Thursday, October 31, 2013



కాలిబాటైనా మేలే కదా!

Published at: 18-10-2013 07:10 AM
 New  0  0 
 
 

ఒక భాషలోని సాహిత్యాన్ని మరో భాషలోకి మార్చడం అంటే ఒక రకంగా ఏకకాలంలో రెండు జీవితాల్ని జీవించడమే. అందుకే ఒరిజినల్ రచనలు చేయడం కన్నా, అనువాద రచనలు చేయడమే కష్టం అంటూ ఉంటారు. అంతటి కష్టతరమైన ఆ ప్రక్రియలోకి ప్రవేశించి అనువాద సాహిత్య వారధిగా పేరు తెచ్చుకున్న వారు ఆర్. శాంతసుందరి. చలంగారి తమ్ముడి మనుమరాలిగా, కొడవటిగంటి కుటుంబరావు కూతురుగానే కాకుండా, 60కి పైగా వెలువరించిన అనువాద పుస్తకాల రచయిత్రిగా కూడా సాహిత్య లోకానికి ఆమె సుపరిచితం. ఇప్పటి వరకు, జాతీయ మానవ హక్కుల కమిషన్ అవార్డ్, భారతీయ అనువాద పరిషత్ పురస్కారాలతో పాటు, తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ అనువాదకురాలి బహుమతిని కూడా ఆమె అందుకున్నారు. శాంత సుందరి జీవన ప్రస్థానంలోని కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.
నేను అనువాదకురాలినవుతానని ఏనాడూ అనుకోలేదు. మద్రాసులో పుట్టి పెరిగిన నేను హిందీలో ఉన్నత విద్యను అభ్యసిస్తానని కూడా ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి నాకు బోటనీ అంటే అభిమానం. అయితే, పీయూసీ పరీక్షల ముందు నెలరోజులు జబ్బు పడటంతో కెమిస్ట్రీలో ఐదు మార్కులు తగ్గాయి. ఆ ఒక్క సబ్జెక్టు కోసం సప్లిమెంటరీ రాయాల్సి వచ్చింది. నాకు బాటనీ, జువాలజీలలో అత్యధిక మార్కులు వచ్చినా కెమిస్ట్రీ సప్లిమెంటరీలో పాసైన కారణంగా మద్రాసులో నాకెక్కడా బీఎస్‌సిలో సీటు రాలేదు. బాటనీతో డిగ్రీ చేయలేకపోతున్నానే అని దాదాపు మూడు మాసాలు ఏడుస్తూ ఉండిపోయా. మా నాన్నకేమో తన పరిచయాలు వాడుకోవడం ఇష్టం లేదు. ఆ పరిస్థితుల్లో బీఏలో హిందీ సాహిత్యం తీసుకున్నాను. అప్పటిదాకా హిందీలో నాకు తెలిసింది సినిమా పాటలే. అయినా హిందీ మీద ఇష్టం పెంచుకుని బాగా చదివాను. ఎంత బాగా అంటే బీఏలో ఉన్నప్పుడు యూజీసీ నిర్వహించిన హిందీ వ్యాస రచనల పోటీలో నాకు ప్రధమ బహుమతి వచ్చింది. ఆ సందర్భంగా నేను ఢిల్లీ వెళ్లినప్పుడు సుప్రసిద్ధ కవి హరివంశ్‌రాయ్ బచ్చన్ గారిని కలుసుకునే అవకాశం కలిగింది. ఆయనెంతో ఆప్యాయంగా నాతో ఎన్నో విషయాలు మాట్లాడారు. మద్రాసు తిరిగొచ్చాక ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ హిందీలో ఒక పెద్ద ఉత్తరం రాశాను. దానికి బచ్చన్ గారు వెంటనే ప్రత్యుత్తరం రాస్తూ 'మీ హిందీ భాషలో మంచి సౌందర్యం, చక్కని లయ ఉన్నాయి. మీరు హిందీలోంచి తెలుగులోకి, తెలుగులోంచి హిందీలోకి అనువాదాలు చేస్తే బావుంటుంది' అని రాశారు. అలా ఆయన నాలో నాటిన విత్తనం, నా లోని అవ్యక్త శక్తిని బహిర్గతం అయ్యేలా చేసింది. దశాబ్దాల పర్యంతం అనువాద ప్రక్రియలో ఉండిపోయేలా చేసింది. అనువాదాలు చెయ్యమంటూ నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఇచ్చిన తొలి ఆఫర్‌తో మొదలైన ఆ పరంపర 60కి పైగా అనువాద పుస్తకాలు వెలువరించడానికి మూలమయ్యింది. మన మార్గాలు అన్ని సార్లూ ముందే అనుకున్నవేమీ కాకపోవచ్చు. అయినా మనసు పెడితే, మధ్యలో మొదలైన ప్రయాణాలు కూడా తీరాన్ని చేరుస్తాయని నాకనిపిస్తుంది.
ఎదురీత ఎప్పుడూ తప్పదు
మనసులో ముందే విషం పెట్టుకున్న వారు, మనుషుల పట్ల ఎంత అమానుషంగా ఉంటారో నాకు చాలా సార్లు అనుభవంలోకి వచ్చింది. హిందీ టీచర్లు కావడానికి హిందీ మాతృభాషగా ఉన్న వాళ్లే కావాలంటే ఎలా? ఎం.ఏ. చెయ్యడానికి ఢిల్లీలోని మిరండా హౌస్‌కి వెళ్లినప్పుడు బీఏలో ఫస్ట్‌క్లాస్ మార్కులు వచ్చిన నాకు సీటు ఇవ్వక తప్పదని తెలిసి కూడా హిందీ విభాగం అధిపతి " నీకు హిందీ మాట్లాడటం వచ్చా?'' అంటూ అవహేళన చేస్తూ మాట్లాడింది. క్లాసులో ఎప్పుడు ఏ సందేహం అడిగినా వెంటనే తాను రాసిన పిహెచ్.డి థీసిస్ లైబ్రరీలో ఉంది, వెళ్లి చదువుకో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడేది. చివరికి.. కేవలం రెండు క్లాసుల అటెండెన్స్ తక్కువ ఉందన్న కారణం చూపుతూ ఫైనల్ పరీక్షల హాల్‌టికెట్ ఇవ్వకుండా ఆపేసింది. హాల్ టికెట్ రాబట్టుకోవడానికి దుర్గాబాయ్ దే శ్‌ముఖ్ సాయం తీసుకోవలసి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్న 40 ఏళ్ల కాలంలో మా హిందీ హెడ్‌లాంటి వారు ఇంకొంత మంది కూడా తటస్థపడ్డారు. అర్థం లేని కారణాలతో గుండెను గాయం చేస్తూ ఉండిపోయారు. వాటన్నిటినీ మొండిగా తట్టుకోవలసి వచ్చింది. మన పురోగతి అనేది కేవలం మనం ఎంచుకున్న లక్ష్యం కోసం శ్రమించడంతోనే అయిపోదు. ఆ మార్గంలో అకారణంగా అడ్డుపడే వారిని కూడా అధిగమించాల్సి ఉంటుందన్న నిజాన్ని నాకీ ఉదంతాలు నేర్పాయి.
ఆత్మను పట్టుకోలేదని...
నాన్నగారు రాసిన' చదువు' అనే పుస్తకం ఆంగ్ల అనువాదం అప్పటికే వచ్చేసింది. హిందీలోకి అనువదిస్తానని సాహిత్య అకాడమీ వారిని నేనే అడిగాను. వారు అప్పటిదాకా నేను చేసిన అనువాదాలన్నీ పరిశీలించి, ఆ పుస్తకాన్ని అనువదించడానికి అంగీకరించారు. 'పడాయి' అన్నపేరుతో అనువదించాను. ఒక ప్రముఖ హిందీ రచయితకు ఆ స్క్రిప్టు చూపించి ఆయన సూచించిన మార్పులన్నీ చేసి సాహిత్య అకాడమీ వారికి అందజేశాను. ప్రతి భాషకు సంబంధించి ఎక్స్‌పర్ట్ ఒకరు ఆ స్క్రిప్టును పరిశీలిస్తారు. ఏవైనా కొద్దిపాటి సవరణలు ఉంటే వాటిని సూచించి ప్రచురణకు ఆమోదం తెలుపుతారు. నా పుస్తకాన్ని చూసిన ఎక్స్‌పర్ట్ మాత్రం ప్రతి వాక్యం కిందా ఒక స్కూలు టీచర్‌లా అండర్‌లైన్ చేసి, నేను రాసినవి సరైనవే అయినా వాటికి తప్పుడు సవరణలు చేసి, ఈ అనువాదకురాలు రచయిత ఆత్మను పట్టుకోలేదు. అందువల్ల ఈ పుస్తకం యధాతథంగా ప్రచురణకు పనికి రాదంటూ రాశారు. ఆ ఎక్స్‌పర్ట్‌కి తనది తప్ప ఎవరి అనువాదమూ నచ్చదని ఆ తర్వాత తెలిసింది నాకు. తెలుగు వాళ్లలో మంచి అనువాదకులే లేరని ఆయన తన వ్యాసాల్లో ఎన్నోసార్లు రాసిన విషయం బయటపడింది. ఆయన కారణంగా 2007లో ఇచ్చిన స్క్రిప్టును దాదాపు ఆరేళ్ల దాకా నానుస్తూనే ఉండిపోయారు. చివరికి 2012లో అది పుస్తకంగా వ చ్చింది. వాస్తవానికి నాన్నగారి శతజయంతి సందర్భంగా పుస్తకాన్ని విడుదల చేయాలని ఎంతగానో అనుకున్నాం. కానీ, ఆ తేదీ అయిపోయాకే పుస్తకం వచ్చింది. ఏమైనా ఆ రోజునుంచి ప్రభుత్వ సంస్థలకు అనువాదం చెయ్యటం మానేశాను. అంతే కాదు. అప్పట్నించి ఏ పబ్లిషరైనా నా అనువాదాన్ని మరొకరికి చూపించాక ప్రచురిస్తానంటే నేను అస్సలు అనుమతించను. ఇది ఆత్మగౌరవానికి సంబంధించినదే తప్ప నా అహంభావం కాదు. ఎవరైనా తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోలేకపోతే వాళ్లు తమ జీవితంలో కూడా నిలబడలేరని నేను బలంగా నమ్ముతాను.
అది ఎంత పతనం!
ఒక మిత్రుని ఒత్తిడి కారణంగా పవర్ రంగంలో అత్యున్నత స్థానంలో పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి ఇంగ్లీషులో రాసిన పుస్తకాన్ని హిందీలోకి అనువదించాల్సి వచ్చింది. ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన అనేక సాంకేతిక పదాలు అందులో ఉన్నాయి. కథనో, సాధారణ వ్యాసాన్నో వేరే భాషలోకి మార్చడమంత సులువైన పనికాదు ఒక సాంకేతిక పుస్తకాన్ని అనువదించడం! అయినా ఎంతో కష్టపడి పూర్తిచేసిన ఆ పుస్తకం మీద అనువాదకురాలిగా నా పేరు వేయలేదు. ఆయనకు అసలు హిందీ భాషే రాదు. అయినా పుస్తకం మీద తన పేరే వేయించుకుని, ముందుమాటలో మాత్రం ఒకే ఒక్య వాక్యంలో నా సహాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే మ్యాక్మిలన్ ప్రచురణ సంస్థ కూడా నేను శివ్‌ఖేరా గారి ఇంగ్లీషు పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే మొదట్లో అనువాదకురాలిగా నా పేరు చూపించి, ఆరో ముద్రణలో నా పేరు వేయలేదు. అనువాదకులకు కాపీరైట్ ఒక ఇంటెలెక్చువల్ రైట్ లాంటిదని రాశాను. ఆ తరువాతి ముద్రణలో తమ తప్పు దిద్దుకున్నారు. తమ తప్పును ఎదుటి వారు ఎత్తిచూపే దాకా సరిదిద్దుకోకపోవడం అంటే అది ఎంత పతనమైపోవడమో గుర్తించరెందుకని? ఇది నాలో పలుమార్లు రగులుతూ ఉండిపోయే ప్రశ్న. దీనికి ఎప్పటికి సమాధానం దొరుకుతుందో చూడాలి మరి! ఎన్ని గాయాలైనా ఈ అనువాద ప్రక్రియలో ఎంతో ఆనందం ఉంది. ఎన్నో లోతైన అనుభూతులు ఉన్నాయి. ఎన్. గోపి గారు అన్నట్లు రక్తసంబంధాల కన్నా అక్షర సంబంధాలే మరింత గ ట్టివని నేను మనస్పూర్తిగా అనుకుంటాను.
రెండు భాషల సంవాదం
తెలుగు గ్రంథాల పట్ల ఉత్తరాది వారికి చిన్న చూపు ఉంది. హిందీ రచనలు తెలుగులోకి వస్తాయే గానీ, మన రచనలు హిందీలోకి అంతగా వె ళ్లవు. ఇందులో ఉత్తరాది వారి బాధ్యతారాహిత్యమే కాదు. తెలుగు భాషకు సంబంధించిన కమిటీ సభ్యులు పట్టించుకోకపోవడం కూడా కారణమే. ఎందుకో గానీ అనువాదాల పైనా, అనువాదకుల పైనా జనానికి చిన్నచూపు ఉంది. నిజానికి అనువాదం ఒక కళ. అది ఎంతో బాధ్యతాయుతమైనది. భారమైనది కూడా. అనువాదం చేస్తున్న సమయంలో గుండెలో రెండు భాషల సంవాదం సాగుతున్నట్లుగా ఉంటుంది. అనువాద రచనలు పాఠకుల దృక్పథాన్నే కాదు, రచయితల దృక్పథాన్ని కూడా విశాలం చేస్తాయి. అలాంటి ప్రక్రియను కొందరు తక్కువ చేసి మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మా నాన్నలా సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించే శక్తి నాకు లేకపోవచ్చు. కానీ, ఒక అనువాదకురాలిగా ఉత్తమ సాహిత్యాన్ని అనువదించడానికే నేను ప్రయత్నిస్తాను. అందరూ రాజమార్గం కాలేకపోవచ్చు కానీ, కాలిబాట కావడం కూడా విశేషమే కదా!
గడ్డకట్టిన విషాదం
వాకపల్లిలో గిరిజన మహిళల మీద గ్రేహౌండ్స్ వారు జరిపిన అత్యాచార ఉదంతం తర్వాత... నేను, మరికొందరం అక్కడికి వెళ్లాం. నక్సల్స్‌కు వాళ్లు ఆశ్రయమిస్తున్నారన్న కారణం కావచ్చు. బాక్సైట్ కోసం గిరిజనులను ఆ ప్రదేశం నుంచి తరిమేసే ఉద్దేశమే కావచ్చు. గ్రేహౌండ్స్ వాళ్లు ఆ మహిళల్ని బలి తీసుకున్నారు. ఏదైనా విషాదానికి గురైన వారు ఏడ్చేస్తున్నప్పటి కన్నా, ఆ ఏడ్చే స్థితి కూడా కోల్పోయి.. రాయిలా మారిపోవడమే మన గుండెల్ని ఎక్కువగా పిండేస్తుంది. వాకపల్లిలో నేను అలాంటి పరిస్థితినే చూశాను. వాళ్లను చూస్తుంటే విషాదంతో గడ్డకట్టుకుపోయారేమో అనిపించింది. అంతులేని ధైన్యమే తప్ప వాళ్ల కళ్లలో నీళ్లు లేవు. అది చూసిన నేను ఆ రోజంతా ఏడుస్తూ ఉండిపోయాను. వాళ్ల ప్రమేయం లేకుండా జరిగిపోయిన దారుణానికి వాళ్ల భర్తలు వాళ్లను ఇంట్లోంచి గెంటేశారు. వాళ్ల సమాజం వాళ్లను వెలేసింది. స్వతంత్రంగా ఇల్లు క ట్టుకునే శక్తి లేక ఏ చెట్లకిందో, కూలిన గోడల కిందో కూర్చుని గడపాల్సిన స్థితి. వాళ్లందరికీ అటుఇటుగా 20 ఏళ్లు ఉంటాయేమో. వాళ్ల మిగతా జీవితమంతా ఎలా గడవాలి? ఎంతో మంది అధికారులు వచ్చారు, వెళ్లారు. కానీ, ఎవరూ ఏమీ చేసింది లేదు. ఆ మాటే చెబుతూ, అందులో ఒక గిరిజన మహిళ వాళ్ల భాషలో 'భూమి ఏడుస్తుంటే, ఆకాశమేమీ జవాబు చెప్పడం లేదు' అనే అర్థంలో ఒక మాట అంది. ఆ మాట విని నేను చాలాసేపటి దాకా అలా చూస్తూ ఉండిపోయాను. అవి కవిత్వంలా ఉన్నాయా? మరోలా ఉన్నాయా? అన్నది కాదు. ఆ మాటలు వాళ్ల గుండెల్లోని సముద్రమంత దుఃఖానికి అద్దం పడుతున్నట్లు అనిపించింది. మన కళ్లముందు కంటతడి పెట్టుకుంటున్న వాళ్లను చూసి ఏదో ఒక రీతిన స్పందించ గలుగుతాం. కానీ, దుఃఖంతో గడ్డకుట్టుకుపోయిన వాళ్లను చూసి ఎంతమంది స్పందిస్తారు? కానీ, కన్నీటి విషాదాలతో సరిసమానంగా క న్నీళ్లు రాని విషాదాల్ని కూడా గుర్తించగలిగే స్థితికి ప్రతి మనిషీ రావాలేమో అనిపించింది.
ం బమ్మెర
ఫోటోలు: మునవ్వర్

 


మర్చిపోకుండా
పూర్వం వయోవృద్ధులు మాత్రమే మతిమరపుతో ఇబ్బంది పడేవారు. కాని ఇప్పుడు పిల్లలు, పెద్దలు అందరూ '...
ఆర్థికమంతా అతివల చేతుల్లోనే
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించడంతో - మన...