Monday, November 19, 2012




తెగని బంధాలు
-------------


శకుంతలకి జనవరిలో పెళ్ళయింది. నేను పగలంతా మా నాన్న పెట్టిన సైకిల్ షాపులో పని చేస్తూ గడిపేస్తాను. కానీ పొద్దుపోయాక నా మనసు ఎటో వెళ్ళిపోతుంది. పని మీద ధ్యాస పెట్టలేకపోతాను. అందుకే ఏదో ఒక సాకుతో బైటికెళ్ళిపోతాను. జనవరి నెలలో సాయంకాలమవగానే చలి ప్రారంభమవుతుంది. తన వాడి గోళ్ళతో ఒళ్ళంతా రక్కటం మొదలు పెడుతుంది. నేను ఒకప్పుడు శకుంతలతో కలిసి తిరిగిన ప్రదేశాలన్నీ ఒకసారి చుట్టబెట్టి, ఆమె జ్ఞాపకాలలో తడిసి ఇంటికి చేరతాను.
ఎంత చలిగా ఉన్నా ఓవర్ కోట్, మఫ్లర్, మేజోళ్ళు, షూలు లాంటివి తొడుక్కోను. మామూలుగా ప్యాంటూ, షర్టూ, స్వెటర్, చెప్పులూ వేసుకుంటాను. చలి నన్ను బాధ పెడుతుంది. వేళ్ళ కొసల్నించి ఒళ్ళంతా పాకుతుంది. ప్రేమని పోగొట్టుకున్నందువల్ల కలిగే బాధలో అది కూడా ఒక భాగమేననీ, దాన్ని భరించక తప్పదనీ అనిపిస్తుంది నాకు.
కానీ అది ప్రేమ లేకపోవటం కాదనీ, శకుంతల నాకు దక్కక పోవటమనీ నాకు తెలిసేందుకు ఏడాది కాలం పట్టింది. నా ప్రేమని నేను పోగొట్టుకోలేదు. నా మనసులోనూ శకుంతల మనసులోనూ ఇంకా ఒకరి మీద ఒకరికి ప్రేమ అలాగే ఉందని నా నమ్మకం. ఒక సారి పుట్టింటికి వచ్చినప్పుడు నన్ను కలుసుకుంది. అప్పుడు భోరున ఏడుస్తూ ఇంకా తను నన్ను...నన్ను...నన్నే,. ప్రేమిస్తున్నానని చెప్పింది! కానీ కొంత సేపటికి ఏడుపు ఆపి, కళ్ళు తుడుచుకుని, "అయినా ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? నేనింక పరాయి దాన్నే కదా నీకు?" అంది.
ఆమె మొదట అన్న మాటలతో వేడెక్కిన నా తల హఠాత్తుగా మంచుకొండకి గుద్దుకున్నట్టనిపించింది. శకుంతల చివరగా అన్న మాటల అంతరార్థం ఏమై ఉంటుంది? నా మీద అభియోగం వేసిందా? లేక ఆ మాటల్లో గూడార్థమేమైనా ఉందా? నాకోసం ఏదైనా రహస్య సందేశం ఉందా?

అలా అనుకోగానే నా ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది. కొంతసేపటికి శకుంతల నా ముందు ఒక సవాలు విసిరిందన్న నమ్మకం కలిగింది. ఆమె ఇంకా నన్నే కోరుకుంటోంది. మధ్యలో ఆగిపోయిన మా ప్రేమాయణాన్ని మళ్ళీ మొదలు పెడదామని చూచాయగా చెప్పకనే చెప్పింది. అంతే! ఒక తియ్యటి వెచ్చదనం నన్ను పూర్తిగా కమ్మేసింది. ఆ రోజు కూడా చలికాలపు సాయంకాలమే ఇద్దరం కలుసుకున్నాం. సాయంకాలపు పొగమంచులో కలిసిపోయి వెలుతురు కొత్త రంగులి సంతరించుకుంది. మరిచిపోలేని సుగంధమేదో పరుచుకుంది. అంత చలిలో కూడా వెచ్చగా అనిపించింది. ఆమె బుగ్గల మీదికి కారిన కన్నీటిని ఆప్యాయంగా నా వేళ్ళతో తుడిచాను.
లోకం ఏమనుకున్నా సరే, ఇద్దరం కలుస్తూ ఉండాలనీ, ఇంకా మాట్లాడితే కలిసే జీవించాలనీ నిర్ణయించుకున్నాం. ఎటువంటి అడ్డంకులనీ లెక్క చెయ్యకూడదని అనుకున్నాం.
"ధీరజ్ నన్ను మోసం చేశాడు, రాకేష్! పెళ్ళప్పుడే అతని ఆరోగ్యం సరిగ్గాలేదన్న సంగతి వాళ్ళు దాచిపెట్టారు. పెళ్ళి అయిన తరవాత కూడా తనకి ఉన్న వ్యాధికి చికిత్స లేదనీ, తను ఎక్కువకాలం బతకననీ ధీరజ్ నాకు చెప్పలేదు. తన వ్యాధి ఏమిటో డాక్టర్లకే ఇంకా అంతుపట్టలేదనీ, కానీ నయం అవుతుందని మాత్రం హామీ ఇస్తున్నారనీ అన్నాడు. శోభనం రాత్రి కూడా అతను నాతో పడుకోలేదు, ఆస్పత్రి కెళ్ళి అక్కడే పడుకున్నాడు. ఈ నాటి వరకూ దాంపత్య సుఖం అంటే ఏమిటో నేనెరగను. ఒక్కోసారి ఎప్పుడైనా ఆస్పత్రినించి ఇంటికి వచ్చినా, అతను విడిగా ఇంకో గదిలో పడుకుంటాడు. ఒకసారి అతను మామూలుకన్నా కాస్త తెరిపిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటం చూసి, నేనే చొరవచేసి శోభనం గురించి ఎత్తాను. నేనలా అనగానే అతను విపరీతంగా కంగారు పడ్డాడు. "నన్ను క్షమించు శకుంతలా! నిన్ను మోసం చేశాను, నీకు ద్రోహం చేశాను! నేను శోభనానికి పనికి రాను!" అన్నాడు. ఇన్నాళ్ళుగా అతనికి ఆరోగ్యం బాగాలేదని ఎంతో ఓర్పుతో నెలల తరబడి ఎదురుచూస్తున్న నాకు ఈ మాట వినగానే పట్టరాని కోపం, దు:ఖం వచ్చాయి. "అలా అయితే నన్నెందుకు పెళ్ళి చేసుకున్నట్టు? నన్నూ, నా తలిదండ్రులనీ, ఈ సమాజాన్నీ, చివరికి నిన్ను నువ్వే మోసంగించుకున్నావు! ఎందుకలా చేశావు?" అని అరిచాను. కానీ అతను జవాబేం చెబుతాడు? నా కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అతన్ని ఒక్క తన్ను తన్ని, నేరుగా నీ దగ్గరకి పరిగెత్తుకు రావాలని ఆ క్షణంలో నా కనిపించింది.." అని చెప్పటం ఆపింది శకుంతల.

శకుంతల చెప్పినది విని నేను మ్రాన్పడిపోయాను. ఆ రోజు సాయంకాలం దట్టమైన మంచు కురుస్తుంటే పార్కులో చల్లటి రాతి బెంచీమీద కూర్చుని ఇద్దరం చలికి గజ గజ వణికిపోతున్నాం. ఆయినా నా రక్త ఉడికిపోయింది. "శకుంతలా, నీకు తీరని అన్యాయం జరిగింది. నిజం చెప్పాలంటే నాకు కూడా! కానీ ఇప్పుడు మనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఒకటే మార్గం: మనం ఎదురు తిరగాలి. రక్త మాంసాలున్న మనుషులమని లోకానికి చాటాలి. సమాజం ఆడించినట్టల్లా ఆడే తోలుబొమ్మలం కామని ఇప్పటికైనా చెప్పాలి. నువ్వు సాహసం చెయ్యాలి. ఆ నపుంసకుణ్ణి వదిలేసి నా దగ్గరకి వచ్చెయ్యాలి. ఆ పని చేస్తావా? చెయ్యగలవా?"
శకుంతల అనురాగం నిండిన కళ్ళతో నా కేసి చూస్తూ "అది సాధ్యమేనంటానా, రాకేష్? నువ్వు నన్ను స్వీకరిస్తావు, కానీ ఈ సమాజం...లోకం..?
"సర్లే, ఈ సమాజం మనకేమిచ్చింది? మన ప్రేమకి అడ్డుపడే హక్కు దానికి లేదు. నీకు అన్యాయం జరిగితే నోరు విప్పని లోకం గురించి మనమెందుకు పట్టించుకోవాలి?" ఆ మాటలంటున్నప్పుడు నా గొంతు పెద్దగా అరిచినట్టు ధ్వనించింది.
కానీ నా భావావేశాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా శకుంతల నెమ్మదిగా ఇలా అంది, "సమాజం గోడమీది పిల్లిలాంటిదని నాకు తెలుసు, అబధ్ధాలు చెపుతుందనీ తెలుసు. కానీ అది మనిద్దరికన్న బలమైనది. ఒక నపుంసకుడికి భార్యగా ఉంటూ, పరాయి మగాళ్ళకి పిల్లల్ని కనే ఆడదాన్ని పతివ్రత అంటుంది, గౌరవిస్తుంది. కానీ అలాటి భర్తని విడిచిపెట్టి చిత్తశుధ్ధితో మనసారా ప్రేమించినవాడి దగ్గరకెళ్తే మాత్రం శీలం చెడిందని ముద్ర వేస్తుంది. నీ తలిదండ్రులూ, బంధువులూ నేను నీ భార్యనని ఒప్పుకుంటారా?"
నేనింకా గొంతుపెంచి, "ఒప్పుకోరని నాకు తెలుసు. కానీ వాళ్ళకి భయపడి మనం జీవితాంతం జీవఛ్చవాల్లా బతుకుదామంటావా? లేదు, నాకలా బతకాలని లేదు. నిన్ను కూడా అలా బతకనివ్వను. నీ పెళ్ళయినప్పట్నించీ ఈ ఊళ్ళో ఉండటం నాకు నరకయాతన కన్నా భయంకరంగా అనిపిస్తోంది. ఇక్కణ్ణించి పారిపోవాలని ఉంది. ఇక్కడ ఏముందని? నాన్న ఉన్నన్నాళ్ళూ ఆ సైకిల్ షాపులో పని చెయ్యటం, ఆ తరవాత ఆ షాపు యజమానినై ఇక్కడే పాతుకుపోవటం, అంతేగా? నేను బి.ఎస్సి. చదివింది సైకిల్ షాపు నడిపేందుకా? నువ్వు ఒక పనికిమాలిని వాడికి భార్యగా బతకటానికేనా ఇంగ్లీషు బి.ఏ.ఆనర్స్ చేశావు? నువ్వు లేని ఈ ఊళ్ళో ఉండలేక అప్పట్నించీ వేరే ఊళ్ళో ఉద్యోగ ప్రయత్నాలను చేస్తునే ఉన్నాను. మొన్ననే ఉత్తరం వచ్చింది, లక్నోలో ఒక ప్రభుత్వోద్యోగం దొరికింది. వెళ్ళనా వద్దా అని ఎటూ తేల్చుకోలేకుండా ఉండగా ఇలా నువ్వు రావటం, నీకు జరిగిన అన్యాయం గురించి నాకు చెప్పటం అంతా మన అదృష్టం కొద్దీ జరిగిందనే అనుకోవాలి. నువ్వు సరేనంటే రేపే లక్నో వెళ్ళి ఉద్యోగంలో చేరిపోతాను. నువ్వు తరవాత నా దగ్గరకి వచ్చెయ్యి," అన్నాను.
ఆ రోజు నిర్ణయించుకున్నట్టే మేమిద్దరం లక్నో చేరుకుని కలిసి జీవించటం మొదలుపెట్టాం. మా ఆనందానికి అవధుల్లేవు. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. కానీ కొన్నాళ్ళయాక శకుంతల అప్పుడప్పుడూ దిగులుగా ఉండటం గమనించాను. ఒకరోజు ఉండబట్టలేక అడిగేశాను, "ఏమిటివాళ అంత దిగులుగా ఉన్నావు?"
"దిగులా? నాకా? లేదే!" అని నవ్వేసింది.
"నా దగ్గరకి వచ్చి తప్పు చేశానని అనుకోవటం లేదు కదా?"
"అలాంటిదేం లేదు, కానీ ధీరజ్ గుర్తొస్తూ ఉంటాడు. అతనెలాటివాడైనా, అబధ్ధాలు చెప్పి నాకు అన్యాయం చేసినా, పాపం అతను జబ్బు మనిషి, అతనికి ఉన్నది చాలా సీరియస్ రోగం."
"అతను నిజంగానే జబ్బు మనిషా? నీ మాటలవల్ల ఆ జబ్బు తనలోని లోటుని కప్పి పుచ్చుకునేందుకు ఆడుతున్న నాటకమేమో అనిపించింది నాకు."
"లేదు. అతను నిజంగానే జబ్బు మనిషి."
"అయితే ఇప్పుడేమంటావు?"
"ఏం లేదు. ఎటూ తోచటం లేదు. త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తోంది. అతన్ని వదిలి వచ్చేశాను. కానీ అతను బలహీనుడు. మెత్తని స్వభావం. ఇది పధ్ధతి కాదనో, చట్టరీత్యా నా భార్యవి, అలా ఎలా నన్నొదిలి వెళ్ళిపోతావ్ అనో రెట్టించి లాక్కెళ్ళే ధైర్యం అతనికి లేదు. అయినా...సర్లే, ఇప్పుడవనీ ఎందుకు? ఆలోచించి మాత్రం చేసేదేముంది?" అంది శకుంతల నిట్టూరుస్తూ.
"అలా కాదు. మించిపోయిందేమీ లేదు. బాగా ఆలోచించుకో. అతని దగ్గరకే వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు."
శకుంతల ఇష్టంలేనట్టు మొహం పెట్టి నా కేసి చూసింది."మళ్ళీ నన్నా నరకంలోకి వెళ్ళమంటావా?" అన్నట్టుగా ఉంది ఆ చూపు.
కానీ నేనేమీ మట్లాడలేదు. నా మనసులో ఎన్నో ప్రశ్నలు రొద చెయ్యటం మొదలుపెట్టాయి. ఇంత వరకూ మా ఇద్దరి మధ్యా ఉన్నది అద్భుతమైన ప్రేమ అనే భ్రమలోనే జీవిస్తూ వచ్చానా? అది నిజంగా అంత గొప్ప ప్రేమ కాదా? ఇది కూడా ఒక రకమైన వ్యభిచారం గాని కాదు కదా? ఇద్దరం నిజంగా మళ్ళీ కలుసుకున్నామా, లేక విడివిడిగా ఎవరి ప్రపంచంలో వాళ్ళం బతుకుతున్నామా?
అలా ఆలోచిస్తుంటే మేం పురుగుల కన్నా హీనమైన వాళ్ళమని అనిపించసాగింది. ఏక కణ జీవులం! ఎక్కడో చదివాను ఒక రకమైన ఏకకణజీవి ఉంటుందిట. అది నీళ్ళల్లో ఉంటూ తనంట తనే పేలి చనిపోతుందట. నాకొక అనుమానం వచ్చింది, అది అలా పేలిపోతే నీళ్ళల్లో అసలు ఒక్క బుడగైనా లేస్తుందా?  అలలు ఏర్పడతాయా? ఆంత సూక్ష్మ ప్రాణి చనిపోతే ఏర్పడే బుడగ ఇంకెంత సూక్ష్మంగా ఉంటుందో కదా? బహుశా అసలు బుడగే ఏర్పడదేమో! మరి ఇంత పెద్ద ప్రపంచంలో ఒక శకుంతల, ఒక రాకేష్, ఒక ధీరజ్ ఆ సూక్ష్మప్రాణికన్నా గొప్పవాళ్ళేమీ కాదుగా? మేం కలిసుంటే ఏమిటి, విడిపోతే ఏమిటి? బతికుంటే ఏం చస్తే ఏం..ఎవరు పట్టించుకుంటారు? అయినా ఎందుకిలా నైతిక విలువలు అంటూ పాకులాడాలి?
శకుంతలతో కలిసి జీవించటం మొదలుపెట్టాక ఈ సమాజంలోని నియమాలనీ, నిబంధనలన్నిట్నీ భస్మీపటలం చెయ్యగలిగానని గర్వించాను. నేను చేసిన పని వల్ల బూజు పట్టిన సంప్రదాయాల పొగమంచు తొలగిపోతుందనీ, నిర్జీవమైన సంబంధాలలోని గడ్డకట్టిన భావాలు కరిగి, వాటిలో కొత్త జీవం తొణికిసలాడుతుందనీ, అంతటా ప్రేమ తాలూకు వెచ్చటి వెల్తురు నిండుతుందనీ ఆశించాను. కానీ ఆ రోజు శకుంతల దిగులుకి అసలు కారణం తెలుసుకున్నాక నిజంగా ఏ బూజుపట్టిన సంప్రదాయాలూ, నియమాలూ, నిబంధనలూ భస్మీపటలం కాలేదని తెలియవచ్చింది. కాసేపు నిప్పురాజుకుని, కాస్త పొగ వచ్చింది, అంతే!
ఆ రోజు మొదలు శకుంతలలో నిజాయితీ లోపించిందన్న భావన నన్ను ఏడిపించసాగింది. శరీరం మాత్రమే నాకప్పగించి, మనసుని ధీరజ్ దగ్గరే వదిలి వచ్చిందన్న నమ్మకం బలపడింది.
ఒక సారి ఆఫీసుపని మీద నాలుగు రోజులు బైటికెళ్ళాను. పనులు పూర్తయాక సాయంత్రం ఇంటికొచ్చాను. మా గది గుమ్మానికి కర్టెను వేలాడుతూ దర్శనమిచ్చింది.అది చూసి నిర్ఘాంతపోయాను. కానీ లోపల శకుంతల ఒక్కతే లేదనీ, ఆమెతో మరెవరో ఉన్నారనీ గ్రహించాను. నాకు ఒళ్ళు మండిపోయింది, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు కొరకసాగాను. శకుంతల నాకింత ద్రోహం చేస్తుందా? ఎన్నాళ్ళుగా సాగుతోంది ఈ వ్యవహారం? ఈ రోజు బండారం బైట పడింది! నేను విసురుగా కర్టెన్ తొలగించాను.
బండారం బైట పడిందా? అక్కడ నాకు కనిపించిన దృశ్యం... శకుంతల గొంతుక్కూర్చుని నేలమీద పరుచుకున్న రక్తాన్ని శుభ్రం చేస్తోంది. ధీరజ్ నా మంచం మీద స్పృహలేనట్టు పడి ఉన్నాడు. అతను రక్తం వాంతి చేసుకున్నట్టున్నాడు. అతని మొహం తెల్లగా పాలిపోయి ఉంది. నేల తుడుస్తున్న శకుంతల గుమ్మం దగ్గర చప్పుడు విని తలెత్తి చూసింది. నన్ను చూడగానే చాలా కంగారు పడింది. నట్టుతూ, "నువ్వేనా! ... ఈయన ఆరోగ్యం విషమించిందని కబురొస్తే... ఇవాళే వెళ్ళి వెంట పెట్టుకొచ్చాను. సరిగ్గా సమయానికి వచ్చావు...ఎవరైనా డాక్టర్ ఉంటే వెంటనే పిల్చుకురావా, ప్లీజ్?" అంది దీనంగా.
నేను వెంటనే వెనుదిరిగి డాక్టర్ కోసం పరిగెత్తాను. మరుక్షణం పేలిపోతానేమో ననిపించింది..నేను పేలిపోవటానికి నిదర్శనంగా ఎక్కడా ఒక బుడగ కూడా కనిపించదేమో!

("స్టెంటర్" పీరుతో ౧౯౬౩ లో ప్రచురితమైన ఈ హిందీ కథ ౨౦౦౯ లో ’ఏక్ ఘర్ కి డైరీ’ పేరుతో కథాసంపుటిగా వెలువడింది. రచయిత అనుమతి తో ఈ కథ తెలుగులోకి అనువదింపబడింది.)
__________________________

మూల హిందీ రచయిత:
ప్రొఫెసర్ రమేష్ ఉపాధ్యాయ్

అనువాదం :
ఆర్.శాంతసుందరి,