బడ్జెట్
మంత్రి సిన్హా ఇస్తున్న 2000 సంవత్సరం బడ్జెట్ తాలూకు ఉపన్యాసం టీవీలో చూస్తున్నాడు అతీవ్. చానల్ మార్చాడు. స్టార్ న్యూస్‌లో కూడా బడ్జెట్ గురించే వస్తోంది. స్పో
ఆర్థిక ర్ట్స్ చానల్‌కి మార్చాడు. క్రికెట్లో ఆస్ట్రేలియా భారత జట్టుని చావబాది వదిలిపెడుతోంది! ఇక మన ఆటగాళ్లతో మ్యాచ్ ఫిక్సింగ్ రోజులు అయిపోయాయని అనుకున్నాడు అతీవ్.
యాష్ ట్రేలో సిగరెట్ ఆర్పి పడేస్తూ ఆర్థిక మంత్రి మీద విసుగు ప్రకటించాడు అతీవ్. దొంగవెధవ... బీడీ, సిగరెట్ల మీద టాక్సు పెంచుతాడు. కానీ స్కూటర్లూ, కార్లూ చవగ్గా దొరికేటట్లు బడ్జెట్ తయారు చేస్తాడు. అంటే కార్లు, స్కూటర్ల మీద సరదాగా తిరగండి... పెట్రోల్ తగలబెట్టండి... అనేగా వీడు చెప్పేది? కోక్ చవక. పిల్లలకి చిన్నప్పట్నుండే చేదు పానీయం అలవాటు చేస్తే ఏదో ఒకరోజు తాగడం మొదలు పెడతారుగా? సరదాలకి టాక్స్ తక్కువ, అవసరమైన వస్తువుల మీదే టాక్స్... పేదోళ్లు బీడీ కొనుక్కోవాలన్నా వీల్లేని పరిస్థితి! సిన్హా సిగరెట్ తాగడు. అతనికి ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసినాయన కూడా పొగ తాగడు... మరి ఆయన సర్దార్జీ మన్మోహన్ సింగ్ కద!? ఇది కాక చాలా మంది నాయకులకు వ్యవసాయమనే ముసుగు ఉంది. పై సంపాదనంతా వ్యవసాయంలో వచ్చిన సంపాదన కింద గప్‌చుప్‌గా కలిపేసుకుంటారు.
అతీవ్ బెంగాలీ బాబు. అతనికి కాబోయే భార్య అణిమ ఉత్తరప్రదేశ్‌కి చెందిన స్త్రీ. ఆమె సాంగత్యంలో తను అన్నీ హిందీలోనే ఆలోచిస్తున్నానని, మాట్లాడుతున్నానని హఠాత్తుగా అనిపించింది. ఇప్పుడు కూడా అతని ఆలోచనలు హిందీలోనే సాగుతున్నాయి!
కుర్తా తొడుక్కుని గదిలోంచి బైటికి రాగానే వదిన మొహంలో వంకర నవ్వు కనబడింది. ఆమె ఏదో అనే లోపలే వీధిగుమ్మం తెరుచుకుని బైటికొచ్చేశాడు. కిళ్లీ కొట్లో సిగరెట్ కొంటుంటే షాపతను ధర పెరిగిందన్నాడు. అతనికి అప్పుడే బడ్జెట్ గురించి తెలిసిపోయింది. కొంత దూరం నడిచి ఇంకో కొట్లో ఫ్రూటీ కొన్నాడు. ఆ దుకాణం ఓనరుకు బడ్జెట్ గురించి తెలిసినట్లు లేదు. ధర తగ్గించలేదు.
అతీవ్ గడియారం వైపు చూశాడు. ఒకటింబావు. అణిమ క్లాసు మూడు గంటలకి గానీ అవదు. అతను బస్సెక్కి రెండు గంటలకల్లా చౌరంగీ చేరుకున్నాడు. ఫుట్‌పాత్ మీద నడుస్తూ కాసేపు విండో షాపింగ్ చేశాడు. లైట్ల వెలుగులో ప్రతి వస్తువూ ఉన్నదాని కన్నా అందంగా కనిపిస్తోంది. ప్రతి దుకాణంలోనూ సేల్ బోర్డ్‌లు వేలాడుతున్నాయి. ఎన్నో అధునాతనమైన వస్తువులు తక్కువ ధరకి అమ్ముడుపోయేందుకు ఆత్ర పడుతున్నాయి.
అతీవ్‌కి దిగులనిపించింది. గుమస్తా పని చేసే అతని మనసు రకరకాల ఆలోచనల్లో చిక్కుకుపోయింది. కొన్ని లక్షల కేసులు కోర్టుల్లో దశాబ్దాల నుండి దేకుతున్నాయి. జడ్జిల సంఖ్య వందో రెండు వందలో పెంచితే ప్రభుత్వానికి పెద్ద నష్టమేమీ ఉండదు. వాహనాల మీద డ్యూటీ తగ్గించకపోయి ఉంటే కొన్ని వేల మందికి ఈ ఇబ్బందులు తప్పేవి. సాఫ్ట్ డ్రింకుల మీద టాక్స్ తగ్గించే బదులు మందుల ధర తగ్గిస్తే రోగులు కోలుకుని పనిలోకి వెళ్తారు. అణిమ ఎప్పుడూ అంటుంది 'నీకు ఫైల్స్ తప్ప మరేదీ అర్థం కాదు. గ్లోబలైజేషన్ అనేది కొండచిలువ లాంటిది. అది ఊపిరి వదిల్తే చుట్టుపక్కల ఉన్నవన్నీ దాని విషప్రభావానికి గురవుతాయి. ఇక ఊపిరి పీల్చిందంటే దగ్గర్లో ఉన్నవన్నీ దాని పొట్టలోకే చేరిపోతాయి' అని.
ఆర్థికశాస్త్రం బోధించేందుకు మహిళా లెక్చరర్లు తక్కువగా ఉండడంతో దళితురాలు అణిమకి కాలేజీలో ఉద్యోగం వచ్చింది. కానీ అతీవ్ ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటే అతని తల్లిదండ్రులు ఇంట్లోనుండి వెళ్లగొడతామన్నారు. అంతేకాదు, మర్యాదస్తులుండే కాలనీలో అద్దెకి ఇల్లు కూడా దొరకలేదు.
హేంగర్లు అమ్మే కుర్రాడు వచ్చి అతీవ్ ఆలోచనలకి భంగం కలిగించాడు. అతను మళ్లీ గడియారం కేసి చూశాడు. ఇంకా రెండున్నరే అయింది. అణిమ రెస్టారెంట్‌కి చేరుకునేసరికి మూడుంబావు అవుతుంది. పేవ్మెంట్ మీద వార్తాపత్రికలమ్మే కుర్రాడి దగ్గర అతీవ్ ఈవినింగ్ న్యూస్ కొన్నాడు. అప్పుడే ఆర్థిక మంత్రి ఉపన్యాసం వార్తల్లోకి ఎక్కింది. వార్తాపత్రికలు ఎంత వేగంగా పని చేస్తున్నాయో! అనుకున్నాడు. మార్కెట్వాద ప్రభావం మరి! కానీ ఎకనమిక్స్ లెక్చరర్ అణిమ మార్కెట్ కొన్ని షరతుల సాయంతో పని చేస్తుంటుంది. అది ఏ దేశంలోనైనా సరే ప్రభుత్వం అదుపాజ్ఞల్లో ఉండదట... సరిగ్గా పెట్టుబడిదారీ విధానం లాగే. ఒక పక్క అది గుళ్లూ గోపురాలూ కట్టిస్తుంది. మరోపక్క మద్యం ఫ్యాక్టరీలని, కాంట్రాక్టులనీ నిర్వహిస్తుంది. అయినా ఈ ఆడవాళ్లకి మద్యం అంటే అంత రోత ఎందుకో? కాస్త వాసన తగిలితే చాలు, విడాకుల దాకా వెళ్లిపోతారు! కానీ ప్రభుత్వం తాలూకు ఆర్థిక వ్యూహం మొత్తం లిక్కర్ - ఎక్సైజ్ మీదే ఆధారపడి నడుస్తోందాయె!
అతీవ్ వెనక్కి తిరిగి రెస్టారెంట్ వైపు నడక సాగించాడు. అక్కడ కూర్చుని తాపీగా వార్తా పత్రిక చదువుకుందామనుకున్నాడు. ఇంతలో అణిమ వేగంగా నడుచుకుంటూ రావడం కనిపించింది. 'అప్పుడే ఎలా వచ్చేసింది?' అనుకున్నాడు కొంచెం ఆశ్చర్యపోతూ.
''పావుగంట ముందే ఊడిపడ్డావే?'' అన్నాడు.
''ఏమిటా భాష? సరిగ్గా మాట్లాడడం చేతకాదా?'' అంది చిరుకోపం ప్రదర్శిస్తూ.
''అది కాదు. ఇంత త్వరగా ఎలా వచ్చావు?''
''అది నీకు చెప్పినా అర్థం కాదులే. కేంద్ర ప్రభుత్వం భారతీయత ప్రదర్శిస్తోంది! సాయంత్రం ఐదు గంటలకి బడ్జెట్ ఏంటో చెప్పడం బ్రిటీష్ వాళ్ల పద్ధతి. ఇప్పుడు జ్యోతిష్యుణ్ని పిలిపించి, ఉదయం పదకొండు గంటలకి మంచి ముహూర్తం నిర్ణయించారు. అందుకని ఇన్‌కంటాక్స్ సమస్యల్లో మునిగిన సగం మంది లెక్చరర్లు చెక్కేశారు. మూడొంతుల మంది స్టూడెంట్స్ రానేలేదు! ఒక్కోక్లాసులో నలుగురైదుగురి కన్నా లేరు. మిగతావాళ్లేరని అడిగితే 'ఇవాళ బడ్జెట్ ఉంది కదా మేడమ్!' అన్నారు. ఒకమ్మాయిని మరి నువ్వు మాత్రం ఎందుకొచ్చావని అడిగితే 'ఈ రోజు నాన్న ఇంటిదగ్గరే ఉన్నాడు. ఆయన ఇంట్లో ఉంటే అమ్మతో ఎప్పుడూ వాదిస్తూనో, పోట్లాడుతూనో ఉంటాడు. ఇక్కడైతే ప్రశాంతంగా ఉండొచ్చని వచ్చా. సాయంత్రాలు ఎలాగూ తప్పదు!' అంది విచారంగా. అసలు ఇవాళ నిన్ను కలిసేందుకు రాకూడదనే అనుకున్నాను. కానీ ఫోన్ చేస్తే మీ అమ్మ ఎత్తుతుంది. నా గొంతు వింటేనే ఆవిడ మళ్లీ స్నానం చెయ్యాల్సి వస్తుందని మానేశాను! మాట ఇచ్చి రాకపోతే నీకు కోపం వస్తుందాయె. అసలు ఇప్పుడే నీకు విసుగు మొహం పడింది'' అంది.
''అది టీ తాగగానే మామూలైపోతుందిలే రాణిగారూ!''
''రాణి గారేమిటి? అంట్లు తోముకునేది అను. రోడ్లూడ్చేది అను. మా ముత్తవ్వ ఎస్ల్పెనేడ్లో రోడ్లూడ్చే పని చేసేదట. మా తాత బిల్డింగ్ మెటీరియల్ అమ్మేవాడు. గాంధీ టోపీలతో ఎన్నో పరిచయాలుండేవి. మా నాన్న ఎమ్.ఎ చేసి సేనిటరీ ఫిట్టింగ్స్ అమ్మే వ్యాపారంలో బాగా సంపాదించాడు. పెద్ద మేడ కట్టుకున్నా ఉండేది మాత్రం మా కులంవాళ్లుండే పేటలోనే!''
''సరే. చరిత్ర పాఠాలు చెప్పడం అయిపోతే లోపలికెళ్లి కూర్చుందామా మేడమ్?''
లోపల కూర్చున్నాక అణిమ ఆర్డరిచ్చింది. ''రెండు ప్లేట్లు ప్యాట్టీస్, ఒక కోక్, ఒక టీ''
''నీకు కోక్, నాకు మాత్రం టీ ఎందుకు చెప్పావ్?''
''ఎండాకాలం టీ చల్లబరుస్తుంది. పైగా నీకు అదే పడుతుంది''
''కోక్ ధర తగ్గింది!''
''ఏప్రిల్ ఫస్ట్ నుండి వస్తువుల ధరలు పెంచదలచుకుంటే వాటిని బడ్జెట్‌కి ముందే పెంచేస్తారు. కానీ తగ్గేవి మాత్రం ఫూల్స్ డే నుండే తగ్గుతాయి''
''నాతో సహవాసం చేసి నువ్వు బాగా తెలివితేటల్ని సంపాదించుకున్నావు!''
''పిచ్చి వాగుడు మాని, త్వరగా తిను. తారకేశ్వర్‌లో 'తాజ్ మహల్' చూడాలి''
''భాష గురించి నాకు చెప్పావు. మరి నీ భాష ఎలా ఉంది?''
అణిమ నవ్వేసింది. ఇద్దరూ లేచి బైటికొచ్చారు.
''తారకేశ్వర్‌లో ఆ ఇల్లెక్కడుంది?'' అంది అణిమ.
''ముందు మనం మా ఆఫీస్ ప్యూన్ అసీమ్ మండల్ ఇంటికెళ్లాలి. అతనే చెప్తాడు''
తారకేశ్వర్ చేరుకుని ఒక ఇంటి ముందాగి అతీవ్ బెల్ కొట్టాడు. ఒక మధ్యవయస్కురాలు తలుపు తెరిచింది. ఆవిడే అసీమ్ భార్య అనుకుని అణిమ నమస్కారం చేసింది. అతీవ్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
''ఇదేదో ప్యూను ఇల్లులాగ లేదు. ధనికుల మేడ లాగుంది!'' అంది అణిమ.
ఆమె వాళ్లని లోపలికి రమ్మని ఆహ్వానించింది. లోపల ఒక పెద్ద గదిలో అసీమ్ పడుకుని ఉన్నాడు. అతీవ్ని చూడగానే హడావుడి పడుతూ లేచి నిలబడ్డాడు. ''మీరా సార్! ఈవిడ.. అణిమ గారు కదూ? అర్థమైంది సార్! '' అన్నాడు.
ఇద్దర్నీ కూర్చోమని చెప్పి భార్యని కేకేశాడు. ''అరె, మధుమాలతీ! ఆఫీసులో పనిచేసే సారు వచ్చారు. స్వీట్లు అవీ పంపించు!'' జ్వరం తగిలి ఆఫీసుకు రాలేదని అతీవ్‌కి చెప్పాడు.
ఒక ప్యూను ఇంత గొప్ప హోదాలో బతకడం చూసి నోరెళ్లబెట్టింది అణిమ. అప్పుడే పని మనిషి చేతిలో రసగుల్లాల ట్రేతో బాటు మధుమాలతి అక్కడికి వచ్చింది. ఆమెని చూసి అణిమ అవాక్కయింది. ''ఎంత అందంగా ఉంది!'' అనుకుంది.
అతీవ్ ఇంటి విషయం అసీమ్‌ని అడిగాడు. ''స్టేషన్ నుండి కుడివైపుకి వెళ్తే ఐదో ఇల్లో, ఆరో ఇల్లో సార్. మొదటి అంతస్తులో రెండు గదులు, వంటిల్లు, డాబా. అద్దె పన్నెండొందలు. కరెంటు బిల్లు మీరే కట్టుకోవాలి'' అన్నాడు అసీమ్.
''చూడ్డం వీలవుతుందా?''
''అదే ముఖ్యం కద సార్. నచ్చితేనే అడ్వాన్స్ ఇచ్చేది?''
''మళ్లీ కులం ప్రసక్తి రాదు కదా? నువ్వు ముందుగా చెప్పావా?''
''మీరు మాత్రం ఎందుకు చెప్పడం? మీ కులమే అణిమ గారిది!''
''లేదు భారు. నాకు దాచిపెట్టడం ఇష్టంలేదు!'' అంది అణిమ.
''అవన్నీ వదిలేయండి మేడం! ముఖర్జీ ఇవాళ పెద్ద సేఠ్‌గా చెలామణి అవుతున్నాడు. కానీ అతని చరిత్ర నాకు బాగా తెలుసు. దొంగ వ్యాపారం చేసి నాలుగేళ్లు లోపల కూడా ఉండి శిక్ష అనుభవించి వచ్చాడు. కొడుకు తన కుటుంబంతో స్టేట్స్‌కి వెళ్లాడు. ఇప్పుడు అద్దెకివ్వాలని చూస్తున్నాడు. ఎందుకంటే అతనికి గుండె జబ్బు. నేను కూడా దళితుణ్ణే. కానీ నా ముందు ఎంతమంది డబ్బున్న ఆసాములు చేతులు కట్టుకుని నిలబడతారో తెలుసా? ఆ తర్వాత హుగ్లీలో మూడు సార్లు మునుగుతారనేది వేరే విషయం. నా చేత శివలింగానికి అభిషేకం చేయించేందుకు తారకేశ్వర్ పూజారుల్లో గొప్ప పోటీ ఉంటుంది ఏమనుకుంటున్నారో! ఎందుకంటే పూజ చేయించినందుకు కొత్త వంద రూపాయల నోటు ఇస్తాను'' అన్నాడు అసీమ్.
ఇద్దరూ అక్కడ్నుండి బైట పడ్డారు. ముఖర్జీ ఇల్లు వెతుక్కుంటూ బయల్దేరారు.
ముఖర్జీ మోశారు ఇల్లు బైటినుండి చూడ్డానికి చాలా బాగుంది. ముఖర్జీ తలుపు తెరిచి ఇద్దర్నీ లోపలికి రమ్మన్నాడు. ''ఒక సంగతి ముందే చెప్తే మంచిదనుకుంటాను, ముఖర్జీగారూ! అది విన్న తర్వాత లోపలికి రమ్మంటే వస్తాం'' అన్నాడు అతీవ్.
''చెప్పండి!'' అన్నాడు ముఖర్జీ కొంచెం ఆశ్చర్యపోతూ.
''నా పేరు అతీవ్ బోస్. ఈమె అణిమ... బీహారీ హరిజనురాలు. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం. అందుకే అద్దెకి ఇల్లు కావాలి. మరి మీరు మాకు ఇల్లు అద్దెకిస్తారా?''
ముఖర్జీ మొహం అసహ్యంగా పెట్టాడు. అతని మొహం అడవిపంది మొహంలా క్రూరంగా మారిపోయింది. ''అసీమ్ మీరు బోసులని చెప్పాడే మరి?'' అంటూ పక్కనే ఉన్న పెళ్లాం వైపు చూశాడు. హరిజన్ అన్న మాట విన్నప్పుడే ఆవిడ మొహం తిప్పేసింది!
ఇద్దరూ స్టేషన్‌కెళ్లి హౌరా వెళ్లే రైలు ఎక్కారు. ''ప్యూన్ పని చేసుకునే అసీమ్ ఎంత వైభవంగా బతుకుతున్నాడు!'' అంది అణిమ. ఆమె మొహంలో ఇల్లు దొరకలేదన్న బాధ ఏమాత్రం కనిపించలేదు. అన్ని చోట్లా 'నో' అనే మాట వినడం అలవాటైపోయిందామెకి.
''అవును. మొదట్లో రైడ్స్ చేసే ఆఫీసర్ల వెంట ఉండేవాడు. కానీ ఆ సేఠ్కీ, కాంట్రాక్టర్లకీ అసీమ్ ముందుగా హెచ్చరిక చేసేవాడు. దానికి బదులుగా నోట్ల కట్టలు సంపాదించుకునేవాడు. తర్వాత తన వడ్డీ వ్యాపారం మొదలు పెట్టాడు. ఇతని దగ్గర పెద్ద పెద్ద కంపెనీలు షార్ట్ టర్మ్ అప్పులు తీసుకుంటాయి.
''మరి అతని సంపాదన మీద రైడ్స్ జరగవా? మీ ఇన్ కమ్ టాక్స్ పనితీరు ఇదేనా?''
''అరే. ఎవరైనా కంప్లైంట్ చేస్తే కదా? కమిషనర్ దగ్గర్నుండి అందరూ ఇతనికి రుణపడి ఉంటారాయె!'' అన్నాడు అతీవ్.
స్టేషన్ నుండి బైటికొచ్చి టాక్సీ ఎక్కడానికి బదులు ఇద్దరూ స్టీమర్ ఎక్కారు. ఇద్దరి మొహాల్లోనూ దిగులన్నది లేదు... ఇల్లు దొరకదని వాళ్లకి ముందే తెలుసు! స్టీమర్లో గోలగోలగా ఉంది. అందరూ బడ్జెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. అతీవ్ పేపర్ చదువుదామని తీశాడు.
''కాస్త వార్తలు చూసి చెప్పు అతీవ్! ఆర్థికమంత్రి దళితులకి టాక్స్ లేదని ఎక్కడైనా ప్రకటించాడేమో?'' అంది అణిమ వెటకారంగా.
''అలా ఎందుకు ప్రకటిస్తాడు?'' అన్నాడు అతీవ్ నవ్వుతూ.
''పాపులర్ అయ్యేందుకు! ఒక్క యూపీ ఏమిటి? బెంగాల్లో కూడా అప్పుడు బీజేపీ వచ్చేస్తుంది!''
''కానీ అప్పుడు కూడా మన ఇంటి సమస్య అలాగే ఉంటుంది కదా?'' అన్నాడు అతీవ్ భుజాలు ఎగరేస్తూ.
అణిమ నవ్వి ''ఇంద్రుడి వజ్రఘాతానికి భయపడి నన్ను మీ స్వర్గంలోకి తీసుకెళ్లలేకపోతే, మరో మార్గం ఉంది. నువ్వే మా లోకంలోకి రా. మా లోకం నిన్ను తరిమి కొట్టదు. స్వాగతం పలుకుతుంది!'' అంది.
అతీవ్ ఆలోచనలో పడ్డాడు. మరుక్షణం తలాడిస్తూ ''రియల్లీ. యూ ఆర్ ఇన్టెలిజెంట్!'' అన్నాడు.
అణిమా, అతీవ్‌కి సంబంధించినంత వరకూ పొద్దున ప్రకటించిన బడ్జెట్‌కి అర్థం లేకుండా పోయింది. బడ్జెట్ అనుమతించినా... పెద్ద మనుషులుండే కాలనీల్లో వాళ్లకి ఇల్లు దొరకడం అసంభవమని తేలిపోయింది!
హిందీమూలం : విజరు
అనువాదం : ఆర్.శాంతసుందరి