Friday, May 27, 2011


అగ్గిపుల్లలతో...
---------

 అంగవైకల్యం ఉన్నవాళ్ళు సామాన్యంగా తాము శాపగ్రస్తులమని కుమిలిపోతూ, బతుకు వెళ్ళదీస్తూ ఉంటారు.అది వాళ్ళలో  ఆత్మవిశ్వాసం లేకుండా చేసి అసహాయుల్ని చేస్తుంది.ఈ స్థితికి వాళ్ళెంత బాధ్యులో మన సమాజానికి కూడా అంతే బాధ్యత ఉంది. అందరూ వికలాంగులని రకరకాల మాటలతో హింసిస్తూ ఉంటారు.
కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏటికి ఎదురీదే స్వభావం కొందరిలో కనిపిస్తుంది.ఎంత పెద్ద అడ్డంకులొచ్చినా దాటుకుని వెళ్ళే సాహసం,ధైర్యం వీళ్ళు చూపిస్తారు.చదువుకుని ఎవరిమీదా ఆధారపడకుండా బతకటమే కాదు, తమ జీవితంలోని ఒంటరితనాన్ని కళలతో నింపి, అద్భుతాలు సాధించారు.
అటువంటి వ్యక్తేప్రదీప్ కుమార్.పంజాబ్ నేషనల్ బ్యాంకు,లఖానా శాఖలో క్లర్క్ గా పని చేస్తున్నాడు.మరోపక్క తాను సాధించిన కళని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళగలిగాడు.

ప్రదీప్ కుమార్ ఆగస్టు ఐదో తేదీన పందొమ్మిదివందల ఢెబ్భై మూడు లో,హర్యానా లో నఖానా అనే ఊళ్ళో పుట్టాడు.ఇతని తండ్రి బాలకిషన్ స్వామి మిడిల్ స్కూల్లో టీచర్.ప్రదీప్ కి డెబ్భైఐదు శాతం చెముడు.అయినా అతని తండ్రి అతన్ని అందరూ చదువుకునే తన స్కూల్లోనే వేసి, కష్టపడి మెట్రిక్ దాకా చదివించాడు.

ప్రదీప్ కి తను మిగతా పిల్లల్లాగ లేడని తెలిసింది,కానీ అతను కుంగిపోకుండా అందరూ చెయ్యని పని ఏదైనా చెయ్యాలని అనుకున్నాడు.చదువుకునే రోజుల్లోనే అతనికి బొమ్మలు వెయ్యటమంటే చాలా ఆసక్తి ఉండేది.దేవుడు మన శరీరంలో ఎక్కడైనా ఒక లోపం పెడితే
జీవశక్తిని ఇంకో రూపంలో ,మరెక్కడో పెడతాడు.బొమ్మలు గీయటంతో పాటు ప్రదీప్ కి కొన్ని విచిత్రమైన సరదాలు కూడా కలిగాయి.

క్లాసులో కింద పడ్డ చాక్ పీసు ముక్కలని బ్లేడుతో చెక్కి అద్భుతమైన కళాకృతులు తయారు చేసేవాడు.అలాగే ఒకసారి అగ్గిపుల్లతో చెవి శుభ్రం చేసుకుంటూండగా, అది తమాషాగా విరిగింది.అంతే,ఇంకేముంది?అతని ఆలోచనలు ఒక కొత్త దిశగా పరిగెత్తాయి.అగ్గిపుల్లలతో శిల్పాలు చేయటం! అతని పేరు త్వరలోనే విదేశాలకి కూడా పాకింది.

క్రాఫ్ట్ కౌన్సిల్,న్యూ యార్క్,ప్రదీప్ కుమార్ అగ్గిపుల్లలతో చేసిన కళాకృతులను జానపద కళల కోవలోకి చేర్చి,లండన్,న్యూయార్క్,పారిస్ నించి ప్రచురించబడే, ’రా విజన్’అనే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆర్ట్  త్రైమాసిక పత్రికలో ప్రదీప్ కుమార్ పరిచయం,అతను అగ్గిపుల్లలతో చేసిన ఇరవైనాలుగు నమూనాల ఫొటోలూ రెండు పేజీల్లో ఇవ్వటమే కాక,తమ వెబ్ సైట్ లో కూడా వాటిని పెట్టారు.ఆ పత్రిక ప్రదీప్ కుమార్ కి రెండువందల యాభై డాలర్లు ఇచ్చి అతన్ని ప్రోత్సహించింది.ఆ పత్రికనీ ఇంటర్నెట్ లోని వెబ్ సైట్ నీ చూసి న్యూయార్క్ లోని పేరు పొందిన ఆర్ట్ గ్యాలరీ,’కెవిన్ మోరిస్’ప్రదీప్ తయారు చేసిన కళాకృతులని న్యూయార్క్ కి తెప్పించుకుంది.ఇప్పటికీ అవి ఆ అర్ట్ గ్యాలరీలో ఉన్నాయి.

ప్రదీప్ ఒక్క క్షణంలో బ్లేడ్ తో అగ్గిపుల్లని ఒక అందమైన పక్షిగానో,మనిషిగానో చెక్కేస్తాడు.చూసేవాళ్ళు ఆశ్చర్యంతో ముక్కుమీద వేలు వేసుకుంటారు.కృష్ణుడూ -రాధా,రుక్మిణీ బొమ్మలు కురుక్షేత్ర నగరం లోని కృష్ణ మ్యూజియంలో ప్రదర్శనకి ఎంచుకోబడ్డాయి.

తండ్రి అందించిన సాయానికి,తనలోని సంకల్పబలం తోడై,ప్రదీప్ పందొమ్మిదివందల తొంభైమూడులో ,పంజాబ్ నేషనల్ బ్యాంకు జోనల్ ఆఫీసులో, హిసార్ లో, క్లాస్ ఫోర్ ఉద్యోగిగా పని ప్రారంభించాడు.ఆర్థికంగా స్వావలంబన సాధించాక అతని కళ మరింత మెరుగులు దిద్దుకుంది.తన నైపుణ్యం, దృఢమైన కోరికా,శ్రద్ధా తో బ్యాంకులోని ఆఫీసర్లనీ, తోటి ఉద్యోగులనీ ఆకట్టుకున్నాడు.చాలా కాలం ఇదే ఉద్యోగంలో ఉంటూ పని చేశాడు. రెండువేల నాలుగు జనవరిలో అతనికి ప్రమోషనొచ్చి క్లర్క్ పనిలో చేరాడు.తన ఉద్యోగాన్ని చక్కగా నిర్వహిస్తున్నాడు.

ఉద్యోగం చేస్తూనే తీరిక దొరికినప్పుడల్లా తన కళకి సమయాన్ని వెచ్చిస్తాడు.తొంభైనాలుగు ఫిబ్రవరీ నెలలో హిసార్ లో అతని బొమ్మల ప్రదర్శన జరిగింది.అతనికి ఐదువందల రూపాయలు బహుమతీ,బోలెడంత ప్రశంసా లభించాయి. ఇంటర్నేషనల్ డిసేబుల్డ్ ఏర్పాటు చేసిన ఒక సమావేశం లో ప్రదీప్ కళకి స్థానం లభించింది.అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ స్వయంగా ప్రదీప్ కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు.
 హర్యానా ప్రభుత్వం  ’అత్యంత నిపుణుడైన ఉద్యోగి’పురస్కారాన్ని తొంభైనాలుగులోనూ,’భారతీయ వికలాంగ భూషణ్’పురస్కారాన్ని తొంభైఐదులోనూ,’రెడ్ అండ్ వైట్ సామాజిక సాహసికుడు’అనే పురస్కారాన్ని తొంభైఆరులోనూ ఇచ్చి ప్రదీప్ కుమార్ ని సత్కరించింది.

ప్రస్తుతం ప్రదీప్ జీవితం సుఖంగా, గౌరవంగా సాగిపోతోంది. తను చేసిన పోరాటం,తన ఆత్మవిశ్వాసం,దృఢ సంకల్పం.శ్రద్ధా,ధైర్య సాహసాలూ,కళా కౌశలం,తలిదండ్రులు కలగజేసిన ప్రేరణా,తను పడ్డ ప్రయాసా వల్ల ప్రదీప్ ఈరోజు సమాజంలో ఉన్నత స్థానాన్ని దక్కించుకున్నాడు.అతనికి తనకున్న కొరత భారమని అనిపించటంలేదు.అతని కఠిన ప్రయాస,అతనికున్న కళా నైపుణ్యం ముందు, అతనికున్న అంగవైకల్యం తలవంచక తప్పలేదు*

------------------------------------------------------------------------------------------------

హిందీ మూలం : బంశీలాల్ పరమార్

అనువాదం : ఆర్.శాంత సుందరి

No comments:

Post a Comment