీలో చేరిపోతారు, ఇంకా అయితే వాళ్ళే ఒక కొత్త పార్టీ పెడతారు.మీ పోలీసులు నేరస్తులకి దోస్తులు.దుకాణాల్లో అన్నీ నకిలీ వస్తువులే.ఇంక నీలాటి...సివిల్ సర్విసెస్ వాళ్ళు రాజకీయ నాయకుల తోకలు తప్ప మరేమీ కాదు.ఇక్కడ చూడు,ట్రేడ్ టవర్స్ కూలిపోయాక మళ్ళీ బిన్ లాడెన్ ఇటుకేసి చూడగలిగాడా?అదీ అమెరికా!"

అమెరికాలో బ్యాంకు దివాలా తీసింది.ఇండియాలో కూడా స్టాక్ ఎక్స్చేంజి తలకిందులయిందని యశరాజ్ మనుకి చెప్పాడు.మను విసుక్కున్నాడు,"అమెరికా ప్రపంచమంతటా శాంతి నెలకొనాలని ప్రయత్నిస్తోంది.అందుకోసం పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,ఇంకా ఎన్నో దేశాలకి తమ ఆర్మీనీ,డాలర్లనీ పంపుతోంది.మిగతా దేశాల ఆర్థిక స్థితి సరిగ్గా ఉండాలనే తాపత్రయంతో,తమ దేశపు ఆర్థిక స్థితిని పట్టించుకోటంలేదు,"అన్నాడు.

"కాదు మనూ! సోవియట్ రష్యా ని ముక్కలుచేసాక ఇప్పుడిక ప్రపంచం మొత్తం లో ఏకైక శక్తిగా ఉండాలని ప్రయత్నిస్తోంది అమెరికా.తను తయారుచేసిన తాలిబాన్,పాకిస్తాన్,ఇరాక్ ని అణచిఉంచాలని దాని ప్రయత్నం.మతపరమైన విభేదాలని పోగొట్టాలని కాదు అమెరికా కోరేది,వాటిని మరింతగా పెంచాలనే.అప్పుడే అమెరికాకి లాభం."

"అలా అని నువ్వనుకుంటున్నావు.కానీ అమెరికా మునిగిపోతే నీ దేశం కూడా మునుగుతుంది!"

"నువ్వు పొరబడుతున్నావు మనూ! ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పాతకాలం నాటిది.అమెరికా.యూరప్ లాగా ఇది అంత సులభంగా మునిగిపోదు.మీ నాన్న అనేది నిజమే, పడిపోయే ఫాసిస్టు పైకెదిగే ఫాసిస్టు కన్నా ప్రమాదకరమైనవాడని అంటాడాయన.ఎదుగుతున్న సమయంలో అమెరికా ఒక హిరోషిమా,నాగసాకీలని మాత్రమే నాశనం చేసింది.కొరియా వియెత్నాంలని కాలరాసి వదిలెసింది.కానీ ఇప్పుడు అమెరికా పరిస్థితి దిగజారుతోంది.ఇరాక్,పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్ లని పూర్తిగా నాశనం చేసికాని ఊరుకోదు.ఇండియాని కూడా అమెరికా అణచివేసే ప్రయత్నం చేస్తే ఆశ్చర్యపోవక్కర్లేదు."

"అది నీ ఉద్దేశం,కానీ నిజంకాదు!"

చాలా కాలం పాటు మను ఫోన్ చెయ్యకపోయేసరికి యశరాజ్ తనే ఫోన్ చేశాడు.మను పలికాడు కానీ అతని గొంతులో మునుపటిలా ఇండియా గురించి వ్యంగ్యమూ,అమెరికా గురించి పొగడ్తలూ వినబడలేదు.గద్గదమైన గొంతుతో,"యశ్,ప్రపంచాన్ని బాగుచెయ్యాలన్న ప్రయత్నంలో అమెరికా కూడా సమస్యల్లో చిక్కుకుంది.మా కంపెనీలో కూడా చాలామందిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు,"అన్నాడు మను.

"రంజన ఉద్యోగం కూడా పోలేదుకదా?"

"లేదు,నా పేరు ఉంది.అప్పుడే చాలా ఉద్యోగాలకి అప్లికేషన్లు పెట్టుకున్నాను."

"వెనక్కి వచ్చెయ్యకూడదా మనూ?"

"ఏమిటి యశ్ నువ్వు...?"అని మను ఫోన్ పెట్టేశాడు.

దీపావళికి పట్నంనించి తమ ఊరికి బైలుదేరాడు ,యశ్.వెళ్ళేముందు మనుకి శుభాకాంక్షలు చెప్పాలనిపించి ఫోన్ చేశాడు." దీపావళీ లేదు,మన్నూ లేదు,యశ్!"అన్నాడు మను భారంగా.

"అదేమిటి? అమెరికాలో కూడా మనవాళ్ళు పండగ చేసుకుంటారని విన్నానే?"

"అవును, కానీ నన్ను ప్రస్తుతం చీకట్లు చుట్టుముట్టాయి!"

"ఏమైంది?"

"మునుపు సంపాదించినదాన్లో నాలుగోవంతు జీతానికి మరో కంపెనీ నాకు ఉద్యోగమిచ్చింది.రంజనకి ఉద్యోగం లేదు.ఆ కంపెనీ మూతపడింది."

"రంజన తలిదండ్రులు అక్కడే ఉన్నారుగా, పరిస్థితి బాగుపడేదాకా అక్కడ ఉండచ్చుగా? "

"బాస్టర్డ్స్! వాళ్ళగురించి మాట్లాడకు. దొంగ ఫైనాన్స్ కంపెనీ నడిపేరు లాగుంది,ఇప్పుడు జైల్లో ఉన్నారు ఇద్దరూ!"

"ఓ! అయితే నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావన్నమాట?"

"అవును,యశ్! ఏంచెయ్యాలో అర్థంకావటంలేదోయ్!"

"ఇండియాకి వచ్చెయ్.నీలాటివాళ్ళకి ఉద్యోగాలకి ఏమీ కొదవలేదిక్కడ.మన దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అంత ఘోరంగా మాత్రంలేదులే."

"నేను కూడా వచ్చేద్దామనే అనుకుంటున్నాను."

"రంజన ఏమంటుంది?తను కూడా వస్తుందిటా?"

"బహుశా రాదెమో! తను విడాకులకి అప్లై చేసింది."

"అదేమిటి?"

"ఒక అమెరికన్ ఏజెంట్ తో ఇదివరకే ఆమెకి అఫైర్ ఉంది."

"అవునా?"

"నువ్వు మా అమ్మా నాన్నకి నచ్చచెప్పగలవా,యశ్?"

"వాళ్ళగురించి బాధపడకు.వాళ్ళు అర్థంచేసుకోగలరు.నువ్వంటే ఇద్దరికీ ప్రాణం!"

దీపావళి తరవాత యశరాజ్ మను తలిదండ్రులని కలిశాడు.అతను చెప్పిన విషయాలు విని వత్సలకి కళ్ళనీళ్ళపర్యంతమైంది."ఇక్కడికి వచ్చేందుకు టిక్కెట్ కి వాడిదగ్గర డబ్బు లేకపోతే మాకు చెప్పు,పంపిస్తాం,"అంది.

"దాన్ని గురించి మీరు బెంగపడకండి."

చరణ్ వీళ్ళ మాటలు మౌనంగా వింటూ ఉండిపోయాడు.కొంతసేపయాక,నెమ్మదిగా,"౧౯౫౦ లోనే రాజ్యాంగంతో బాటు గాంధీజీ చెప్పిన అర్థశాస్త్ర వ్యవస్థని కూడా అమలుచేసిఉంటే మన కుర్రాళ్ళు బైటికి వెళ్ళే అవసరమే రాకపోను!ఈరోజు మొత్తం వ్యవస్థంతా ఇండియాని యూరపులాగ తయారుచేసే ప్రయత్నంలో ఉంది.పొరపాటు ఎక్కడ జరిగింది?"అన్నాడు

యశరాజ్ లోని ఐఏఎస్ జవాబు చెప్పలేదు.అతనికి కారణం తెలుసు,కానీ చెప్పలేడు.గాంధీకీ మార్క్స్ కీ మధ్య పోట్లాట పెట్టి కేపిటలిస్టులు ప్రగతిని దోచ్కుంటున్నారని అతనికి తెలుసు.కేపిటలిస్టులు పాఠాలు నేర్చుకునేది అమెరికా యూరప్ అడుగుజాడల్లో నడిచి.అదికూడా యశరాజ్ కి తెలుసు.కానీ అతనికి తను నిస్సహాయుడని అనిపించింది.

=====================================================================================================

మూలం :హిందీ కథ...విజయ్

అనువాదం : ఆర్.శాంతసుందరి





No comments:

Post a Comment