అనువాదం ఓ సృజనోత్సవం
Posted on: Sat 14 Mar 22:56:31.545754 2015
ఆదాన ప్రదానాలు భావాల వ్యాప్తికి అవసరం. సాహిత్యంలోని మేలిమిని విభిన్న భాషల పాఠక సమూహాలకి అందించడానికి తప్పనిసరి. ఇందుకు అనువాదమే వాహిక. సాహిత్యమే కాదు సాహిత్యేతర అంశాలు కూడా ఒక భాష నుంచి మరో భాషలోకి వెళ్ళడం ద్వారానే భావ వినిమియం సాధ్యం. కమ్యూనిస్టు ప్రణాళిక అనేకానేక భాషల్లోకి అనువాదం కావడం వల్లనే సమసమాజ స్వప్న సాకారం సాధ్యమని ప్రపంచం విశ్వసించింది. దోపిడీ పీడనల్లేని సామ్యవాద వ్యవస్థ స్థాపనకు అనువైన ఏకైక సిద్ధాంతం మార్క్సిజం. మార్క్స్, ఎంగెల్స్ రచనల అనువాదాల కారణంగానే ఆ సిద్ధాంతపు బలం లోకానికి తెలిసి వచ్చింది. అలాగే రామాయణం, మహాభారతం అనేకానేక భాషల్లోకి అనువాదం కావడం ద్వారానే ఈ దేశంలోని ఇతిహాసాల మూలాలు విశ్వవ్యాప్తమయ్యాయి.
ఒక భాష నుంచి మరో భాషలోకి వెళ్ళే సాహిత్యానువాదాలు ఉదాత్త భావాల వ్యాప్తికి తోడ్పడతాయి. ముఖ్యంగా ఉత్తమ సాహిత్యం అనువాదం కావడం వల్ల హృదయ సంస్కారం నెలకొంటుంది. మానవీయ దృక్పథం పాదుకుంటుంది. ఇతరులకు వీలయినంత ఎక్కువ మేలు తక్కువ హాని జరిగేలా తమ నడత ఉండాలన్న అభిప్రాయాలకు బలం చేకూరుతుంది. ఈ కారణంగానే అనువాదాలకు ప్రాశస్త్యం చేకూరింది.
మాక్సీమ్ గోర్కీ 'అమ్మ' నవల చదివి మార్క్సిజానికి ఆకర్షితులైనవారు ఉన్నారు. రవీంద్రుని 'గీతాంజలి' చదివి ఉత్తేజితులయినవారున్నారు. బెంగాలీ సాహిత్యానువాదాలు చదివి శరత్, ప్రేమ్‌చంద్‌ల సాహిత్యానికి ముగ్ధులయినవారు అనేకులు. తద్వారా ప్రజల మేలును తలపోసే అభ్యుదయోద్యమాల పథం తొక్కిన సృజనశీలురు ఎందరో! కనుకనే అనువాదాలు చేసే మేలు అనంతం. తెలుగు సాహిత్య వికాసంలో, విభిన్న ప్రక్రియల విస్తరణలో అనువాదానికి తగినంత ప్రాధాన్యం వుంది. అందువల్లనే కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాదాలకు కూడా పురస్కారాలు అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కారాన్ని ఆర్.శాంతసుందరి గారు అనువాదం చేసిన 'ఇంట్లో ప్రేమ్‌చంద్'కు ప్రకటించారు. ప్రేమ్‌చంద్ గురించి ఆయన భార్య రాసిన పుస్తకమిది. అభ్యుదయ సాహిత్యవేత్తగా ప్రేమ్‌చంద్ ప్రఖ్యాతి చెందారు. గోదాన్, రంగభూమి వంటి గొప్ప నవలలు రచించారు. అలాంటి వ్యక్తి జీవితం మీద వచ్చిన విశిష్ట రచన ఈ పుస్తకం.
మాటకీ చేతకీ అంతరం లేకుండా జీవించిన సాహితీవేత్తల రచనలకి విశ్వసనీయత, సాధికారత ఉంటాయి. ఈ కారణంగానే ప్రేమ్‌చంద్ మీద వచ్చిన ఈ పుస్తకం సృజనశీలురకు ఓ పాఠ్యగ్రంథం. సామాన్యులకు సైతం ఉపయోగకరమైన పుస్తకం. తెలుగు నుంచి ఇతర భాషలకీ ఇతర భాషల నుంచి తెలుగులోకీ అనేక రచనల్ని సరళ సుందరమైన అనువాదంతో అందించిన శాంతసుందరి గారికి ఈ అవార్డు ఆలస్యంగా లభించింది. గతంలో ఆమె అనువాదం చేసిన 'బేబీ హాల్దార్'కే ఈ పురస్కారం రావాల్సి వుండింది. ఎట్టకేలకు ఇప్పుడయినా ఆమెకు ఈ అనువాద పురస్కారం లభించడం తెలుగునాట అనువాద ప్రపంచానికి ఒక ఉత్సవ సందర్భం. అనువాద సాహిత్యాన్ని ఇష్టపడే పాఠకులకు ఆనంద సన్నివేశం.
బెంగాలీల సాహిత్యంపై మమకారం హిందీ తర్వాత బెంగాలీ నుంచే ఎక్కువగా తెలుగులోకి అనువాదాలు వచ్చాయి. ముఖ్యంగా 1950, 60లకి పూర్వం బెంగాలీ సాహిత్యం విపరీతంగా అనువాదమైంది. బంకించంద్ర, రవీంద్రనాథ్ టాగూర్, శరత్, కిషన్‌చందర్, ప్రేమ్‌చంద్, తారాశంకర్ బెనర్జీ మొదలయినవారి రచనలు విస్తారంగా తెలుగులోకి అనువాదం చేశారు. శరత్ సాహిత్యం సమస్తం తెలుగులోకి వచ్చింది. శరత్ నవలలు గొప్ప భావ విప్లవాన్ని తీసుకొచ్చాయి. సాహిత్యం మీద పాఠకుల మమకారాన్ని ఇనుమడింపజేశాయి. శరత్ జీవితచరిత్రకు జ్వాలాముఖి చేసిన అనువాదం రమణీయమైంది. బెంగాలీ సాహితీవేత్తల్లో శరత్ అంత దగ్గరగా మన ఆత్మకు సన్నిహితంగా వచ్చినవారు అరుదు. నవలా సాహిత్యం మీద తెలుగు పాఠకుల్లో ఆసక్తినీ, అనురక్తినీ పెంచడానికి శరత్ సాహిత్యం దోహదం చేసింది. తర్వాత కాలాన సునీల్ గంగోపాధ్యాయ, మహాశ్వేతాదేవి వంటివారు ఈతరం పాఠకులకు దగ్గరగా వచ్చినప్పటికీ శరత్ సాహిత్యం ఎప్పటికీ సమ్మోహన భరితం. ఇక రవీంద్రుని గీతాంజలిని తెలుగులో అనేకులు అనువాదం చేశారు. అందులో బెల్లంకొండ రామదాసు, చలం చేసిన అనువాదాలు అపురూపమైనవి. మరల మరల గీతాంజలిని చదవాలనిపించే అనువాదాలవి.
రష్యన్ అనువాదాలు గొప్ప స్ఫూర్తి కొన్ని తరాల పాటు తెలుగులో పాఠకుల సంఖ్యను పెంచడానికి సోవియట్ సాహిత్య అనువాదాలు తోడ్పడ్డాయి. అలాగే కమ్యూనిస్టు ఉద్యమాల్లోకి వేలు, లక్షలుగా జనాలు తరలి రావడానికి ప్రేరణగా నిలిచిందీ సాహిత్యం. తెలుగు సాహిత్యంలో ఇవాళ లబ్దప్రతిష్టులయిన అనేకమంది కవులకీ, రచయితలకీ కూడా సోవియట్ సాహిత్యమే గొప్ప స్ఫూర్తి. గోర్కీ, పుష్కిన్, దొస్తవిస్కీ, లెర్మంతోవ్, టాల్‌స్టారు, చెంఘిజ్ అయిత్మతోవ్ వంటి రచయితల అనువాదాలు తెలుగు సాహిత్యం మీద చూపిన ప్రభావం అనంతం. రచయితలు ప్రజలవైపా? పాలకుల వైపా? అనే ప్రశ్నలు లేవనెత్తి కలంవీరులు ప్రజల పక్షం నిలవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది సోవియట్ సాహిత్యం. ప్రత్యేకించి గోర్కీ రచనల సంపుటాల్ని ఇప్పుడు తాజాగా ప్రజాశక్తి బుకహేౌస్ ప్రచురించింది. గోర్కీ నా బాల్యం, నా విశ్వవిద్యాలయాలు తప్పక చదవాల్సిన పుస్తకాలు.
సోవియట్ రష్యా తర్వాత చైనీస్ సాహిత్య అనువాదాలు ఉత్తేజపూరితమైన వాతావరణాన్ని ప్రోదిచేశాయి. 'చైనాపై అరుణతార' గ్రంథం చదవడం ఆ రోజుల్లో ఓ విశిష్ట అనుభవం. లూసన్, టావ్చెంగ్ రచనలు పాఠకలోకాన్ని ఉత్తేజితుల్ని చేశాయి. చైనీస్ సాహిత్యం కూడా తెలుగు పాఠక హృదయానికి దగ్గరగా వచ్చింది. ఆ తర్వాత ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ సాహిత్య అనువాదాల్ని ఆత్మీయంగా స్వీకరించారు. ఈ దేశ, ఈ ప్రాంత వాస్తవికతకు దగ్గరగా ఉండడమే దీనికి మూలం. గూగీ, చినువా అచెబి, టోనీ మారిసన్ రచనలు ఇందుకే నచ్చుతాయి. ఆంగ్ల భాష నుంచి వచ్చిన అనువాదాలు అవసరార్థం చదువుతారు. కానీ ఆత్మను ప్రదీప్తం చేసే అంశ అందులో తక్కువ. మరల ఫ్రెంచి సాహిత్యానికి సంబంధించి వస్తే రొమాంటిక్ ధోరణి ఓ ఆకర్షణీయ అంశం. అందుకే మపాసా రచనల్ని ఇష్టపడతారు. అధివాస్తవిక ధోరణిలోని జేమ్స్‌జాయిస్, వర్జీనియా వుల్ఫ్ రచనలపై ఆసక్తి చూపుతారు. అలాగే కాఫ్కా, అల్బర్ట్ కామూ వంటి రచయితలు కూడా మనవాళ్ళకు ఇష్టం. ఈ ఇద్దరి రచనల్ని ప్రముఖ కథారచయిత్రి జి.లక్ష్మి తెలుగులోకి అనువాదం చేశారు. అల్బర్ట్ కామూ 'ఔట్ సైడర్' నవలకు ఆమె చేసిన అనువాదంలో చదివించే గుణం ఉంది.
భారతీయభాషల్లో... భారతీయ భాషల్లోంచి తెలుగులోకి అనువాదాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఒక ప్రాంతీయ భాషలోంచి హిందీలోకి అనువాదమైతే తద్వారా ఇతర ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కావడం సులువు. ఒక ప్రాంతీయ భాషలోంచి ఇంగ్లీషులోకి అనువాదమయిన రచనని అనువాదం చేయడం కన్నా హిందీలోకి అనువాదమైన రచన అనువాదం చేయడం సులభం. సంస్కృతం మిళితమైన హిందీభాషలోని నుడికారం వల్ల అనువాదం సాధికారికంగా, మూలానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది. కనుక ప్రాంతీయభాషలు తెలిసిన వారికి హిందీ భాషపై సాధికారికమైన పట్టు ఉన్నప్పుడు అనువాదం మరింత సృజనాత్మకంగా రూపొందుతుంది. శాంత సుందరి, ఎం.రంగయ్య, పోలి విజయరాఘవరెడ్డి వంటి వారి రచనల్లోని మేలిమికి మూలం హిందీ, తెలుగుభాషలపై వారికి మంచి పట్టు ఉండటం.
అయితే తమిళం, మలయాళం, కన్నడం నుంచి నేరుగా అనువాదాలు చేయగల ప్రతిభాశాలురు అనేకులున్నారు. యు.ఆర్.అనంతమూర్తి 'సంస్కార' నవలను సుజాతా పట్వారి కన్నడం నుంచి నేరుగా తెలుగులోకి అనువాదం చేశారు. సేతు నవల 'పాండవపురం'ను మలయాళం నుంచి తెలుగులోకి ఎల్.ఆర్.స్వామి చక్కగా అనువదించారు.
సాహిత్యేతర అనువాదాలు అధికం ఇవాళ వస్తున్న అనువాదాలతో పోల్చుకుంటే 1960ల పూర్వం అనువాదాలు ఎక్కువని చెబుతుంటారు సీనియర్ రచయితలు, ప్రచురణకర్తలు. ఆ రోజుల్లో పాఠకుల మానసిక ప్రపంచాన్ని విశాలం చేసే అనువాదాలు ఎక్కువ. వైయుక్తిక స్వప్నాల కన్నా సామూహిక స్వప్నాల మీదనే దృష్టి కేంద్రీకృతమైన కాలమది. కానీ కాలం మారుతూ వచ్చింది. 1980ల తర్వాత... ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1990ల కాలం నాటికి వ్యక్తి కేంద్రంగా ఆలోచనలు ప్రబలాయి. పదుగురి మేలు కన్నా తన ప్రయోజనమే మిన్న అనే భావాలు పొడసూపాయి. దీనితో వ్యక్తిత్వ వికాసం పేరిట వచ్చే రచనలకీ, అనువాదాలకీ ప్రాధాన్యం హెచ్చింది. ఈ ధోరణి 2000 సంవత్సరం తర్వాత పరాకాష్టకు చేరింది. అందువల్లనే 1990ల వరకు ఫుట్పాత్లకే పరిమితమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు యువత చదవాల్సిన గ్రంథాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక్కడి వ్యక్తిత్వవికాస రచయితలు ఆ పుస్తకాల్ని అనుసరించి, కొన్నిసార్లు చౌర్యం చేసి పుస్తకాలు రాశారు. తర్వాత ఆయా రచయితల పుస్తకాల్ని నేరుగా అనువాదం చేసి మార్కెట్ చేసే ధోరణి ప్రబలింది. అందువల్లనే డేల్‌కార్నెగి, స్టీఫెన్ ఆర్. కవీ, దీపక్ చోప్రా, శివఖేరా, రాబర్ట్ కియోస్కి, రాబిన్‌శర్మ వంటి వారి పుస్తకాల అనువాదాలు కోకొల్లలుగా వచ్చాయి. భగవద్గీతలోనూ, మహాభారతంలోనూ వ్యక్తిత్వ వికాస కోణాల్ని చూస్తున్నారు. స్వామి వివేకానందని వ్యక్తిత్వవికాస నిపుణుడిగా మార్చివేశారు. మరోవైపున సెల్ఫ్‌హెల్ప్ పుస్తకాలు అనువాదమై వస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండడం ఎలా? డబ్బు సంపాదించడం ఎలా? లావు తగ్గడం ఎలా? భద్రజీవితాన్ని సాధించడానికి యోగా, ధ్యానం వంటి ప్రక్రియలు ఎలా ఉపకరిస్తాయో చెప్పే రచనల అనువాదం అధికం. ఈరకమైన పుస్తకాల్ని అవసరమైన పుస్తకాలుగా తలపోసే పాఠకుల సంఖ్య ఇనుమడించింది. దీనికి అనువుగా ఇలాంటి పుస్తకాల అనువాదాల పరంపర కొనసాగుతోంది. సాహిత్యం ద్వారా వచ్చే హృదయ సంస్కారం కన్నా వ్యక్తిగా ఎదగడానికి తోడ్పడే పుస్తకాలకు ప్రాధాన్యం చేకూరింది. ఈ నేపథ్యంలోనే సాహిత్యేతర అనువాదాలకు మార్కెట్ పుష్కలంగా వుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాలకు చెందిన ప్రచురణ సంస్థలు ఈవిధమైన పుస్తకాలని తెలుగులోకి అనువాదం చేయించి అమ్ముతున్నాయి. కనుక పుస్తకాల షాపుల్లో, బుక్ ఎగ్జిబిషన్లలో ఇలాంటి పుస్తకాల హల్చల్ చూస్తున్నాం.
జీవితచరిత్రలు, ఆత్మకథలు వ్యక్తిత్వవికాసం, స్వయం సహాయక పుస్తకాల తర్వాత జీవితచరిత్రల, ఆత్మకథల అనువాదాలు వస్తున్నాయి. కారల్ మార్క్స్, లెనిన్, ఎంగెల్స్, స్టాలిన్, మావో, చెగువేరా వంటి వారి జీవితచరిత్రలపై కొందరికి ఆసక్తి. ఇక ఇప్పుడు బిల్‌గేట్స్, అంబానీల జీవితచరిత్ర మీద ఆసక్తి చూపే ధోరణి పెరిగింది. సంపన్నులు ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకమనే భావాలు పొడసూపాయి. అందువల్లనే సంపన్నుల విజయగాథలు పుస్తకాలు ఆంగ్లం నుంచి తెలుగులోకి వస్తున్నాయి. వీటితోపాటు ఐన్‌స్టీన్, చార్లెస్ డార్విన్, మేరీ క్యూరీ, నోబెల్ విజేతలు, మహిళల స్ఫూర్తిదాయక చరిత్రల అనువాదాలు అనేకం వస్తున్నాయి. తెలుగునాట వివిధ రంగాలకు చెందినవారి జీవితచరిత్రల కన్నా ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రముఖుల జీవితచరిత్రలు అనువాదమై వస్తున్నాయి.
అయితే అనువాదం కోసం అనువాదం కాకుండా ఇష్టంగా అనువాదం చేసేవారు అనేకమంది వున్నారు. ఇతరభాషల్లోని రచనల మీద ప్రేమతో అనువాదం చేసేవారు, బాధ్యతతో అనువాద కార్యక్రమాన్ని చేపట్టేవారు ఉన్నారు. ముక్తవరం పార్థసారథి అనువాదాలు చేయడమే కాదు, మంచి సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నారు. కస్తూరి మురళీకృష్ణ క్లాసిక్స్ అనిపించిన అనేక పుస్తకాల్ని పరిచయం చేశారు. లంకా శివరామప్రసాద్ ఈమధ్యకాలంలో ప్రపంచ సాహిత్యాన్ని సీరిస్‌గా అనువాదం చేస్తున్నారు. లక్ష్మీరెడ్డి, నిర్మలానంద, నిఖిలేశ్వర్, దేవరాజు మహారాజు వంటి ప్రముఖులు అనువాదరంగంలో చేస్తున్న కృషి విశేషమైంది. అనువాదాల ద్వారా సాహిత్య చైతన్యం పరిఢవిల్లుతుంది. ఒక భాషలోని మంచి సాహిత్యం ఇతర భాషలవారికి లభిస్తుంది. అంతిమంగా సాహిత్య సుసంపన్నతకు అనువాద కార్యక్రమం తోడ్పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు అనువాదానికి తెలుగులో ఒక అకాడమీ అవసరం. నిజానికి ఇప్పుడు తెలుగునాట రెండు రాష్ట్రాలకు రెండు అనువాద అకాడమీలు ఉండటం అవసరం. ఈ దిశగా ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నం చేయడానికి రచయితలు, రచయితల సంఘాలు ప్రయత్నించడం అవసరం. ఈ ఏడాది అనువాద పురస్కారాన్ని పొందిన ఆర్.శాంతసుందరి గారికి మరోసారి అభినందనలు.
పాత్రికేయ అనుభవం ఉపయోగపడింది- జి. లక్ష్మి
ప్రపంచంలో వివిధ భాషల్లో వెలువడుతున్న ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులకు అందించడానికి అనువాద సాహిత్యం ఉపయోగపడుతుంది. అనువాద సాహిత్యం ద్వారా భిన్న ప్రాంతాలకు చెందిన సంస్కృతులు, పద్ధతులు, జీవన విధానం గురించి తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే అనువాద రచనలంటే నాకు మొదటినుంచి ఆసక్తి ఉండేది. స్పార్టకస్, చెంఘిజ్ ఖాన్ లాంటి నవలలు, రష్యన్ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, శరత్, ప్రేమ్‌చంద్, టాగోర్ రచనలు మొదలైనవన్నీ అనువాద సాహిత్యంపై మరింత అభిమానాన్ని పెంచాయి. ఆల్బర్ట్ కామూ ''ది స్ట్రేంజర్'' చదివిన తరువాత దానిని తెలుగు పాఠకులకు పరిచయం చెయ్యాలనుకున్నాను. ''అపరిచితుడు''గా తెలుగులోకి అనువాదం చేశాను. ఫ్రాంజ్ కాఫ్కా కథలని ''కాఫ్కా కథలు'' పేరిట తెలుగులోకి అనువదించాను. 2013 సంవత్సరపు నోబెల్ బహుమతి గ్రహీత ఆలిస్ మన్రో కథలను కూడా ''ఆలిస్ మన్రో కథలు'' గా అనువదించాను. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి దినపత్రికలలో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఈ అనువాదాలకు బాగా ఉపయోగపడింది.
- కిరణ్‌కుమార్

భాషలో సారళ్యం-అనువాదానికి ఆకర్షణ
ప్రేమ్‌చంద్ రచనల ప్రత్యేకత మనకందరికీ తెలిసిందే. కాని వారి వ్యక్తిత్వం, ఇష్టాలు, మానవీయత గురించి మాత్రం ఆయన భార్యకు మాత్రమే తెలుసు. అలాంటి విషయాలను ఆయన సతీమణి శివరాణీదేవి 'ప్రేమ్‌చంద్ ఘర్ మే' పేరుతో హిందీలో పుస్తక రూపంలో అందరికీ పరిచయం చేశారు. కాని హిందీ రానివారికి ఆయన గురించి తెలుసుకునే అవకాశం కలగలేదు. అలాంటి అవకాశాన్ని శ్రీమతి ఆర్. శాంతసుందరి ''ఇంట్లో ప్రేంచంద్'' పేరుతో పుస్తకాన్ని అనువదించి ప్రజలకు అందించారు. ఈ పుస్తక అనువాదానికి గానూ 2014 కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు ఈమెను వరించింది. ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె అయిన శాంతసుందరి గత నలభై సంవత్సరాలుగా అనువాదరంగంలో విశేషకృషి చేస్తూ హిందీ, తెలుగు, ఇంగ్లీషు, తమిళం భాషల్లోని కవిత్వం, నవల, కథ, నాటకం, వ్యాసాలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు... ఇలా 68 సాహిత్య పుస్తకాలను అనువాదం చేశారు. అనువాద పురస్కారం వచ్చిన సందర్భంగా ఆమెతో సంభాషణ
సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చినందుకు ముందుగా కంగ్రాచ్చులేషన్స్ మేడమ్...
ధన్యవాదాలు...
'ఇంట్లో ప్రేమ్‌చంద్' పుస్తకాన్ని అనువదించాలని ఎందుకనిపించింది?
జనవరి 2009 నుంచి జూలై2012 వరకు భూమిక మాసపత్రికలో సీరియల్‌గా వచ్చింది. భూమికలో ప్రారంభమైన రెండుమూడు నెలల్లోనే వరవరరావు గారి లాంటి ప్రఖ్యాత కవులు ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పారు. ఆ తర్వాత పాఠకుల నుంచి మంచి స్పందన రావడం వల్ల సీరియల్ అయిపోయాక భూమిక పత్రిక చదవని వాళ్ళు కూడా దీన్ని చదివితే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అందుకే ఆ ప్రయత్నం చేశాను. 2012 సెప్టెంబర్‌లో ''ఇంట్లో ప్రేమ్‌చంద్'' పేరుతో పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించారు.
2012లో ముద్రించిన ఈ పుస్తకానికి ఇప్పుడు అంటే మూడేళ్ళ తర్వాత అవార్డు రావడం పట్ల మీ స్పందన?
పుస్తకం ముద్రించిన తర్వాత దాన్ని అందరూ చదవాలి. చదివాక అది అవార్డుకి అర్హమైందనీ, సూచించాలనీ అనిపించాలి. ఆ తర్వాత ప్రచురణ తేదీ, సంవత్సరం మొదలైనవి సంస్థ నియమాలకి అనుగుణంగా ఉండాలి. దానికి ఇంతమాత్రం వ్యవధి పడుతుంది కదా!
ఇంత అనుభవం ఉన్న మీకు అవార్డు చాలా ఆలస్యంగా వచ్చింది అనుకుంటున్నాం...దీనిపై మీ స్పందన?
అవార్డులు రావలసినప్పుడే వస్తాయి. వస్తే సంతోషమే కానీ రాకపోతే విచారించను. అవార్డుల కోసం ఆశించకుండా మంచి పుస్తకాలని అందించాలన్న కోరికా, అందించానన్న తృప్తీ నాకు ముఖ్యం. ఆ లక్ష్యం 99శాతం నెరవేరిందనే అనుకుంటున్నాను. (1శాతం మొహమాటానికి)
అనువాదాలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
అనువాదాలు చేయాలనే ఆలోచన నాకు ఎలా వచ్చిందో చెప్పాలంటే దాదాపు40ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది... నేను బిఏ(హిందీ) ఆఖరి సంవత్సరం చదువుతున్నప్పుడు హిందీ మాతృభాష కాని విద్యార్థుల కోసం ఒక పోటీ పరీక్ష మద్రాస్ విశ్వవిద్యాలయం 1966లో నిర్వహించింది. అందులో నాకు మొదటి బహుమతి వచ్చింది. ఆ సందర్భంగా నాన్న గారితో కలిసి ఢిల్లీ, బెనారస్ వెళ్ళాను. మా నాన్న ప్రఖ్యాత రచయిత కాబట్టి ఆయన వల్ల హిందీ రచయితలని కలుసుకునే అవకాశం దొరికింది. దినకర్, జైనేంద్ర కుమార్, హరివంశరారు బచ్చన్ లాంటి మహా మహులని కలిసి వాళ్ళ మాటలు వినే అరుదైన అవకాశం అంత చిన్న వయసులోనే దొరికింది.
మద్రాసు వచ్చాక అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ హిందీలో ఉత్తరాలు రాశాను. ఒక్క బచ్చన్ మాత్రమే జవాబు రాశారు. అందులో భారతీయ భాషల మధ్య పరస్పరం అనువాదాలు విరివిగా జరగడం ఎంత ముఖ్యమో చెబుతూ నన్ను ఆ పనికి పూనుకోమని, నా హిందీ చాలా బాగుందనీ రాశారు. ఆ ఉత్తరం ఇంకా భద్రంగా నా దగ్గర ఉంది. ఆ ఉత్తరం నాలో అనువాదాలు చెయ్యాలన్న ఆలోచననీ, ఆసక్తినీ రేకెత్తించింది.
మీదగ్గరికి వచ్చిన అన్నీ పుస్తకాలను అనువాదం చేస్తారా? లేదా మీకు నచ్చిన వాటినే చేస్తారా? అసలు అనువాదానికి పుస్తకాలను ఎలా ఎంపిక చేసుకుంటారు?
లేదు. నచ్చిన వాటినన్నీ కూడా అనువాదం చేయడం సాధ్యం కాదు. నాకు నచ్చడంతో పాటు పాఠకులకి కూడా నచ్చుతుందనీ, ఉపయోగంగా ఉంటుందనీ నాకు అనిపించినప్పుడే అనువాదానికి ఎంపిక చేసుకుంటాను.
అనువాదాన్ని యధాతథంగా చేస్తారా? లేదా స్వేచ్ఛానువాదం చేయడానికి ఇష్టపడతారా? ఎందుకు?
మక్కీకి మక్కీ అయితే మాత్రం నేను చెయ్యను. అలాగని పూర్తిగా మూలాన్ని పక్కన పెట్టడం కూడా సరికాదు. భావం, విషయం చెడకుండా మూలానికి వీలైనంత న్యాయం జరిగేలా చూస్తాను. భాష స్వభావాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయ్యక తప్పదు. ఉదాహరణకి 'ఇంట్లో ప్రేమ్‌చంద్' కి హిందీ శీర్షిక 'ప్రేమ్‌చంద్ ఘర్ మే' దాన్ని యథాతథంగా అనువదిస్తే - 'ప్రేమ్‌చంద్ ఇంట్లో' అని వస్తుంది. కానీ తెలుగులో అర్థం ఎంత మారిపోతుందో చూడండి. ఇలాంటి వాటివల్ల అనువాదం అనువాదంలా ఉండకపోవడమే కాక దానికి స్పష్టత కూడా వస్తుంది.
మీకు కవిత్వ పుస్తకాలు అనువాదం చేయడం ఇష్టమా? లేక వచన రచనలా?
కవిత్వ మంటే ఎక్కువ ఇష్టం. కారణం చిన్నప్పట్నుంచీ ఆ వైపే మొగ్గు ఉండేది. కానీ ఒక విషయం చెపితే ఆశ్చర్యపోతారేమో, నేను ముందు అనువాదాలు మొదలుపెట్టింది కథలు, నాటికలతో. కవిత్వం అనువదించడం కష్టం అనుకునేదాన్ని. 1990 దశకంలో సాహిత్య అకాడమీ హిందీ పత్రిక ఎడిటర్ మీరు కవితలని ఎందుకు అనువదించకూడదు? ప్రయత్నించండి అన్నాడు. వెంటనే ప్రయత్నించి చూద్దామనుకున్నాను. ప్రఖ్యాత కవులవి ఏడు కవితలు అనువదించి పంపాను. ఒకటి తప్ప అన్నీ అచ్చయ్యాయి. అంతేకాదు, తరచూ తెలుగు కవితల అనువాదాలు పంపిస్తూ ఉండమని కోరాడాయన. ఇక ఆగకుండా కవిత్వానువాదం కూడా కొనసాగింది. నేను అనువదించిన పుస్తకాలన్నీ కాస్త స్థాయి ఉన్నవనే అనుకుంటున్నాను.
మీరు హిందీలో కూడా అనువాదం చేశారు. అనువాదాలు తెలుగులో ఎక్కువ చేశారా? హిందీలోనా?
హిందీలోనే, ఎందుకంటే మన రచయితల రచనలని వేరే భాషలవారికి పరిచయం చేయడం ఎక్కువ ముఖ్యమని నా ఉద్దేశం. కారణం, వర్థమాన రచయితల రచనలని అనువదించేవారు తక్కువ. రెండోది, మన రచయితలు సామాజిక సమస్యలకి స్పందించి రాస్తున్నంత విరివిగా హిందీ రచయితలు రాయడం లేదు. విషయం, రచనా విధానం, శైలి అన్నింటిలోనూ మనమే వాళ్ళకన్నా ముందున్నాం. పైగా నా మాతృభాష తెలుగు. నా వాళ్ళని ఇతరులకి పరిచయం చేయడానికి కృషి చేయడం సహజమే కదా! హిందీ పుస్తకాలని ఇతర భాషలలోకి అనువదించడం సులువుగానే జరుగుతుంది. తెలుగు రచనలు ఇతర భాషలలోకి అనువదించడం అనేది అంతగా జరగడం లేదు. అందుకే ఆ ప్రయత్నానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను. అనువాదాలని ప్రోత్సహించే ప్రభుత్వం, సంస్థలు ముందుకొస్తే మన పుస్తకాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో హిందీలోకి, ఆంగ్లంలోకి వెళతాయి.
మీరు అనువాదం చేసిన పుస్తకాల్లో మీకు బాగా ఇష్టమయిన పుస్తకం ఏది?
మీరు అడిగింది కష్టమైన ప్రశ్నే... ఒక పుస్తకాన్ని అన్నిటికన్నా ఇష్టమైనదని చెప్పలేను. 40ఏళ్ళ కృషి, 68పుస్తకాలు వచ్చాయి. అంతేకాదు, నేను ఎంతో అభిమానించే ప్రేమ్‌చంద్‌కి సంబంధించిన పుస్తకాలు రెండు అనువదించాను. రెండింటికి పురస్కారాలు వచ్చాయి. మహాశ్వేతాదేవి కథలు అనువదించడం ఒక గొప్ప అనుభవం. ఇలా మన రచయితలలో మా నాన్న పుస్తకం 'చదువు' హిందీలోకి నా అనువాదం ద్వారా రావడం ఎంతో తృప్తి కలిగించింది. కవితానువాదాల్లో వరవరరావు, డా||ఎన్.గోపి, కె.శివారెడ్డి, ఎన్.అరుణ మొదలైనవారి రచనల నా హిందీ అనువాదాలకి బాగా స్పందన వచ్చింది. వచనంలో సలీం రాసిన 'కాలుతున్న పూలతోట' నవలకి నేను చేసిన హిందీ అనువాదానికి 'జాతీయ మానవహక్కుల సంఘం' ప్రథమ బహుమతి ఇచ్చి సత్కరించారు.
అన్నీ అనువాదాలు ప్రజలను హత్తుకోలేవు? ఎందుకు? అనువాదాలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటారు?
మనసుని హత్తుకోవాలంటే ఎంపిక ముఖ్యం. అది మొదటి మెట్టు. తర్వాత అనువాదకుడికి మూలభాషలోను, అనువాద భాషలోను మంచి ప్రవేశం ఉండాలి. ఎంపిక, అనువాదం మనసుపెట్టి చేస్తే చాలా వరకు అది పాఠకులని ఆకట్టుకుంటుంది. మరో విషయం, అనువాదాలు ఎంత సరళంగా ఉంటే అంత బాగా చదువరులని ఆకర్షిస్తాయి. నా విషయంలో హిందీ పాఠకులు, తెలుగు పాఠకులు అనేది నా అనువాదాలు సరళంగా చదివేందుకు హాయిగా ఉంటాయి అనే...
వ్యక్తిత్వ పుస్తకాలను కూడా అనువాదం చేశారు కదా? కమర్షియల్‌గా కూడా అనువాదం చేస్తున్నారా?
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనువాదాలు చేశాను. వాటికి ప్రచురణకర్తలు పారితోషికం ఇచ్చారు. కమర్షియల్‌గా అంటే, డబ్బు కోసం ఏది పడితే అది చెయ్యను. ఏ పుస్తకం అనువదించాలి అనే విషయంలో తుది నిర్ణయం నాదే. దీనికి ప్రచురణకర్తలు కూడా సహకరిస్తారు. ఒత్తిడి చెయ్యరు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాల్లో కూడా కొన్ని మంచివి అప్పుడప్పుడూ తగులుతూ ఉంటాయి. డేల్ కార్నెగీ రెండు పుస్తకాల అనువాదం నాకు చాలా సంతృప్తిని కలగజేసింది.
అనువాద రంగంలోకి అడుగుపెట్టే నేటి యువతరానికి మీరిచ్చే సలహా?
అనువాదం చేయదలుచుకున్న భాషలని క్షుణ్ణంగా నేర్చుకోవడం ముఖ్యం. పుస్తకాలతోపాటు పత్రికలని కూడా చదవాలి. పాఠ్యపుస్తకాల భాష, పత్రికల భాష వేరుగా ఉంటాయి. వాడుక బాష ఉపయోగించాల్సిన చోట పెద్ద పెద్ద పదాలు ఉపయోగిస్తే కథనం దెబ్బతింటుంది. వీలైనంత సరళంగా రాస్తూనే మంచి నానుడితో కూడిన వ్యవహారిక భాష కథలు, నవలలు మొదలైన సాహితీ ప్రక్రియల అనువాదానికి అనువుగా ఉంటుంది. నా విషయమే తీసుకుంటే, ఈ తరం కథలు అనువదించేప్పుడు వాడే భాషకీ, 'అసురుడు'లాంటి రామాయణ కథకి సంబంధించిన పుస్తకాన్ని అనువదించేప్పుడు వాడే భాషకీ కొంత తేడా చూపించేందుకు ప్రయత్నించాను.
మీ కుటుంబ నేపథ్యం? మీ కృషి వెనక వారి సహకారం గురించి చెప్పండి?
అమ్మ, నాన్నల గురించి చెప్పేదేముంది. మీ అందరికీ తెలుసు ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారి కుమార్తెను. సాహితీ కుటుంబంలో పుట్టాను. నా భర్త గణేశ్వరరావు గారు ఇంగ్లీష్ సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి ఒకప్పుడు తెలుగులో కథలు కూడా రాసేవారు. అలా వివాహం తర్వాత కూడా ఇంట్లో సాహితీ వాతావరణంలో పెద్ద తేడా రాలేదు. ఎం.ఎ (హిందీ సాహిత్యం), బి.ఎడ్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి చేశాను. 6-7 సంవత్సరాలు టీచర్‌గా పనిచేశాను. ప్రస్తుతం ఫ్రీలాన్స్ అనువాదకురాలిని.
నా అనువాదాల్లో నాభర్త సహాయం చాలా ఉంటుంది. నా తెలుగు అనువాదాలు చూపించి సూచనలు, సలహాలు తీసుకుంటాను. నా పని తన పని అనుకోవడం ఆయన స్వభావం. అందుకే అంత త్వరగా అన్ని పుస్తకాలు అనువదించగలిగాను. మన రచయితల రచనలని వేరే భాషలవారికి పరిచయం చేయడం ఎక్కువ ముఖ్యమని నా ఉద్దేశం. కారణం, వర్థమాన రచయితల రచనలని అనువదించేవారు తక్కువ. రెండోది, మన రచయితలు సామాజిక సమస్యలకి స్పందించి రాస్తున్నంత విరివిగా హిందీ రచయితలు రాయడం లేదు.
- ఆశాభారతి

Recommended for You
×
×
×
Recommended for You
×
×
Recommended for You
×
SHARE THIS POST ON
COMMENTS
E-mail* :
Name* :
Comment* :
No comments:
Post a Comment