Friday, April 1, 2011


చరిత్ర
=======
            - సంజీవ్

    
                                                                                                    
                                            మసక బారిన ఆ చరిత్ర పుటల్లో ఏమి రాసిఉందో, ఎవరికీ సరిగ్గా తెలీదు, కానీ చెప్పే ప్రతివాడూ తను చెప్పేదే నిజమని బల్లగుద్ది చెపుతాడు.మొత్తం విషయమంతా తెలుసుకోవాలంటే , కథ మొత్తం విప్పాల్సి వస్తుంది.ఇంత గందరగోళంలో చిక్కుకుని , నలిగి, అరిగి , వంకరలు తిరిగిపోయిన దీన్ని ఒక్కొక్క పొరే విప్పుతూ , ఒక్కొక్క అక్షరాన్నీ పేర్చి చదవాలి.ఆ తరవాత అర్థం చేసుకోవాలి, అప్పటికి ఏమైనా అర్థం అవుతుందేమో చూడాలి.కానీ ఇక్కడ కూడా ప్రమాదం లేకపోలేదు , ఒక చిన్న విత్తనం చుట్టూ దుబ్బులాగ బోలెడంత అపోహలు పెరిగిపోయి ఉంటాయి. నిజం! నిజాన్ని ఎవరైనా ఎప్పుడైనా పూర్తిగా తెలుసుకో గలిగారా!
                                               కాదు కాదు ,ఇది మొహెంజదారో హరప్పా కి సంబంధించిన విషయం కాదు భాయీ ! ఇది బిలౌనా అనే పల్లె సంగతి.ఐదు వేల ఏళ్ళ కిందట జరిగింది కాదు  ఒక యాభై అరవై ఏళ్ళ కిందటి సంఘటన.
                                         అప్పుడు మనని బ్రిటిషు వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు.ఈ ప్రాంతాల కొన్నేళ్ళ క్రితమే రైలుబండి  వెళ్ళడం మొదలుపెట్టింది.ఆవిరింజను భుగభుగమని పొగలు కక్కేది. ఛుక్ ఛుక్...పీ పీ...అంటూ పరిగెత్తేది.ఇక బిలౌనా పాట్నా హౌరా ఏమీ కాదు కదా అక్కడ ఆగేందుకు? బిలౌనా జనం డాబుగా పంచె కొస ఒక చేత్తో పట్టుకుని విలాసంగా మీసాలు మెలేస్తూ ప్రయాణం చేసేందుకు?

                                       ఈ రైలు బిలౌనా జనం గుండెలదిరేట్టు ధన్ ధన్ మంటూ తమ ఊరిమీదుగా వెళ్ళిపోతూంటే వాళ్ళకి అంతకన్న పెద్ద అవమానమేం కావాలి? రెండు వైపులా పంట పొలాలలో కనుచూపు మేర వరకూ గంగ నీళ్ళు. రైలుకట్ట కట్టేందుకు అటూ ఇటూ ఉన్న పొలాలని తవ్వేసి మట్టి తోడే్శారు. వాళ్ళ నేల , వాళ్ళ పొలాలు . రైలు వాళ్ళ గుండెల మీదినించి పరిగెత్తడం చూస్తే బిలౌనా తన ఒంటికి ఎక్కడ తగులుతుందో నని పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి.రైలు పట్టుకోవాలంటే ఒక కోసు దూరం ముందుకో వెనక్కో వెళ్ళవల్సిందే. స్టేషన్లు అక్కడే ఉన్నాయి మరి.
                                         ఇంకే విషయంలో ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా బిలౌనా లో స్టేషన్ ఉండాలనే విషయంలో మాత్రం అందరూ ఒకే మాట మీదున్నారు.ఇది ఒక్క బిలౌనా వాళ్లే కాదు , హాథీ పేట ,జానకీ దహ్,ఇస్లామైల్పుర్, శామ్యూల్ గంజ్ తో సహా పాతిక ఊళ్ళు , రైలుకట్టకి అటూ ఇటూ ఉన్నవి, స్టేషన్ కావాలని అనుకున్నాయి. ఇంక ఒకటే హడావిడి మొదలైంది. చందాలు పోగయాయి,
ఎందరి కాళ్ళో పట్టుకోవలసి వచ్చింది,సంతకాలు సేకరించేందుకు బోలెడన్ని కాయితాలు ఖర్చయిపోయాయి....కానీ చివరికి మిగిలింది నిరాశే.

                                                      మూడేళ్ళు ఇదే విధంగా గడిచిపోయాయి.అప్పుడు అందరికీ కబురంపి ఒక చోట చేర్చారు. ఇప్పుడిక ట్రైన్ ని (రైలు కి ఈ కొత్త పెరు వాళ్ళకి తెలిసిపోయింది) , బిలౌనా లో ఆపించాల్సిందే .మంచిగా ఆపకపోయినట్టైతే ఇంకో మార్గంలో...అంటే బలవంతంగా ... ఆపిస్తామని నిర్ణయించారు.
                                     " ఆపేందుకు ఎవరెవరు వెళ్తారు? " ఒకరికి సందేహం వచ్చింది.
                                    "అందరం వెళ్ళాలి."
                                    "ఎప్పుడు?"
                                   " ఇవాళ్టికి మూడు నెలల తరవాత , సూర్యభగవానుడు ఉత్తరాయణానికి చేరుకున్నప్పుడు ,మంచిరోజు చూసుకుని .వాళ్ళకి ముందుగా హెచ్చరిక పంపాలి , మూడు నెలెల లోపల రైలు మన ఊళ్ళో ఆగేట్టు చెయ్యకపోతే మనం గాంధీ మహాత్ముడిలా సత్యాగ్రహం చేస్తామని బెదిరించాలి."
                                   చూస్తూండగానే తొంభై రొజులూ గడిచిపోయాయి. ఇక పాతిక ఊళ్ళలోనూ దండోరా వేయించారు. " వినండోహో...ఇది మనందరి ఆత్మగౌరవానికీ సంబంధించిన సమస్య.ఆడా మగా అందరికీ తెలియజేసేదేమనగా బినౌలా లోని పాత రావి చెట్టు కిందికి అందరూ రావలసిందని మనవి. ట్రైను ఆపడం విషయమై ఆలోచించేమ్దుకు అందరూ రావాలొహో...!"
                                    "చావడానికా?"
                                   "అబ్బా ,నీ దుంపతెగా ! గాంధీ గారి సత్యాగ్రహం చావదానికిట్రా?"
                                  "కానీ బ్రిటిషు దొరలు సత్యాగ్రహం చేస్తామంటే వింటారా?"
                                 "ట్రైను డ్రైవరు నలురైదుగురు నిలబడి ఉండటం చూస్తే ఆపకపోతాడంటావా?మనమీంచి రైలు పోనిస్తాడా?"
                                 " ఒక వేళ అలా పోనిస్తే? అప్పుడేం చేస్తాం? మేము మేకల్లాటి వాళ్ళం మే ... మే... అంటూ చచ్చి ఊరుకుంటాం ! మీకేం పులులు మీరు , తప్పించుకుంటారు."  
                                "బ్రిటిషు రాజ్యం లో పులీ మేకా ఒకే చెరువులో నీళ్ళు తాగుతాయి!"
                                                           ఇంకేముంది, అన్ని అనుమానాలూ , సందేహాలూ తీరాక , పులులూ మేకలూ ఒకే  ఒడ్డున గుమిగూడాయి. ఒడ్డు అంటే రైల్వే లైన్.పట్టాలు ఊరి జనంతో నిండిపోయాయి రైలు అర్ధరాత్రి వస్తుంది.దాని హెడ్ లైట్ దూరం నించే నక్షత్రం లాగ కనబడుతుంది.దగ్గరైనకొద్దీ పెద్దదౌతుంది.జనం మాటి మాటికీ అటుకేసి చూస్తున్నారు , కానీ నక్షత్రం కాదుకదా , చిన్న మిణుగురు కూడా కనబడ లేదు.అన్నివైపులా చిమ్మచీకటి.కుంటి గజాధర్ ఉండుండి పట్టాల మీద చెవి ఆనించి విని , ఇంకా రైలు రావడం లేదని చెపుతున్నాడు.
                            "ఎంత దూరంలో ఉంది?" అని అడిగారెవరో.
                            "ఛట్ ఉండరా , వాణ్ణి విననీ...మధ్యలో మాట్లడక." కసురుకున్నారు మిగిలిన జనం.
                           అరగంట అలా ప్రయత్నించాక  గజాధర్ కి రైలు చప్పుడు దూరంగా వినిపించింది. "వస్తోంది , సిద్ధంగా ఉండండి..."అని హెచ్చరించాడు.అది అంచలంచలుగా అందరికీ చేరింది.


                                   మూడేళ్ళు ఇదే విధంగా గడిచిపోయాయి.అప్పుడు అందరికీ కబురంపి ఒక చోట చేర్చారు. ఇప్పుడిక ట్రైన్ ని (రైలు కి ఈ కొత్త పెరు వాళ్ళకి తెలిసిపోయింది) , బిలౌనా లో ఆపించాల్సిందే .మంచిగా ఆపకపోయినట్టైతే ఇంకో మార్గంలో...అంటే బలవంతంగా ... ఆపిస్తామని నిర్ణయించారు.
                                     " ఆపేందుకు ఎవరెవరు వెళ్తారు? " ఒకరికి సందేహం వచ్చింది.
                                    "అందరం వెళ్ళాలి."
                                    "ఎప్పుడు?"
                                   " ఇవాళ్టికి మూడు నెలల తరవాత , సూర్యభగవానుడు ఉత్తరాయణానికి చేరుకున్నప్పుడు ,మంచిరోజు చూసుకుని .వాళ్ళకి ముందుగా హెచ్చరిక పంపాలి , మూడు నెలెల లోపల రైలు మన ఊళ్ళో ఆగేట్టు చెయ్యకపోతే మనం గాంధీ మహాత్ముడిలా సత్యాగ్రహం చేస్తామని బెదిరించాలి."
                                   చూస్తూండగానే తొంభై రొజులూ గడిచిపోయాయి. ఇక పాతిక ఊళ్ళలోనూ దండోరా వేయించారు. " వినండోహో...ఇది మనందరి ఆత్మగౌరవానికీ సంబంధించిన సమస్య.ఆడా మగా అందరికీ తెలియజేసేదేమనగా బినౌలా లోని పాత రావి చెట్టు కిందికి అందరూ రావలసిందని మనవి. ట్రైను ఆపడం విషయమై ఆలోచించేమ్దుకు అందరూ రావాలొహో...!"
                                    "చావడానికా?"
                                   "అబ్బా ,నీ దుంపతెగా ! గాంధీ గారి సత్యాగ్రహం చావదానికిట్రా?"
                                  "కానీ బ్రిటిషు దొరలు సత్యాగ్రహం చేస్తామంటే వింటారా?"
                                 "ట్రైను డ్రైవరు నలురైదుగురు నిలబడి ఉండటం చూస్తే ఆపకపోతాడంటావా?మనమీంచి రైలు పోనిస్తాడా?"
                                 " ఒక వేళ అలా పోనిస్తే? అప్పుడేం చేస్తాం? మేము మేకల్లాటి వాళ్ళం మే ... మే... అంటూ చచ్చి ఊరుకుంటాం ! మీకేం పులులు మీరు , తప్పించుకుంటారు."  
                                "బ్రిటిషు రాజ్యం లో పులీ మేకా ఒకే చెరువులో నీళ్ళు తాగుతాయి!"
                                                           ఇంకేముంది, అన్ని అనుమానాలూ , సందేహాలూ తీరాక , పులులూ మేకలూ ఒకే  ఒడ్డున గుమిగూడాయి. ఒడ్డు అంటే రైల్వే లైన్.పట్టాలు ఊరి జనంతో నిండిపోయాయి రైలు అర్ధరాత్రి వస్తుంది.దాని హెడ్ లైట్ దూరం నించే నక్షత్రం లాగ కనబడుతుంది.దగ్గరైనకొద్దీ పెద్దదౌతుంది.జనం మాటి మాటికీ అటుకేసి చూస్తున్నారు , కానీ నక్షత్రం కాదుకదా , చిన్న మిణుగురు కూడా కనబడ లేదు.అన్నివైపులా చిమ్మచీకటి.కుంటి గజాధర్ ఉండుండి పట్టాల మీద చెవి ఆనించి విని , ఇంకా రైలు రావడం లేదని చెపుతున్నాడు.
                            "ఎంత దూరంలో ఉంది?" అని అడిగారెవరో.
                            "ఛట్ ఉండరా , వాణ్ణి విననీ...మధ్యలో మాట్లడక." కసురుకున్నారు మిగిలిన జనం.
                           అరగంట అలా ప్రయత్నించాక  గజాధర్ కి రైలు చప్పుడు దూరంగా వినిపించింది. "వస్తోంది , సిద్ధంగా ఉండండి..."అని హెచ్చరించాడు.అది అంచలంచలుగా అందరికీ చేరింది.


                                                                             తలపాగాలు కట్టుకున్నారు. కాగడాలు వెలిగించి పట్టుకున్నారు. ధోవతులు కట్టుకుని , కాశెలు బిగించారు. మరోపక్క ఆడవాళ్ళ ధైర్యం దెబ్బతింది.వాళ్ళు ఏడవడం మొదలెట్టారు.కొందరైతే శోకాలు పెట్టసాగారు.సిర్జుల్ హక్ ఆడవాళ్ళనీ , పిల్లలనీ రైలుకట్టకి దూరంగా తీసుకుపొమ్మని , హర్జిందర్ బాబా కి చెప్పాడు.బలీ కీ జైఇంతలో హెడ్ లైటు కనిపించింది.ఛుక్ ఛుక్ అనే చప్పుడు కూడా దగ్గరవసాగింది.వాతావరణం వేడెక్కింది." బజరంగ్ బలీ కీ జై... కాళీ మాతకి జై ...యా అలీ...ఏసుక్రీస్తు మమ్ము కాపాడుగాక..." అంటూ ప్రతిఒక్కరూ తమ తమ దేవుళ్ళని ప్రార్ధించసాగారు . కొంతసేపటికి ఆ దేవుళ్ళందరూ కలగలిసిపోయారు.
                                                                           ఇంజను కూత పెడుతూ ముందుకి వస్తోంది.... పీ....పీ...తొలగండి...దారివ్వండి....పీ...అంటున్నట్టు ! జనంలోనుంచి కేకలు మొదలయ్యాయి... మేం కదలంగాక కదలం...ట్రైను ఇంకా ఇంకా దగ్గరవసాగింది. జనం గుండెల్లో రైళ్ళు పరిగెత్తసాగాయి. " ఓర్నాయినో ! మీదిమీదికొచ్చేస్తోందేంటిరా దీని దుంపతెగా!! అగదా ఏమిట్రా? ఒరే పరిగెత్తండిరా...గజధర్...షమ్సుల్...ఫిలిప్పూ...పారిపోదాం రండర్రా... రైలు అదే వేగంతో దడదడ మంటూ వెళ్ళిపోయింది. గొంతులన్నిటినీ నొక్కేస్తూ...చక్రాలకింద నలిపేస్తూ ...వెళ్ళిపోయింది.ఆఖరి క్షణామ్ లో తప్పించుకో గలిగినవాళ్ళు తప్పించుకున్నారు. లేనివాళ్ళు బండికింద పడి ముక్కలు ముక్కలై చనిపోయారు.ఆ చీకట్లో శోకాలు పెడుతూ మిగిలినవాళ్ళు తమవాళ్ళ శవాలని కాగడాల వెలుతుర్లో వెతకసాగారు.తెల్లవారే వరకూ వెతుకుతూనే ఉన్నరు. శవాల ముక్కలు ఎన్నో ఫర్లాంగుల వరకూ విసిరివేయబడ్డాయి.
                                                                          డాక్టర్లు వచ్చారు , సిపాయిలు వచ్చారు." ఎవరెవరు చనిపోయారు? ఎందరు? ముగ్గురా?"
                                                                          " అబద్ధం ! ముగ్గురు కాదు , ముఫ్పై మంది... ఇరవై ఏడు మంది శవాలే దొరకలేదు.!"
                                                                           ముగ్గురో ముఫ్పైమందో , ఏదైతేనేం? వాళ్ళ ప్రాణాలు పోవడం వల్ల ఒక రకంగా మంచే జరిగింది. ట్రైను అక్కడ ఆగసాగింది.ఇవాళ చిన్న ప్యాసెంజరు ఆగుతోంది , రేపు మైలు కూడా ఆగుతుంది , అనుకున్నారు ఊరి జనం.స్టేషిన్లో ఒక బోర్డు పెట్టారు... " ఫలానా తేదీన బినౌలా లో రైలు ఆపించడం కోసం తమ ప్రాణాలర్పించారు."
                                                                          ఏళ్ళు గడిచాయి. తెల్లదొరలు దేశాన్ని వదిలి పోయారు.నల్లదొరలు వచ్చారు. రాగానే బోర్డు మార్పించేశారు.ముగ్గురు అని ఉన్న చోట ముఫ్పై మంది అని రాయించారు.వాళ్ళందరి పేర్లూ, వయసూ ,కులం , ఊరి పేరూ నమోదు అయాయి. ఆ బోర్డు ఇలా పెట్టారో లేదో పెర్ల గురించి అభ్యంతరాలు మొదలయాయి....బుధచక్ కి చెందిన పరమేశ్వర్ పేరు లేదు...శివపుర్ దులారే పేరు ఎందుకు లేదు? ఇస్లాంపుర్ ఇలియాస్ పేరూ ,అర్మాన్ పేరూ నమోదు కాలేదేం?శామ్యూల్ గంజ్ మనిషి ఒక్కరి పేరు కూడా ఇందులొ లేదు ! ఇక ఆడవాళ్ళ గోల మరోవైపు...ఒక్క స్త్రీ పేరు కూడా చేర్చలేదేమ్ అంటూ గొడవ చేశారు.ఆడవాళ్ళెవరూ చనిపోలేదా? అని సవాళ్ళు. పేర్ల గురించి విచారించవలసిందంటూ అర్జీలు పెట్టుకున్నారు. కమిటీలని ఏర్పాటు చేశారు.
                                                                       మరో వైపు బినౌలా కి చెందిన కవి సురాజీ అమరులైన వాళ్ళని పొగుడుతూ ఒక కవిత రాశాడు. స్వాతంత్ర్యదినం రోజున ప్రతి ఏడూ ఆ పాటనే జనం పాడసాగారు.అది అలా అలా జనం నోళ్ళలొ నాని ఒక హరికథ లాగ మారిపోయింది. తద్దినాలలో కూడా చోటు చేసుకుని ఒక బిలౌనా లోనే కాక చుట్టుపక్కల గ్రామాలన్నిట్లోనూ ప్రసిద్ధి పొందింది.
                                                                        మరికొన్నేళ్ళు గడిచాయి.జానకీదహ్ లోనూ హాథీపేట్ లోనూ పాతకాలం నాటి భూమి గంగ గర్భంలోకి వెళ్ళిపోయింది. కానీ నదిలోనుంచి కొత్త భూభాగం బైట పడింది.దాన్ని కబ్జా చెసేందుకు పెద్దెత్తున పోటీ ప్రారంభమైంది.కులాల కుమ్ములాటలూ , ఊళ్ళమధ్య కొట్లాటలూ , లాఠీలూ , తుపాకులూ... చరిత్రలో చీలిక ఏర్పడింది.చీలిన చరిత్ర పగుళ్ళలోంచి కొత్త చరిత్ర తొంగి చూడసాగింది.
                                                                         "అదేమిటి? రఘుబాబు పేరు అమరుల లిస్టులోకి ఎలా వచ్చింది? అతను రైలు రావడం చూడగానే పారిపోయాడుగా?"
                                                                        " ఇటు చూడండి...పరమేశ్వర్ పేరు కూడా ఉందిక్కడ. అతను ఎప్పుడో జానకీదహ్ లో మునిగి చనిపోయాడు."
                                                                        "అదేంటయ్యా, అతని శవం దొరికిందని అన్నారే?"
                                                                        "అది కాళేశ్వర్ ది బాబూ!"
                                                                       "ఇక చరనిక్ , అతను గడ్డం పెంచుకుని పాట్నా లోని ఏదో గుళ్ళో ఉన్నాడు!"
                                                                       "అలాగా?"
                                                                      " మరేమిటి? పూలేశు తను కళ్ళారా చూశానని అంటున్నాడు."
                                                                       "అమీరుల్లా గురించి కూడా ఎవరో చెప్పారు...ఎకాడబ్బా?...ఆ...బొంబైలో ఉన్నాడుట."
                                                                       జనం నొటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వుకోటం మొదలుపెట్టారు. చాలా గోల్ మాల్ ఉంది భాయ్...చరిత్ర నిండా అబద్ధాలే!

                                                                        కళ్ళజోళ్ళు తగిలించుకుని ఒక్కొక్కరి జాతకాన్నీపరిశీలించడం మొదలుపెట్టారు. అప్పుడు ముఫ్పైమంది అమరుల పేర్లూ నిజమా కాదా అన్న సందిగ్ధంలో పడ్డాయి.మిగతా జాతులవాళ్ళందరూ కుక్కల్లాగ మొరిగి నోళ్ళు మూసుకున్నారు కానీ  బ్రాహ్మలకీ యాదవులకీ మధ్య రగడ తలెత్తింది.రెండు వైపులా ఘోరమైన కొట్లాట జరిగిఉంటే అమరుల లిస్టు కి మరికొన్ని పేర్లు చేరి ఉండేవి. దేవుడి దయవల్ల అలా జరగలేదు.
                                                                        బోర్డులో రాత్రికి రాత్రి మార్పులు జరిగిపోయాయి. "ముఫ్పైమంది అమరులు" కి బదులు ఎవరో "ముఫ్పైమంది బ్రాహ్మలు" అని రాసేశారు ( ఊళ్ళో అక్షరాస్యత పెరిగిందనడానికి ఇదే నిదర్శనం ). మర్నాడు బ్రాహ్మలు అనే మాట చెరిపేసి యాదవులు అని రాశారెవరో.మొదటి లిస్టు లో ప్రతి పేరు ఎదుటా వాళ్ళ కులాల పేర్లు కూడా రాశారు.ఇప్పుడు  నిజం తెలుసుకునే సాకుతో మళ్ళీ వాళ్ళ కులాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే ప్రశ్న తలెత్తింది. అసలు బిలౌనా లో జరిగిన ఆ ప్రమాదం లో శవాలు ఒకదానితో ఒకటి చుట్టుకుపోయి ఎవరెవరో గుర్తుపట్టడం అసాధ్యం అయింది.అందరి రక్తమూ కలగలిసి ఒకటైపొయింది.ఒకవేళ గుర్తుపట్టగలవాళ్ళెవరైనా ఉన్నా వాళ్ళు కూడా చనిపోయారు. కొత్త కొత్త కట్టుకథలు పుట్టుకు రాసాగాయి. అవమానాలూ అహంకారాలూ రగలసాగాయి.ఇలాటి గొడవల మధ్య ఒక రోజు ఆ బోర్డే మాయమయింది. ఎవరికో తిక్కపుట్టి మొత్తం అమరులందర్నీ గంగలో కలిపేశాడు. అర్కిమిడీస్ సూత్రం ప్రకారం ఆ బోర్డు నీటిలో మునగకుండా తేలసాగింది.కొంతమందికి చరిత్రని పునరుధ్ధరించాలన్న ఆవేశం వచ్చిందిట   కానీ అది సాధ్యం కాలేదు...కారణం , ఆ బోర్డుని ఒక పాము ఆక్రమించుకుంది.ఎవరైనా దగ్గరకొస్తే బుసలు కొట్టసాగింది. ఆ విధంగా చరిత్ర లిఖిత రూపంలో కాకుండా జనం నోట్లో మాత్రమే ఉండిపోయింది. ఎవరైనా అడ్డు చెపితే ," నోరు మూసుకో ! ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం! " అని వాళ్ళ నోళ్ళు మూయించెయ్యడం మొదలుపెట్టారు.
                                                                       ఈ గొడవలతో విసిగిపోయి ఒక రోజు , శత్రుఘ్న రాయ్ తన కులంలోని ముఫ్పైమంది మూర్ఖులు రైలు కింద పడి చచ్చారని అన్నాడు. ఆయన ముఖకవళికలు చూస్తే తిడుతున్నాడో మెచ్చుకుంటున్నాడో తెలీలేదు. దాంతో బూటన్ యాదవ్ అతను చెప్పిన మాటని కాదంటూ," బ్రహ్మలయుండీ ఎందుకండీ అలా అబద్ధాలు చెప్తారు? ఆ చచ్చిపోయిన మూర్ఖులందరూ మా కులం వాళ్ళు !"అన్నాడు. చివరికి తేలిందేమంటే , చనిపోయిన వాళ్ళు అమరులు కారు , మూర్ఖులు అని.అంటే బినౌలా లో రైలు ఆపించేందుకు ముఫ్పైమంది మూర్ఖులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.రైలు సౌకర్యం రావడం తో ఊళ్ళో పిల్లలు చదువుకునేందుకు దూర ప్రాంతాలకి వెళ్ళసాగారు.యువకులు ఢిల్లీ ,ముంబై , బంగళూర్ , హైదరాబాద్ లాటి పట్టణాలకి వెళ్తున్నారు.హాథీ పేట్ లోనూ జనకీ దహ్ లోనూ స్టేషన్లు వెలిశాయి. స్టేషిన్ లేని చోట్ల చైన్ పుల్లింగ్ తో రైలు ఆగే ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే రైలు ఇంటి ముందే ఆగుతుందన్నమాట. టిక్కెట్టు కొనేవాడు మూర్ఖుడు !
                                                                        బినౌలా లో విద్యావంతుల సంఖ్య పెరిగింది... అభివృద్ధి చెందింది.పాతకాలం నాటి సురాజీ కవిగారి పాటలో కులప్రసక్తి కూడా చోటు చేసుకుంది. ఆ పాటని ఒక్కో కులం వారూ ఒక్కో రకంగా పాడుకోసాగారు.కానీ అమరులు ప్రతి కులంలోనూ తమ పేర్లు ఉండాలని ఆత్రుత పడసాగారు.అంటే, రాంబృచ్ఛ బ్రాహ్మణ కులంలోనూ యాదవ కులంలోనూ,రాజపుత్రుల కులంలోనూ ఉంటాడు.అదే విధంగా గరీబ్ మియా , గరీబ్ ఖాన్ ,గరీబ్ యాదవ్ పేరు ఉంటుంది.ఆడవాళ్ళదీ  ఇదే ధోరణి.
                                                                        చరిత్ర ట్రైను లో ఇంత కుమ్ములాట ఉన్నప్పటికీ పాపం కొంతమంది నిర్భాగ్యులు ఎక్కలేక కిందే ఉండిపోతారు , ట్రైను వెళ్ళిపోతుంది.ఇలాటివాళ్ళు చెయ్యగలిగిందల్లా తిట్టుకోటమే.అందుకే ఈనాటికీ బినౌలా లో తిట్టుకుంటూ తుమ్ముకుంటూ  ఉండడం కనిపిస్తుంది.... " మా పూర్వీకులు మాత్రం రక్తం ధారపొయ్యలేదా? ఎంత అన్యాయం? ఎంత దుర్మార్గం?పురుగులు పడి చస్తారు , చూస్తూ ఉండండి! మేము మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంటామా? ఏదొ ఒకటి చేసి తీర్తాం!"

                                                                       చరిత్ర తాలూకు ఈ నిర్ణయం , చూద్దాం ఎప్పుడు రూపు దాల్చుతుందో !
                                                                                                                    
                                                 -----------------------------------------------------------------------------
                                                                                                                                                                                                                                                                 అనువాదం: ఆర్. శాంత సుందరి.                                                    
                                                                                    

                                                        

            

    
                                                                                                    


                  






No comments:

Post a Comment