Tuesday, May 3, 2011


ఆడవాళ్ళు
*****************
కొందరు స్వేచ్ఛగా ఎందులోనైనా దూకి ఆత్మహత్య చేసుకున్నారు
అలా అని పోలీసు రికార్డుల్లో నమోదయి ఉంది
ఇంక కొంతమంది ఆడవాళ్ళు స్వయంగా చితిమంటల్లో పడి ఆత్మాహుతి చేసుకున్నారు.
అలా అని మతగ్రంథాల్లో రాసి ఉంది

నేను కవిని, కర్తని
తొందరేముంది
ఏదో ఒక రోజు పోలీసులనీ పురోహితులనీ కట్టకట్టుకుని రమ్మని
స్త్రీల న్యాయస్థానానికి పిలిపిస్తాను
మిగతా న్యాయస్థానాలన్నిటినీ రద్దు చేసేస్తాను
స్త్రీలకీ పిల్లలకీ వ్యతిరేకంగా మగమహారాజులు వేసిన
కేసులన్నిటినీ కూడా రద్దు చేస్తాను
సైనికులూ విద్యార్థులూ తెచ్చిన డిక్రీలని కూడా
పనికిరావని చెపుతాను
దుర్బలులు కండబలం ఉన్నవాళ్ళ పేర రాసిన విల్లులని కూడా నేను బహిష్కరిస్తాను.
స్వేచ్ఛగా బావుల్లో దూకిన స్త్రీలనీ చితిమీద కాలి చనిపోయిన స్త్రీలనీ
నేను మళ్ళీ బతికిస్తాను
ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగి ఉంటే
చెప్పని విషయాలేమైనా ఉంటే
వాళ్ళు న్యాయాస్థానాల్లో ఏనాడో చెప్పిన మాటలని
మళ్ళీ కొత్తగా రాస్తాను.

ఎందుకంటే నాకు ఒక స్త్రీ తెలుసు
ఏడు జానల తన శరీరాన్ని జానెడు ఇంట్లో
జీవితాంతం కుదించుకుని బతికింది బైటికి తొంగి కూడా చూడలేదు
శవం గా మారిన తరవాతే ఇంట్లోంచి ఆమె బైటికొచ్చింది.
బైటికి వస్తూనే భూమి తల్లి లా పరుచుకుంది
స్త్రీ శవం భూమాతలాగ ఉంటుంది
బైటికి రాగానే విస్తరిస్తుంది పోలీసు స్టేషన్లనుంచి న్యాయస్థానాల దాకా
అపరాధం జరిగిన రుజువులన్నిటినీ తుడిచెయ్యడం చూస్తున్నాను
చందన తిలకం దిద్దుకుని తలలెగరేసుకు తిరుగుతున్న పురోహితులూ
పతకాలతో ఛాతీలని అలంకరించుకుని విర్రవీగుతున్న సిపాయిలూ
మహారాజుకి జై అని నినాదాలు పలుకుతున్నారు.

వాళ్ళందరూ చనిపోయిన మహారాజులు
చితులు పేర్చుకుని సతీసహగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ మహారాణులు
ఇక మహారాణులే లేకపోతే పరిచారికలేం చేస్తారు?
అందుకే వాళ్ళు కూడా సిద్ధమౌతున్నారు చనిపోయేందుకు
నాకు మహారాణులకన్నా వాళ్ళని చూస్తేనే జాలి
వాళ్ళ భర్తలు బతికే ఉన్నారు...ఏడుస్తున్నారు
ఒక స్త్రీ బతికున్న తన భర్త ఏడుస్తూంటే చనిపోవడం ఎంత ఘోరం?
కానీ భర్తలకి ఏడ్చే స్త్రీని కొట్తడం తప్పుగా తోచదు ఎందుకో
ఆడవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు,మొగాళ్ళు కొడుతూనే ఉంటారు
ఆడది గట్టిగా ఏడిస్తే మగాడు మరింత గట్టిగా కొడతాడు
దాంతో ఆమె ఒక్కోసారి చనిపోతుంది

చరిత్రలో మొట్ట మొదటిసారి మంటల్లో పడేసి చంపబడిన మొదటి  స్త్రీ ఎవరైఉంటుంది?
నాకు తెలీదు
కానీ ఆమె ఎవరైనా సరే మా అమ్మే అయిఉంటుంది,
ఇప్పుడు నా విచారం
భవిష్యత్తు లో అలాటి నేరానికి గురై మరణించే స్త్రీ ఎవరవుతారనేదే
ఆ ఆఖరి స్త్రీ ఎవరవుతుంది?
నాకు తెలీదు
కానీ ఆమె ఎవరైనప్పటికీ నా కూతురే అవుతుంది...
అయినా
నేనలా జరగనివ్వను కదా!
*****************************************
మూలం : హిందీ కవిత... రమాశంకర్ యాదవ్ విద్రోహీ
అనువాదం : ఆర్.శాంత సుందరి





No comments:

Post a Comment