Thursday, October 31, 2013



కాలిబాటైనా మేలే కదా!

Published at: 18-10-2013 07:10 AM
 New  0  0 
 
 

ఒక భాషలోని సాహిత్యాన్ని మరో భాషలోకి మార్చడం అంటే ఒక రకంగా ఏకకాలంలో రెండు జీవితాల్ని జీవించడమే. అందుకే ఒరిజినల్ రచనలు చేయడం కన్నా, అనువాద రచనలు చేయడమే కష్టం అంటూ ఉంటారు. అంతటి కష్టతరమైన ఆ ప్రక్రియలోకి ప్రవేశించి అనువాద సాహిత్య వారధిగా పేరు తెచ్చుకున్న వారు ఆర్. శాంతసుందరి. చలంగారి తమ్ముడి మనుమరాలిగా, కొడవటిగంటి కుటుంబరావు కూతురుగానే కాకుండా, 60కి పైగా వెలువరించిన అనువాద పుస్తకాల రచయిత్రిగా కూడా సాహిత్య లోకానికి ఆమె సుపరిచితం. ఇప్పటి వరకు, జాతీయ మానవ హక్కుల కమిషన్ అవార్డ్, భారతీయ అనువాద పరిషత్ పురస్కారాలతో పాటు, తెలుగు విశ్వవిద్యాలయ ఉత్తమ అనువాదకురాలి బహుమతిని కూడా ఆమె అందుకున్నారు. శాంత సుందరి జీవన ప్రస్థానంలోని కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.
నేను అనువాదకురాలినవుతానని ఏనాడూ అనుకోలేదు. మద్రాసులో పుట్టి పెరిగిన నేను హిందీలో ఉన్నత విద్యను అభ్యసిస్తానని కూడా ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి నాకు బోటనీ అంటే అభిమానం. అయితే, పీయూసీ పరీక్షల ముందు నెలరోజులు జబ్బు పడటంతో కెమిస్ట్రీలో ఐదు మార్కులు తగ్గాయి. ఆ ఒక్క సబ్జెక్టు కోసం సప్లిమెంటరీ రాయాల్సి వచ్చింది. నాకు బాటనీ, జువాలజీలలో అత్యధిక మార్కులు వచ్చినా కెమిస్ట్రీ సప్లిమెంటరీలో పాసైన కారణంగా మద్రాసులో నాకెక్కడా బీఎస్‌సిలో సీటు రాలేదు. బాటనీతో డిగ్రీ చేయలేకపోతున్నానే అని దాదాపు మూడు మాసాలు ఏడుస్తూ ఉండిపోయా. మా నాన్నకేమో తన పరిచయాలు వాడుకోవడం ఇష్టం లేదు. ఆ పరిస్థితుల్లో బీఏలో హిందీ సాహిత్యం తీసుకున్నాను. అప్పటిదాకా హిందీలో నాకు తెలిసింది సినిమా పాటలే. అయినా హిందీ మీద ఇష్టం పెంచుకుని బాగా చదివాను. ఎంత బాగా అంటే బీఏలో ఉన్నప్పుడు యూజీసీ నిర్వహించిన హిందీ వ్యాస రచనల పోటీలో నాకు ప్రధమ బహుమతి వచ్చింది. ఆ సందర్భంగా నేను ఢిల్లీ వెళ్లినప్పుడు సుప్రసిద్ధ కవి హరివంశ్‌రాయ్ బచ్చన్ గారిని కలుసుకునే అవకాశం కలిగింది. ఆయనెంతో ఆప్యాయంగా నాతో ఎన్నో విషయాలు మాట్లాడారు. మద్రాసు తిరిగొచ్చాక ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ హిందీలో ఒక పెద్ద ఉత్తరం రాశాను. దానికి బచ్చన్ గారు వెంటనే ప్రత్యుత్తరం రాస్తూ 'మీ హిందీ భాషలో మంచి సౌందర్యం, చక్కని లయ ఉన్నాయి. మీరు హిందీలోంచి తెలుగులోకి, తెలుగులోంచి హిందీలోకి అనువాదాలు చేస్తే బావుంటుంది' అని రాశారు. అలా ఆయన నాలో నాటిన విత్తనం, నా లోని అవ్యక్త శక్తిని బహిర్గతం అయ్యేలా చేసింది. దశాబ్దాల పర్యంతం అనువాద ప్రక్రియలో ఉండిపోయేలా చేసింది. అనువాదాలు చెయ్యమంటూ నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఇచ్చిన తొలి ఆఫర్‌తో మొదలైన ఆ పరంపర 60కి పైగా అనువాద పుస్తకాలు వెలువరించడానికి మూలమయ్యింది. మన మార్గాలు అన్ని సార్లూ ముందే అనుకున్నవేమీ కాకపోవచ్చు. అయినా మనసు పెడితే, మధ్యలో మొదలైన ప్రయాణాలు కూడా తీరాన్ని చేరుస్తాయని నాకనిపిస్తుంది.
ఎదురీత ఎప్పుడూ తప్పదు
మనసులో ముందే విషం పెట్టుకున్న వారు, మనుషుల పట్ల ఎంత అమానుషంగా ఉంటారో నాకు చాలా సార్లు అనుభవంలోకి వచ్చింది. హిందీ టీచర్లు కావడానికి హిందీ మాతృభాషగా ఉన్న వాళ్లే కావాలంటే ఎలా? ఎం.ఏ. చెయ్యడానికి ఢిల్లీలోని మిరండా హౌస్‌కి వెళ్లినప్పుడు బీఏలో ఫస్ట్‌క్లాస్ మార్కులు వచ్చిన నాకు సీటు ఇవ్వక తప్పదని తెలిసి కూడా హిందీ విభాగం అధిపతి " నీకు హిందీ మాట్లాడటం వచ్చా?'' అంటూ అవహేళన చేస్తూ మాట్లాడింది. క్లాసులో ఎప్పుడు ఏ సందేహం అడిగినా వెంటనే తాను రాసిన పిహెచ్.డి థీసిస్ లైబ్రరీలో ఉంది, వెళ్లి చదువుకో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడేది. చివరికి.. కేవలం రెండు క్లాసుల అటెండెన్స్ తక్కువ ఉందన్న కారణం చూపుతూ ఫైనల్ పరీక్షల హాల్‌టికెట్ ఇవ్వకుండా ఆపేసింది. హాల్ టికెట్ రాబట్టుకోవడానికి దుర్గాబాయ్ దే శ్‌ముఖ్ సాయం తీసుకోవలసి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్న 40 ఏళ్ల కాలంలో మా హిందీ హెడ్‌లాంటి వారు ఇంకొంత మంది కూడా తటస్థపడ్డారు. అర్థం లేని కారణాలతో గుండెను గాయం చేస్తూ ఉండిపోయారు. వాటన్నిటినీ మొండిగా తట్టుకోవలసి వచ్చింది. మన పురోగతి అనేది కేవలం మనం ఎంచుకున్న లక్ష్యం కోసం శ్రమించడంతోనే అయిపోదు. ఆ మార్గంలో అకారణంగా అడ్డుపడే వారిని కూడా అధిగమించాల్సి ఉంటుందన్న నిజాన్ని నాకీ ఉదంతాలు నేర్పాయి.
ఆత్మను పట్టుకోలేదని...
నాన్నగారు రాసిన' చదువు' అనే పుస్తకం ఆంగ్ల అనువాదం అప్పటికే వచ్చేసింది. హిందీలోకి అనువదిస్తానని సాహిత్య అకాడమీ వారిని నేనే అడిగాను. వారు అప్పటిదాకా నేను చేసిన అనువాదాలన్నీ పరిశీలించి, ఆ పుస్తకాన్ని అనువదించడానికి అంగీకరించారు. 'పడాయి' అన్నపేరుతో అనువదించాను. ఒక ప్రముఖ హిందీ రచయితకు ఆ స్క్రిప్టు చూపించి ఆయన సూచించిన మార్పులన్నీ చేసి సాహిత్య అకాడమీ వారికి అందజేశాను. ప్రతి భాషకు సంబంధించి ఎక్స్‌పర్ట్ ఒకరు ఆ స్క్రిప్టును పరిశీలిస్తారు. ఏవైనా కొద్దిపాటి సవరణలు ఉంటే వాటిని సూచించి ప్రచురణకు ఆమోదం తెలుపుతారు. నా పుస్తకాన్ని చూసిన ఎక్స్‌పర్ట్ మాత్రం ప్రతి వాక్యం కిందా ఒక స్కూలు టీచర్‌లా అండర్‌లైన్ చేసి, నేను రాసినవి సరైనవే అయినా వాటికి తప్పుడు సవరణలు చేసి, ఈ అనువాదకురాలు రచయిత ఆత్మను పట్టుకోలేదు. అందువల్ల ఈ పుస్తకం యధాతథంగా ప్రచురణకు పనికి రాదంటూ రాశారు. ఆ ఎక్స్‌పర్ట్‌కి తనది తప్ప ఎవరి అనువాదమూ నచ్చదని ఆ తర్వాత తెలిసింది నాకు. తెలుగు వాళ్లలో మంచి అనువాదకులే లేరని ఆయన తన వ్యాసాల్లో ఎన్నోసార్లు రాసిన విషయం బయటపడింది. ఆయన కారణంగా 2007లో ఇచ్చిన స్క్రిప్టును దాదాపు ఆరేళ్ల దాకా నానుస్తూనే ఉండిపోయారు. చివరికి 2012లో అది పుస్తకంగా వ చ్చింది. వాస్తవానికి నాన్నగారి శతజయంతి సందర్భంగా పుస్తకాన్ని విడుదల చేయాలని ఎంతగానో అనుకున్నాం. కానీ, ఆ తేదీ అయిపోయాకే పుస్తకం వచ్చింది. ఏమైనా ఆ రోజునుంచి ప్రభుత్వ సంస్థలకు అనువాదం చెయ్యటం మానేశాను. అంతే కాదు. అప్పట్నించి ఏ పబ్లిషరైనా నా అనువాదాన్ని మరొకరికి చూపించాక ప్రచురిస్తానంటే నేను అస్సలు అనుమతించను. ఇది ఆత్మగౌరవానికి సంబంధించినదే తప్ప నా అహంభావం కాదు. ఎవరైనా తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోలేకపోతే వాళ్లు తమ జీవితంలో కూడా నిలబడలేరని నేను బలంగా నమ్ముతాను.
అది ఎంత పతనం!
ఒక మిత్రుని ఒత్తిడి కారణంగా పవర్ రంగంలో అత్యున్నత స్థానంలో పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి ఇంగ్లీషులో రాసిన పుస్తకాన్ని హిందీలోకి అనువదించాల్సి వచ్చింది. ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన అనేక సాంకేతిక పదాలు అందులో ఉన్నాయి. కథనో, సాధారణ వ్యాసాన్నో వేరే భాషలోకి మార్చడమంత సులువైన పనికాదు ఒక సాంకేతిక పుస్తకాన్ని అనువదించడం! అయినా ఎంతో కష్టపడి పూర్తిచేసిన ఆ పుస్తకం మీద అనువాదకురాలిగా నా పేరు వేయలేదు. ఆయనకు అసలు హిందీ భాషే రాదు. అయినా పుస్తకం మీద తన పేరే వేయించుకుని, ముందుమాటలో మాత్రం ఒకే ఒక్య వాక్యంలో నా సహాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే మ్యాక్మిలన్ ప్రచురణ సంస్థ కూడా నేను శివ్‌ఖేరా గారి ఇంగ్లీషు పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే మొదట్లో అనువాదకురాలిగా నా పేరు చూపించి, ఆరో ముద్రణలో నా పేరు వేయలేదు. అనువాదకులకు కాపీరైట్ ఒక ఇంటెలెక్చువల్ రైట్ లాంటిదని రాశాను. ఆ తరువాతి ముద్రణలో తమ తప్పు దిద్దుకున్నారు. తమ తప్పును ఎదుటి వారు ఎత్తిచూపే దాకా సరిదిద్దుకోకపోవడం అంటే అది ఎంత పతనమైపోవడమో గుర్తించరెందుకని? ఇది నాలో పలుమార్లు రగులుతూ ఉండిపోయే ప్రశ్న. దీనికి ఎప్పటికి సమాధానం దొరుకుతుందో చూడాలి మరి! ఎన్ని గాయాలైనా ఈ అనువాద ప్రక్రియలో ఎంతో ఆనందం ఉంది. ఎన్నో లోతైన అనుభూతులు ఉన్నాయి. ఎన్. గోపి గారు అన్నట్లు రక్తసంబంధాల కన్నా అక్షర సంబంధాలే మరింత గ ట్టివని నేను మనస్పూర్తిగా అనుకుంటాను.
రెండు భాషల సంవాదం
తెలుగు గ్రంథాల పట్ల ఉత్తరాది వారికి చిన్న చూపు ఉంది. హిందీ రచనలు తెలుగులోకి వస్తాయే గానీ, మన రచనలు హిందీలోకి అంతగా వె ళ్లవు. ఇందులో ఉత్తరాది వారి బాధ్యతారాహిత్యమే కాదు. తెలుగు భాషకు సంబంధించిన కమిటీ సభ్యులు పట్టించుకోకపోవడం కూడా కారణమే. ఎందుకో గానీ అనువాదాల పైనా, అనువాదకుల పైనా జనానికి చిన్నచూపు ఉంది. నిజానికి అనువాదం ఒక కళ. అది ఎంతో బాధ్యతాయుతమైనది. భారమైనది కూడా. అనువాదం చేస్తున్న సమయంలో గుండెలో రెండు భాషల సంవాదం సాగుతున్నట్లుగా ఉంటుంది. అనువాద రచనలు పాఠకుల దృక్పథాన్నే కాదు, రచయితల దృక్పథాన్ని కూడా విశాలం చేస్తాయి. అలాంటి ప్రక్రియను కొందరు తక్కువ చేసి మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మా నాన్నలా సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించే శక్తి నాకు లేకపోవచ్చు. కానీ, ఒక అనువాదకురాలిగా ఉత్తమ సాహిత్యాన్ని అనువదించడానికే నేను ప్రయత్నిస్తాను. అందరూ రాజమార్గం కాలేకపోవచ్చు కానీ, కాలిబాట కావడం కూడా విశేషమే కదా!
గడ్డకట్టిన విషాదం
వాకపల్లిలో గిరిజన మహిళల మీద గ్రేహౌండ్స్ వారు జరిపిన అత్యాచార ఉదంతం తర్వాత... నేను, మరికొందరం అక్కడికి వెళ్లాం. నక్సల్స్‌కు వాళ్లు ఆశ్రయమిస్తున్నారన్న కారణం కావచ్చు. బాక్సైట్ కోసం గిరిజనులను ఆ ప్రదేశం నుంచి తరిమేసే ఉద్దేశమే కావచ్చు. గ్రేహౌండ్స్ వాళ్లు ఆ మహిళల్ని బలి తీసుకున్నారు. ఏదైనా విషాదానికి గురైన వారు ఏడ్చేస్తున్నప్పటి కన్నా, ఆ ఏడ్చే స్థితి కూడా కోల్పోయి.. రాయిలా మారిపోవడమే మన గుండెల్ని ఎక్కువగా పిండేస్తుంది. వాకపల్లిలో నేను అలాంటి పరిస్థితినే చూశాను. వాళ్లను చూస్తుంటే విషాదంతో గడ్డకట్టుకుపోయారేమో అనిపించింది. అంతులేని ధైన్యమే తప్ప వాళ్ల కళ్లలో నీళ్లు లేవు. అది చూసిన నేను ఆ రోజంతా ఏడుస్తూ ఉండిపోయాను. వాళ్ల ప్రమేయం లేకుండా జరిగిపోయిన దారుణానికి వాళ్ల భర్తలు వాళ్లను ఇంట్లోంచి గెంటేశారు. వాళ్ల సమాజం వాళ్లను వెలేసింది. స్వతంత్రంగా ఇల్లు క ట్టుకునే శక్తి లేక ఏ చెట్లకిందో, కూలిన గోడల కిందో కూర్చుని గడపాల్సిన స్థితి. వాళ్లందరికీ అటుఇటుగా 20 ఏళ్లు ఉంటాయేమో. వాళ్ల మిగతా జీవితమంతా ఎలా గడవాలి? ఎంతో మంది అధికారులు వచ్చారు, వెళ్లారు. కానీ, ఎవరూ ఏమీ చేసింది లేదు. ఆ మాటే చెబుతూ, అందులో ఒక గిరిజన మహిళ వాళ్ల భాషలో 'భూమి ఏడుస్తుంటే, ఆకాశమేమీ జవాబు చెప్పడం లేదు' అనే అర్థంలో ఒక మాట అంది. ఆ మాట విని నేను చాలాసేపటి దాకా అలా చూస్తూ ఉండిపోయాను. అవి కవిత్వంలా ఉన్నాయా? మరోలా ఉన్నాయా? అన్నది కాదు. ఆ మాటలు వాళ్ల గుండెల్లోని సముద్రమంత దుఃఖానికి అద్దం పడుతున్నట్లు అనిపించింది. మన కళ్లముందు కంటతడి పెట్టుకుంటున్న వాళ్లను చూసి ఏదో ఒక రీతిన స్పందించ గలుగుతాం. కానీ, దుఃఖంతో గడ్డకుట్టుకుపోయిన వాళ్లను చూసి ఎంతమంది స్పందిస్తారు? కానీ, కన్నీటి విషాదాలతో సరిసమానంగా క న్నీళ్లు రాని విషాదాల్ని కూడా గుర్తించగలిగే స్థితికి ప్రతి మనిషీ రావాలేమో అనిపించింది.
ం బమ్మెర
ఫోటోలు: మునవ్వర్

 


మర్చిపోకుండా
పూర్వం వయోవృద్ధులు మాత్రమే మతిమరపుతో ఇబ్బంది పడేవారు. కాని ఇప్పుడు పిల్లలు, పెద్దలు అందరూ '...
ఆర్థికమంతా అతివల చేతుల్లోనే
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య బాధ్యతలు స్వీకరించడంతో - మన...

Friday, August 2, 2013



you are viewing books of Santa Sundari
There are 1 Available Books by the AuthorSanta Sundari
Title: Atyuttamamaina Kanuka
Subject: NOVELS 
Year of Publication: 2013 
Price: USD $ 3.06 



Prices of the books shown do not include shipping and handling cost.
There is no obvious relation between a book price and its S&H cost.
The S&H cost purely depends on the weight of the book.
This in turn, depends on the size and the number of pages of the book.
To know more about our S&H costs click here. 


you are viewing books of Santa Sundari
There are 1 Available Books by the AuthorSanta Sundari
Title: Atyuttamamaina Kanuka
Subject: NOVELS 
Year of Publication: 2013 
Price: USD $ 3.06 



Prices of the books shown do not include shipping and handling cost.
There is no obvious relation between a book price and its S&H cost.
The S&H cost purely depends on the weight of the book.
This in turn, depends on the size and the number of pages of the book.
To know more about our S&H costs click here. 

Thursday, February 7, 2013


పండుటాకులు
----------                                          మూలం: సుధా అరోరా హిందీ రచన
                                                    అనువాదం : ఆర్.శాంతసుందరి


టప్...టప్... ఇంకొక పండుటాకు కింద పడింది. వెంట వెంటనే మరికొన్ని పడ్డాయి. జనవరి నెల తెల్లారగట్ల సూర్యుడు తూర్పు దిక్కున ఎర్రగా ఉదయిస్తున్నాడు. పచ్చని చెట్లకిందా, తనంత ఎత్తే ఉన్న మొక్కలకూ ఉన్న పండుటాకుల్ని ఆవిడ వేళ్ళు చురుగ్గా  ఏరేశ్తున్నాయి. వాటిని ప్రేమగా ఏరి జాగ్రత్తగా ఎడం చేతికి తగిలించుకున్న సంచీలో వేస్తోంది ఆమె.
ఒక ఏడాదిగా ఆవిణ్ణి నేను దాదాపు ప్రతిరోజూ చూస్తున్నాను.నెరిసిపోయి చిందరవందర గా ఉండే జుట్టూ,అందంగా మెరిసే మొహం... ఏదో వెతుకుతున్నట్టు ఎటో చూస్తూ ఉంటుందావిడ. ఆవిడ కనబడగానే నేను ఒక్క క్షణం ఆగి,చిరునవ్వుతో పలకరించి ముందుకి సాగిపోతుంటాను.

పార్కు గేటు దగ్గరుండే వాచ్ మాన్ చేత్తో సైగ చేసి ఆ ముసలావిడకి మతిస్థిమితం లేదని నాకు చెపుతూ ఉంటాడు.అతనలా అన్నప్పుడల్లా నా మనసు చాలా బాధ పడుతుంది.కళ్ళురిమి వాణ్ణి కోపంగా చూస్తాను,కానీ వాడి వంకర నవ్వూ,పార్కులో ఉండే చిన్నపిల్లల ముసిముసి నవ్వులూ , ’ఏయ్,పిచ్చిది రా...అటువైపు వెళ్ళద్దు...’అంటూ ఆవిడని ఎగతాళి చెయ్యడం మాత్రం ఆగవు.


ఆ పిచ్చావిడ అటుగా వెళ్ళేవాళ్ళనెవరినీ ఆపదు,పలకరించదు,ఎవరి పనులకీ అడ్డురాదు.పార్కులో జారేబండ మీద జారుతూ కిలకిల నవ్వే పిల్లల వైపు ఆశగా చూస్తుంది.లేదా పచ్చని మొక్కల్లో పండుటాకుల్ని వెతికి మరీ తుంపుతూ ఉంటుంది.అయినా ఆ పార్కుకి వచ్చేవాళ్ళందరూ ఆవిణ్ణి పిచ్చావిడ అనే అంటుంటారు.

కొన్నాళ్ళు గడిచాయి.ఒకరోజు ఆవిడ ఒంటరిగా లేదని గమనించాను.ఆవిడవెంట ఒక ఆయా లాంటి మనిషి వచ్చింది.బహుశా ఇంట్లోవాళ్ళకి ఆవిణ్ణి పార్కుకి ఒంటిగా పంపకూడదన్న సంగతి ఇప్పటికి అర్థమైనట్టుంది.ఇద్దర్నీ చూసి ఆగాను.ఆవిడ నా వైపు చూడగానే "నమస్కారమండీ!"అన్నాను. ఆవిడ ముందు బెదిరినట్టు కనిపించింది,  ’నువ్వెవరు?’,అన్నట్టు నాకేసి చూసింది, తరవాత నెమ్మదిగా ఆవిడ పెదవులమీద చిరునవ్వు లీలగా విచ్చుకుంది.
ఆయా ఆవిడ చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తోంది,కానీ ఆవిడకి బెంచి మీద కూర్చోవాలని ఉన్నట్టుంది,బెంచి వైపు వెళ్తోంది.
"మీ పేరేమిటండీ?"నెమ్మదిగా,మాటల్ని స్పష్టంగా పలుకుతూ అడిగాను.ఆవిడ ముందు ఆయావైపు చూసి, తర్వాత నావైపు చూసింది.మళ్ళీ అదే చిరునవ్వు,కానీ నోరు విప్పి ఏమీ అనలేదు.
మర్నాడూ,ఆ తరవాతి రోజూ మళ్ళీ అదే ప్రశ్న వేశాను.ఈసారి ఎన్నో ఏళ్ళ తరవాత ఆ పెదవులు విడివడ్డట్టు,"మందా...కిని..."అంది తడబడుతూ.ఆ గొంతు తియ్యగా ఖంగుమంది.ఆయా ఆశ్చర్యంగా నావైపు చూసింది.

*

ఇప్పుడావిడ పేరు తెలిసిపోయింది.మర్నాడు పార్కుకి చేరుకోగానే అప్పటికే ఆవిడ వచ్చి మామిడి చెట్టు దగ్గర నిలబడి ఉండడం చూశాను.దూరంనించే నన్ను చూసి నవ్వింది.చెట్టునించి రాలిన కొన్ని ఆకుల్ని ఏరుకుని బెంచి మీద కూర్చుంది.నన్ను వచ్చి తన పక్కన కూర్చోమని సైగ చేసింది.నన్ను వాకింగ్ కి వెళ్ళనివ్వలేదు.నా కుర్తాని చేత్తో రాస్తూ కూర్చుంది.ఆ రంగూ డిజైనూ తనకి చాలా నచ్చిందని చెపుతున్నట్టు!
ఉన్నట్టుండి,"చీర..."అంది.ఇంకా ఏమైనా అంటుందేమోనని ఆవిడవైపు చూశాను.నేనేమీ మాట్లాడకపోయేసరికి,తన చీర కొంగు తీసి పట్టుకుని,"చీర!"అంది మళ్ళీ.నేను చీర కట్టుకోలేదేమని అడుగుతోందనుకున్నాను."చీర కట్టుకుని వాకింగ్ చెయ్యడం కష్టం,"అన్నాను.

నాకు ఆలస్యమవుతోంది."ఒక రెండు రౌండ్లు అలా తిరిగి వస్తాను,సరేనా?" అన్నాను.వెంటనే ఆవిడ నా చెయ్యి గట్టిగా పట్టేసుకుంది.తన చేతిలో ఉన్న మామిడాకుల్ని బెంచి అంచున పెట్టి,నా చేతిమీద పట్టుని మరింత బిగించింది,చిన్న పిల్ల తల్లిని బైటికి వెళ్తానంటే గట్టిగా పట్టుకున్నట్టు.కాసేపటికి ఆవిడ పట్టు కాస్త సడలించినట్టనిపించి,"మందాకినీ,మీరు కూర్చునుండండి,నేనొక సారి అలా తిరిగొస్తాను,"అన్నాను.
నేను ఆ పార్కు చుట్టూ నాలుగు రౌండ్లు తిరిగి వచ్చేసరికి ఎండ ఇంకో బెంచి మీదికి మారిపోయింది.ఆవిడ మాత్రం ఇందాకటి బెంచి మీదే నాకోసం ఎదురుచూస్తూ కూర్చునుంది.నేనావిడ చెయ్యి పట్టుకుని ఎండ పడుతున్న బెంచి దగ్గరకి తీసుకెళ్ళాను.లేచి వచ్చేప్పుడూ ఆ మామిడాకుల్ని తీసుకోడం మర్చిపోలేదావిడ.ఉన్నట్టుండి నావైపు చూసి ఒక ఆకుని మధ్యకి చీల్చడం మొదలుపెట్టింది.ఆకు మధ్యనుండే ఈనెని గోళ్ళతో గీకి సాపు చేసింది.తరవాతా కాడని రెండు చిన్న ముక్కలు చేసింది.ఆవిడ ఏం చెయ్యాలనుకుంటోందో నాకు అర్థం కాలేదు.ఆ కాడల్ని ఆవిడ పూరేకుల్ని పట్టుకున్నంత జాగ్రత్తగా పట్టుకుని,నావైపు చూసింది.ఏమంటుందా,ఏంచేస్తుందా అని ఎదురుచూడసాగాను.

ఇంతలో ఆవిడ నా చెవులకేసి చూపించి ఏదో సైగ చేసింది.ఓహో,నేను చెవులకి ఏమీ పెట్టుకోలేదు,అ విషయం గమనించినట్టుంది!ఆవిడ ఆ రెండు కాడలనీ నా చెవులకున్న చిల్లుల్లో దూర్చింది,చాలా నాజూగ్గా.బంగారపు కమ్మలు పెట్టుకున్నప్పటికన్నా ఆవిడ పెట్టిన ఆ ఆకు కాడలు నాకు బావున్నాయనిపించింది.నా చెవులు అలా బోసిగా ఉండడం ఆవిడకి నచ్చలేదు! నా గొంతు పూడుకుపోయింది.
అమ్మ గుర్తొచ్చింది.అమ్మ కూడా నా చెవులకేమీ లేకపోతే వెంటనే,"అలా వదిలేస్తే పూడుకుపోతాయి."అని రింగులో ఏవో పెట్టేది.చేతులు కూడా బోసిగా ఉండకూడదు."ఏమిటా బోసి చేతులు,గాజులేసుకో!"అని తిట్టేది.
కళ్ళు మూసుకుని అమ్మ మొహం గుర్తు తెచ్చుకుంటూ నేను ప్రాణాయామం మొదలుపెట్టాను.మధ్యలో కళ్ళు తెరిచి చూద్దును కదా ఆవిడ కూడా నన్ను అనుకరిస్తూ కనిపించింది.కానీ నాలాగ ఎక్కువ సేపు’ఓం’అనడం ఆవిడకి సాధ్యం కావడం లేదు.మాటిమాటికీ ఊపిరి తీసుకునేందుకు ఆగటం మొదలెట్టింది.కానీ తన ప్రయత్నం మట్టుకు మానలేదావిడ.
కొంతసేపు ప్రాణాయామం చేశాక "గుడికి...?"అంది.
నాకు వినబడినా సమాధానం చెప్పలేదు.
మళ్ళీ ఒకసారి అదే ప్రశ్న వేసింది.
"నేను గుడికెళ్ళను.గుడి ఇక్కడే , నాలోనే ఉంది,"అని ఈసారి జవాబు చెప్పాను.
తరవాత ఆమె భుజాన్ని తాకుతూ,"మీలోనూ ఉంది,"అన్నాను.
ఆవిడ చాలా అమాయకంగా నవ్వి అవునని తలాడించింది.
ఇంతలో నాకు తుమ్ములు పట్టుకున్నాయి.కపాలభాతి క్రియ చేశాక అప్పుడప్పుడూ అలా జరుగుతుంది.
ఆవిడ నావైపే చూస్తూ,"పాలు?"అంది.
"పాలు తాగాలని అంటున్నారా?"అన్నాను.
’వేడిగా."
"వేడి పాలు తాగాలా?"
ఆవిడ నిలువుగా తలాడించింది.
"అరటిపండు,"అంది మళ్ళీ.
"తింటాను,రోజుకొకటి."
"పాలు"అంది మళ్ళీ.ఒకసారికి ఒకేమాట అనేసి పెదవులు గట్టిగా మూసుకుంటుంది.క్లాసులో పిల్లకి ఎవరో మాట్లాడద్దని చెప్పినట్టు,ఒక మాట మాట్లాడగానే టీచరు కోప్పడుతుందని భయపడ్డట్టు,వెంటనే నోరు మూసేస్తుంది.
"పాలూ అరటిపండూ తీసుకోవాలా?"అన్నాను.
"ముక్కలు ,"అని చేత్తో చిన్న చిన్న ముక్కలు కొయ్యడం అభినయించింది.
"అలాగే,పాలలో అరటిపండు ముక్కలు వేసుకుని తింటాను."
"వేడిగా."
నేను నవ్వి,"అలాగేనండీ!"అన్నాను.

అప్పుడు ఆవిడ నా చేతిని సుతారంగా నిమురుతూ తన తలని నా భుజానికి ఆనించింది.ఎంతో తృప్తి పడ్డట్టు,పసి పిల్లాడు వచ్చీ రాని భాషలో చెప్పిన మాటలు తల్లికి అర్థమయితే వాడికి ఎంత సంతృప్తిగా ఉంటుందో,అదే విధంగా.
నేను నా భుజం మీదున్న ఆవిడ తలని చేత్తో రాశాను.

తెల్లారగట్ల ఆకులమీది మంచు బిందువుల తడి నెమ్మదిగా నా మనసుని ఆక్రమించడం మొదలుపెట్టింది.ఈవిణ్ణి అందరూ పిచ్చిదంటారు.కానీ ఈవిడ పిచ్చిది కాదు,ప్రేమకోసం పరితపించిపోతోంది. ఈవిడ జీవితం ఎప్పుడు,ఎలా పట్టాలు తప్పిపోయిందో ఎవరికి తెలుసు?

*

మర్నాడు కూడా అలాగే జరిగింది.ఆవిడ పార్కులో నడవదు,నన్ను కూడా వెళ్లనివ్వకుండా పట్టుకుని బెంచి మీద కూర్చోబెట్టేసింది.ఆవిణ్ణి మాటలతో బులిపించి ఎలాగో మూడు నాలుగు రౌండ్లు తిరిగి వచ్చాను.ఆ తరవాత ఆవిడ దగ్గర కూర్చుని ప్రాణాయామం చేశాను.

ప్రాణాయామం అయిపోయాక నా కుర్తాని చేత్తో రాస్తూ మొహం చిట్లించి,"ఇచ్చెయ్యి,"అంది.
"ఇచ్చెయ్యాలా?ఏమిటి,ఎవరికి?"అన్నాను.
"చీర,"అంది.
నాకు నవ్వొచ్చింది,"కుర్తా ఇచ్చేసి,చీర కట్టుకోవాలా నేను?"అన్నాను.
ఆవిడ మాటలు అర్థం చేసుకున్నందుకు చక్కగా నవ్వింది.హఠాత్తుగా నాకు నా స్నేహితురాలొకామె గుర్తొచ్చింది.ప్రమాదంలో భర్త చనిపోతే ఆమె మానసికంగా కుంగిపోయి పిచ్చిదానిలా ప్రవర్తించేది.తన దగ్గరున్న ఖరీదైన బట్టలన్నీ ఎవరెవరికో ఇచ్చేసేది,ఎవరూ దొరక్కపోతే కిటికీలోంచి బైట పారేసేది.తను మాత్రం వెలిసిపోయిన,చిరిగిపోయిన బట్టలు వేసుకునేది.

మందాకిని రోజూ పార్కులో కలుస్తోంది.ఒకే ఒక మాట అనడం,మిగతాది హావభావాలతో,చేతి కదలికలతో చెప్పడం.ఒకరోజు ఆవిడ పండుటాకులు కోసేందుకు ఒక పక్కకి వెళ్ళగానే ఆయా నాతో,"రెండేళ్ళుగా ఈవిడ దగ్గర పని చేస్తున్నా.ఎప్పుడూ ఈవిడ మాట్లాడగా వినలేదు.ఇప్పుడు మీముందు నోరు విప్పి మాట్లాడుతోంది.ఇంతకు ముందు ఈవిడ గొంతు కూడా వినలేదు నేను.ఎంత తియ్యగా మాట్లాడుతోందో! ఇన్నాళ్ళూ ఒంటరిగా ఇక్కడికి వచ్చేది.ఒకరోజు ఒకావిడ తన పిల్లాడి చొక్కా ఈవిడ చింపేసిందని పోట్లాటకొచ్చింది.అప్పట్నించీ నేను వెంట వస్తున్నా,"అంది.
ఈలోపల మందాకిని జోలెనిండా పండుటాకులు నింపుకొచ్చింది.కూర్చోగానే నా అరచెయ్యి పట్టుకుని,"కత్తిరించు,"అంది.
నాకేమీ అర్థం కాలేదు.
ఒక్క క్షణం పోయాక అర్థమైంది.గోళ్ళు పెరిగిపోయాయని అంటోందావిడ.
"అలాగే కత్తిరిస్తాను,"అన్నాను.
"మంగళ...ఊహూ(.."
"మంగళవారం వద్దా?"
"శని...ఊహూ(..."
బుద్ధిగా తల అడ్డంగా ఆడించి,"సరే, శనివారం కూడా కత్తిరించను,"అన్నాను.
కానీ మళ్ళీ పొగరుగా,"ఏమవుతుంది కత్తిరిస్తే?వారం వర్జ్యం చూడాలా?"అన్నాను.
ఆవిడ నవ్వింది.ఎంతో సాత్వికంగా ఉందా నవ్వు,కళ్ళు నక్షత్రాల్లా మెరిసిపోతున్నాయి.

మందాకిని అడిగారని గోళ్ళు మర్నాడు కత్తిరించాను.కానీ ఆ తర్వాత పార్కుకి వెళ్ళడం పడలేదు.అహ్మదాబాద్ నించి నా స్నేహితురాలు వచ్చింది.రెండ్రోజులుంది.పార్కుగుండా మా ఆఫీసుకెళ్ళేందుకు ఒక చిన్న దారి ఉంది.ఆ దారిన వెళ్తూంటే మందాకిని పార్కులో కూర్చునుండడం కనిపించింది.ఆయా ఆమె ఎక్కడ పారిపోతుందో అన్నట్టు చెయ్యి గట్టిగా పట్టుకునుంది.

నన్ను చూడగానే ఆవిడ నవ్వింది.నా స్నేహితురాలిని పరిచయం చేశాను.ఆవిడ ఆయా చేతిలో ఉన్న తన చేతిని లాక్కుని,రెండు చేతులతో నా మెడ చుట్టేసింది.నా మొహానికి తన మొహం ఆనించి,అప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్న పసిపిల్లలా,ముద్దు ముద్దుగా," ఈమె ...నా...స్నే...హితు...రాలు..."అంది నా స్నేహితురాలికి నన్నే పరిచయం చేస్తూ!నేను విస్మయంగా ఆవిడకేసి చూస్తూ ఉండిపోయాను.ఆవిడ నన్ను తన స్నేహితురాలని చెప్పేసరికి లోపలంతా చల్లని జల్లులు కురిసినట్టనిపించింది నాకు.ఆవిడ నా మెడమీదనించి చేతులు తియ్యడం లేదు.కష్టపడి చేతులు వదిలించుకుని,"ఈరోజు పనుందండీ.తీరిగ్గా ఇంకోరోజు కూర్చుని కబుర్లు చెప్పుకుందాం,"అన్నాను.
"రావాలి,"అంది మందాకిని.ఆవిడ మొహం మీద నవ్వు మాయమైంది.మళ్ళీ వాక్యాల్లోంచి ఒకే ఒక మాటలోకి వచ్చేసింది.


వాతావరణం మారుతోంది.చలి పెరిగింది.
నాకు జ్వరం వచ్చింది.వారం రోజులు పార్కు వైపుకి వెళ్ళలేకపోయాను.ఆ తరవాత వెళ్తే మందాకిని ఎన్నో ఏళ్ళుగా చూడనట్టు నన్ను చుట్టేసింది.నోరు విప్పి మాట్లాడలేదు,కానీ హావభావాలతో ఇన్నాళ్ళూ ఏమయావని అడిగింది.
జ్వరం వచ్చిందని చెప్పేసరికి నా నుదురూ,బుగ్గలూ తాకి చూసింది.జ్వరం లేదని తల అడ్డంగా ఆడించి,చిరునవ్వు నవ్వింది.అన్నీ చాలా స్లో మోషన్ లోనే!
"ఇల్లు,"అంది ఉన్నట్టుండి.
నన్ను ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోమంటోందనుకుని,"పరవాలేదు,నేనివాళ బాగానే ఉన్నాను.అందుకే నడవడానికి వచ్చాను,"అన్నాను.
"ఊహూ(...ఇల్లు..."అంది మళ్ళీ.
ఇంతలో ఆయా కల్పించుకుని,"అమ్మగారు రోజూ మీకోసం వెతికేది.మీరు పార్కులోకొచ్చే గేటు వైపు నన్ను లాక్కెళ్ళేది.కానీ మాకు మీ పేరేమిటో,ఏ ఫ్లాట్ లో ఉంటారో తెలీదాయె!ఎలా వస్తాం?అందుకే మిమ్మల్ని వాళ్ళింటికి తీసుకెళ్ళాలనుకుంటోంది అమ్మ గారు," అంది.
మళ్ళీ మందాకిని అదే మాట,"ఇల్లు..."అంది.
"మీ ఇంటికా? అలా హఠాత్తుగా నన్ను ఇంటికి తీసుకెళ్తే మీ ఇంట్లోవాళ్ళేమీ అనుకోరా?"అన్నాను.
ఆవిడ మౌనంగా ఆయాకేసి చూసింది.
"అమ్మగారూ,అమ్మాయీ మాత్రమే ఉంటారు.ఆమె ఏమనుకోదు,"అంది ఆయా.

నేను చాలా సంకోచ పడుతూ ఆవిడ వెంట వెళ్ళాను.సరే, వీళ్ళమ్మాయితో మాట్లాడితే ఈవిడ ఇలా ఎందుకుందో తెలుస్తుంది.ఇంత అందమైన మందాకిని ,గొప్పింటావిడలా కనిపించే ఈవిడ ఇలాటి స్థితికి ఎలా చేరుకుందో తెలుసుకోవచ్చు అని అనుకున్నాను.
లిఫ్ట్ ఎక్కుతూంటే మందాకిని  మొహాన చిరునవ్వు కనిపించింది.మొహం గర్వంతో వెలిగిపోసాగింది.తనకి కూడా ఒక స్నేహితురాలుందనీ,ఆమెని ఇంటికి తీసుకెళ్తున్నాననీ కాబోలు!

*

పదో అంతస్తులో ఉన్న ఫ్లాట్ డోర్ బెల్ మీద వేలితో నొక్కింది ఆయా.లోపల్నించి గాయత్రీ మంత్రం వినిపిస్తోంది.తలుపు తెరిచి,ఒక అతి అందమైన బక్కపల్చటి అమ్మాయి తలుపు వెనక్కి వెళ్ళిపోయింది.ఆ పిల్ల నైటీ వేసుకునుంది.
ఒంటిమీద నగలేవీ లేవు.ముప్ఫైయేళ్ళప్పుడు మందాకిని కూడా ఇలాగే ఉండి ఉండాలి.పూర్తిగా ఆవిడకి కార్బన్ కాపీ!జుట్టు పొట్టిగా కత్తిరించుకుంది.పొద్దున్నించీ దువ్వుకోనట్టు జుట్టు చెదిరిపోయి ఉంది.

ఆయా నాకేసి చూపిస్తూ,"ఈవిడే అమ్మ ఫ్రెండు.రోజూ పార్కులో కలుస్తారు,"అంది.
అంతే ఆ అందమైన అమ్మాయి మాట్లాడడం మొదలెట్టి ఒక పెద్ద కథే చెప్పుకొచ్చింది-అదొక అంతులేని కథ!
"నా పేరు అన్వేష.బావుంది కదా? అమ్మే పెట్టింది.నాన్న ఏనీ అని పెడదామనుకున్నాడు.ఇప్పటికీ ఆయన ఆ పేరుతోనే పిలుస్తాడు నన్ను.విద్యాసాగర్ కాలేజీ లో ఎకనామిక్స్ లో ఆనర్సు కోర్సు చేశాను.నా వయసు ముప్ఫై ఐదు.పెళ్ళిచేసుకోలేదు.చేసుకోవాలనిపించనే లేదు.ఎవ్వరూ నచ్చలేదు.పెళ్ళంటే అయిష్టమేమీ లేదు,కానీ సరైన వ్యక్తి దొరకలేదు.కాలేజీలో ఒకబ్బాయితో స్నేహం చేశాను,కానీ అతను ఉత్త స్నేహితుడిగానే మిగిలాడు.అతన్ని కూడా పెళ్ళిచేసుకోవాలనిపించలేదు.
"పెళ్ళి అనే మాట వింటేనే భయమేస్తుంది.అతనితో స్నేహం చేసినప్పుడు నేను బోలెడన్ని కవితలు రాశాను తెలుసా మీకు?సినిమాలకి కూడా రాద్దామనుకున్నాను,కానీ అభిజీత్ నా పాటలు చాలా గొప్పగా ఉన్నాయనీ,సినిమాలకి ఏవో సరదాగా అల్లాటప్పా పాటలు రాస్తే చాలనీ అన్నాడు.ఇంకా రాస్తూనే ఉన్నా అప్పుడప్పుడూ...ఒక నాలుగు లైన్లు చదవనా? వింటారా?...వద్దులెండి,ఈసారి వచ్చినప్పుడు వినిపిస్తా..."ఆ పిల్లలో కూడా పసిపిల్లల అమాయకత్వం కనిపించింది.ఆపకుండా గలగలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది.కళ్ళు నాకేసి కాకుండా శూన్యంలోకి చూస్తూ ఏదో వెతుకుతున్నట్టు విపరీతంగా చలిస్తున్నాయి.
ఇంతలో ఆయా,ఒక గాజు గ్లాసులో నీళ్ళూ,ఒక మాత్రా తీసుకొచ్చింది.అన్వేష ఆ మాత్రని నోట్లో వేసుకుని నీళ్ళతో మింగేసింది."మూడ్ స్టెబిలైజర్,ఆంటీ,రోజూ వేసుకోవాలి,"అంది నాతో.
నాకు మూర్ఛ వచ్చినంత పనైంది.నోరు తెరుచుకుని అలా చూస్తూ ఉండిపోయాను.ఆ అమ్మాయి ఊరికే తన గురించే చెపుతూ పోయింది,నా గురించి ఏమీ అడగలేదు.ఆ సంగతి నేనింతవరకూ గమనించనే లేదు.ఈ పిల్లకి ఏమని జవాబు చెప్పాలి? అనుకున్నాను.పక్కకి తిరిగి గోడకున్న ఫొటోలు చూడసాగాను.ఒక స్ఫురద్రూపిలా కనిపిస్తున్న అతని ఫొటో ఉందక్కడ.అతను అందంగా,హుందాగా చిరునవ్వు నవ్వుతున్నాడు.ఒక్క క్షణం నా కళ్ళు ఆ ఫొటో దగ్గర ఆగాయి.వెంటనే అన్వేష,’మా నాన్న ఫొటో ,ఆంటీ,"అంది.
మళ్ళీ తనే,"జర్మనీలో ఉంటారు,"అంది.
మళ్ళీ గబగబా మాట్లాడడం మొదలెట్టింది.అనంతంగా ఆ అమ్మాయి మాట్లాడుతూంటే అర్థం చేసుకోవడం నా వల్ల కాలేదు.కొన్ని విషయాలు మాత్రం తెలిశాయి.జర్మనీలో ఈమె తండ్రి మోనికా అనే ఆవిడతో ఉంటాడు.ఆవిణ్ణి అమ్మా అని పిలవమని ఈ అమ్మాయిని ఎప్పుడూ సతాయిస్తూ ఉంటాడు."కానీ అమ్మ ఇక్కడుండగా ఆవిణ్ణి అమ్మా అని ఎలా పిలవడం!నాన్నకి అమ్మ చేతి వంటంటే చాలా ఇష్టం.ఏడాదికి ఒకసారి ఇక్కడికి వస్తాడు.ఆయన వచ్చినప్పుడు అమ్మ మంచి మంచి వంటలు వండుతుంది...ఆయన కోసం...నా కోసం కూడా!

"ఒకసారి మోనికా కూడా నాన్న వెంట వచ్చింది.అప్పుడు అమ్మకి స్ట్రోక్ వచ్చింది.బాగయిపోయింది,కానీ మాట్లాడడం పూర్తిగా మానేసింది...ఎవరితోనూ మాట్లాడదు.ఇప్పుడు నాన్న ఒక్కడే వస్తాడు.బ్యాంకులో డబ్బు వేసి వెళ్తాడు.అంతా సవ్యంగానే ఉంది..."అలా ఆ అమ్మాయి మాట్లాడుతూనే ఉంది.

"నాన్న జర్మనీ నించి మాకోసం బోలెడన్ని డ్రస్సులు తీసుకొస్తాడు.కానీ అమ్మ వాటిని తొడుక్కోదు.ఆవిడ ఎప్పుడూ చీరే కట్టుకుంటుంది.మీరే చెప్పండి ఆంటీ,ఇంట్లో కూడా ఎవరైనా చీరలే కట్టుకుంటారా?అమ్మకి చీరంటే పిచ్చి ఇష్టం.నన్ను కూడా ఎప్పుడూ నైటీ విప్పేసి చీర కట్టుకోమంటూ ఉంటుంది.నాది చీర కట్టుకునే వయసా? ఈ నైటీ చూడండి ఎంత బావుందో!నాన్న జర్మనీ నించి తెచ్చాడు.నా కోసం.నేనంటే ఆయనకి చాలా ప్రేమ.కానీ ఇక్కడ ఉండడం సాధ్యం కాదు,అంత పెద్ద ఉద్యోగం ఆయనది!ఎంబసీలో పని.ఎప్పుడూ పనిలో మునిగి ఉంటాడాయన.అమ్మేమో రెండేళ్ళుగా మాట్లాడడమే మానేసింది.ఎందరో డాక్టర్లకి చూపించాం.కానీ ప్రయోజనం లేకపోయింది.మీరేం చేశారో గాని,ఆవిడ చేత మాట్లాడించారు!మీరు మా ఇంటికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది.థాంక్యూ సో మచ్!"
నేను డ్రాయింగ్ రూమ్ ని పరికించాను.అంతా రోజ్ వుడ్ తో చేసిన పాతకాలపు ఫర్నిచర్.సోఫాలకి ముఖమల్ కవర్లూ,నగిషీలు చెక్కిన బల్లలూ,కుర్చీలూ,అక్కడ కూర్చున్న మందాకిని కూడా వాటిలో భాగంలా అనిపించింది నాకు.ఆవిడ పెదవులు బిగించి ధారాళంగా మాట్లాడుతున్న కూతుర్నే చూస్తోంది.
ఇంతలో ఆయా వచ్చి, సంచీలో నిండా ఉన్న పండుటాకుల్ని చెత్త బుట్టలో బోర్లించడానికి తీసుకు పోబోయింది.మందాకిని మెరుపు వేగంతో ఆయా చెయ్యి పట్టుకుని,"వద్దు...వీల్లేదు..."అంది.
"రేపు మళ్ళీ ఏరుకుందువుగానిలే అమ్మా!పార్కులో బోలెడన్ని ఎండుటాకులు దొరుకుతాయి,"అంది విసుగ్గా.
అలా ఆయా కసురుకునే సరికి మందాకిని మొహం ముడుచుకుపోయింది,తాబేలు డిప్పలోకి తలని లాక్కున్నట్టు.ఆవిడ మూడ్ పూర్తిగా మారిపోయింది.తల్లీ కూతుళ్ళిద్దరూ మౌనంగా ఉండిపోయారు.

కొంతసేపు ఇంకా ఆ అమ్మాయి ఏమైనా చెపుతుందేమో నని ఎదురు చూశాక, నేను లేచి,"ఇక వెళ్ళనా మరి?"అన్నాను.
"టీ తాగి వెళ్దురుగాని, ఆంటీ.సారీ,నేను అలా ఏదేదో వాగుతూనే ఉన్నాను.మీరు టీ తాగుతారా అని కూడా అడగలేదు,"అంది అన్వేష.
"ఇప్పుడొద్దులే,ఈసారి వచ్చినప్పుడు తాగుతాను,"అన్నాను.
"వచ్చినందుకు థాంక్స్ ఆంటీ,కానీ మళ్ళీ తప్పక రావాలి.నా కవితలు వినిపిస్తాను ఈసారి."
వెనక్కి తిరిగి చూశాను.తల్లీ కూతుళ్ళ గొంతు కూడా ఒక్కలా ఉంది.తేనెలూరుతున్నట్టు తియ్యగా!తల్లి కళ్ళలో కనిపించిన కృతజ్ఞతా భావమే అన్వేష కళ్ళలోనూ ఉంది.ఒకటే తేడా,తల్లి ఒకసారి ఒకే మాట మాట్లాడుతుంది,కానీ కూతురు ఆపకుండా మాట్లాడుతూనే ఉంటుంది.అవతలివాళ్ళు తన మాటలు వింటున్నారా లేదా,వాళ్ళు చెప్పేది కూడా వినాలి కదా అన్న ధ్యాసే ఉండదా పిల్లకి.

బరువుగా మెట్లు దిగి వచ్చేశాను. ఎవరి గురించి ఎవర్ని అడగను? తల్లీ కూతురూ ఒకే రకమైన షాక్ లో ఉన్నారు.వాళ్ళ మనఃస్థితి సవ్యంగా లేదని మాత్రం అర్థమైంది.చాలా బాధ వేసింది,కానీ నేనేం చెయ్యగలను?

*

గేటు దాటి ఇంటివైపు నడిచాను.ఇరవైఏడు అంతస్తులున్న మా కాంప్లెక్స్ గేట్లు రెండూ ఈ పార్కులోకి తెరుచుకుంటాయి.గాలి జోరుగా వీస్తోంది.పచ్చని చెట్లకున్న పండుటాకులని రోజూ మందాకిని కోసి సంచీలో నింపుకున్నా పార్కంతా ఎండుటాకులు గాలికి ఎగురుతూనే ఉన్నాయి.గాలి ఊపుకికి పైకెగిరి మళ్ళీ అదే వేగంతో కింద పడిపోతున్నాయి!



---------------------------------------------------------------------------------------------------





Monday, November 19, 2012




తెగని బంధాలు
-------------


శకుంతలకి జనవరిలో పెళ్ళయింది. నేను పగలంతా మా నాన్న పెట్టిన సైకిల్ షాపులో పని చేస్తూ గడిపేస్తాను. కానీ పొద్దుపోయాక నా మనసు ఎటో వెళ్ళిపోతుంది. పని మీద ధ్యాస పెట్టలేకపోతాను. అందుకే ఏదో ఒక సాకుతో బైటికెళ్ళిపోతాను. జనవరి నెలలో సాయంకాలమవగానే చలి ప్రారంభమవుతుంది. తన వాడి గోళ్ళతో ఒళ్ళంతా రక్కటం మొదలు పెడుతుంది. నేను ఒకప్పుడు శకుంతలతో కలిసి తిరిగిన ప్రదేశాలన్నీ ఒకసారి చుట్టబెట్టి, ఆమె జ్ఞాపకాలలో తడిసి ఇంటికి చేరతాను.
ఎంత చలిగా ఉన్నా ఓవర్ కోట్, మఫ్లర్, మేజోళ్ళు, షూలు లాంటివి తొడుక్కోను. మామూలుగా ప్యాంటూ, షర్టూ, స్వెటర్, చెప్పులూ వేసుకుంటాను. చలి నన్ను బాధ పెడుతుంది. వేళ్ళ కొసల్నించి ఒళ్ళంతా పాకుతుంది. ప్రేమని పోగొట్టుకున్నందువల్ల కలిగే బాధలో అది కూడా ఒక భాగమేననీ, దాన్ని భరించక తప్పదనీ అనిపిస్తుంది నాకు.
కానీ అది ప్రేమ లేకపోవటం కాదనీ, శకుంతల నాకు దక్కక పోవటమనీ నాకు తెలిసేందుకు ఏడాది కాలం పట్టింది. నా ప్రేమని నేను పోగొట్టుకోలేదు. నా మనసులోనూ శకుంతల మనసులోనూ ఇంకా ఒకరి మీద ఒకరికి ప్రేమ అలాగే ఉందని నా నమ్మకం. ఒక సారి పుట్టింటికి వచ్చినప్పుడు నన్ను కలుసుకుంది. అప్పుడు భోరున ఏడుస్తూ ఇంకా తను నన్ను...నన్ను...నన్నే,. ప్రేమిస్తున్నానని చెప్పింది! కానీ కొంత సేపటికి ఏడుపు ఆపి, కళ్ళు తుడుచుకుని, "అయినా ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? నేనింక పరాయి దాన్నే కదా నీకు?" అంది.
ఆమె మొదట అన్న మాటలతో వేడెక్కిన నా తల హఠాత్తుగా మంచుకొండకి గుద్దుకున్నట్టనిపించింది. శకుంతల చివరగా అన్న మాటల అంతరార్థం ఏమై ఉంటుంది? నా మీద అభియోగం వేసిందా? లేక ఆ మాటల్లో గూడార్థమేమైనా ఉందా? నాకోసం ఏదైనా రహస్య సందేశం ఉందా?

అలా అనుకోగానే నా ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది. కొంతసేపటికి శకుంతల నా ముందు ఒక సవాలు విసిరిందన్న నమ్మకం కలిగింది. ఆమె ఇంకా నన్నే కోరుకుంటోంది. మధ్యలో ఆగిపోయిన మా ప్రేమాయణాన్ని మళ్ళీ మొదలు పెడదామని చూచాయగా చెప్పకనే చెప్పింది. అంతే! ఒక తియ్యటి వెచ్చదనం నన్ను పూర్తిగా కమ్మేసింది. ఆ రోజు కూడా చలికాలపు సాయంకాలమే ఇద్దరం కలుసుకున్నాం. సాయంకాలపు పొగమంచులో కలిసిపోయి వెలుతురు కొత్త రంగులి సంతరించుకుంది. మరిచిపోలేని సుగంధమేదో పరుచుకుంది. అంత చలిలో కూడా వెచ్చగా అనిపించింది. ఆమె బుగ్గల మీదికి కారిన కన్నీటిని ఆప్యాయంగా నా వేళ్ళతో తుడిచాను.
లోకం ఏమనుకున్నా సరే, ఇద్దరం కలుస్తూ ఉండాలనీ, ఇంకా మాట్లాడితే కలిసే జీవించాలనీ నిర్ణయించుకున్నాం. ఎటువంటి అడ్డంకులనీ లెక్క చెయ్యకూడదని అనుకున్నాం.
"ధీరజ్ నన్ను మోసం చేశాడు, రాకేష్! పెళ్ళప్పుడే అతని ఆరోగ్యం సరిగ్గాలేదన్న సంగతి వాళ్ళు దాచిపెట్టారు. పెళ్ళి అయిన తరవాత కూడా తనకి ఉన్న వ్యాధికి చికిత్స లేదనీ, తను ఎక్కువకాలం బతకననీ ధీరజ్ నాకు చెప్పలేదు. తన వ్యాధి ఏమిటో డాక్టర్లకే ఇంకా అంతుపట్టలేదనీ, కానీ నయం అవుతుందని మాత్రం హామీ ఇస్తున్నారనీ అన్నాడు. శోభనం రాత్రి కూడా అతను నాతో పడుకోలేదు, ఆస్పత్రి కెళ్ళి అక్కడే పడుకున్నాడు. ఈ నాటి వరకూ దాంపత్య సుఖం అంటే ఏమిటో నేనెరగను. ఒక్కోసారి ఎప్పుడైనా ఆస్పత్రినించి ఇంటికి వచ్చినా, అతను విడిగా ఇంకో గదిలో పడుకుంటాడు. ఒకసారి అతను మామూలుకన్నా కాస్త తెరిపిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటం చూసి, నేనే చొరవచేసి శోభనం గురించి ఎత్తాను. నేనలా అనగానే అతను విపరీతంగా కంగారు పడ్డాడు. "నన్ను క్షమించు శకుంతలా! నిన్ను మోసం చేశాను, నీకు ద్రోహం చేశాను! నేను శోభనానికి పనికి రాను!" అన్నాడు. ఇన్నాళ్ళుగా అతనికి ఆరోగ్యం బాగాలేదని ఎంతో ఓర్పుతో నెలల తరబడి ఎదురుచూస్తున్న నాకు ఈ మాట వినగానే పట్టరాని కోపం, దు:ఖం వచ్చాయి. "అలా అయితే నన్నెందుకు పెళ్ళి చేసుకున్నట్టు? నన్నూ, నా తలిదండ్రులనీ, ఈ సమాజాన్నీ, చివరికి నిన్ను నువ్వే మోసంగించుకున్నావు! ఎందుకలా చేశావు?" అని అరిచాను. కానీ అతను జవాబేం చెబుతాడు? నా కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అతన్ని ఒక్క తన్ను తన్ని, నేరుగా నీ దగ్గరకి పరిగెత్తుకు రావాలని ఆ క్షణంలో నా కనిపించింది.." అని చెప్పటం ఆపింది శకుంతల.

శకుంతల చెప్పినది విని నేను మ్రాన్పడిపోయాను. ఆ రోజు సాయంకాలం దట్టమైన మంచు కురుస్తుంటే పార్కులో చల్లటి రాతి బెంచీమీద కూర్చుని ఇద్దరం చలికి గజ గజ వణికిపోతున్నాం. ఆయినా నా రక్త ఉడికిపోయింది. "శకుంతలా, నీకు తీరని అన్యాయం జరిగింది. నిజం చెప్పాలంటే నాకు కూడా! కానీ ఇప్పుడు మనకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఒకటే మార్గం: మనం ఎదురు తిరగాలి. రక్త మాంసాలున్న మనుషులమని లోకానికి చాటాలి. సమాజం ఆడించినట్టల్లా ఆడే తోలుబొమ్మలం కామని ఇప్పటికైనా చెప్పాలి. నువ్వు సాహసం చెయ్యాలి. ఆ నపుంసకుణ్ణి వదిలేసి నా దగ్గరకి వచ్చెయ్యాలి. ఆ పని చేస్తావా? చెయ్యగలవా?"
శకుంతల అనురాగం నిండిన కళ్ళతో నా కేసి చూస్తూ "అది సాధ్యమేనంటానా, రాకేష్? నువ్వు నన్ను స్వీకరిస్తావు, కానీ ఈ సమాజం...లోకం..?
"సర్లే, ఈ సమాజం మనకేమిచ్చింది? మన ప్రేమకి అడ్డుపడే హక్కు దానికి లేదు. నీకు అన్యాయం జరిగితే నోరు విప్పని లోకం గురించి మనమెందుకు పట్టించుకోవాలి?" ఆ మాటలంటున్నప్పుడు నా గొంతు పెద్దగా అరిచినట్టు ధ్వనించింది.
కానీ నా భావావేశాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా శకుంతల నెమ్మదిగా ఇలా అంది, "సమాజం గోడమీది పిల్లిలాంటిదని నాకు తెలుసు, అబధ్ధాలు చెపుతుందనీ తెలుసు. కానీ అది మనిద్దరికన్న బలమైనది. ఒక నపుంసకుడికి భార్యగా ఉంటూ, పరాయి మగాళ్ళకి పిల్లల్ని కనే ఆడదాన్ని పతివ్రత అంటుంది, గౌరవిస్తుంది. కానీ అలాటి భర్తని విడిచిపెట్టి చిత్తశుధ్ధితో మనసారా ప్రేమించినవాడి దగ్గరకెళ్తే మాత్రం శీలం చెడిందని ముద్ర వేస్తుంది. నీ తలిదండ్రులూ, బంధువులూ నేను నీ భార్యనని ఒప్పుకుంటారా?"
నేనింకా గొంతుపెంచి, "ఒప్పుకోరని నాకు తెలుసు. కానీ వాళ్ళకి భయపడి మనం జీవితాంతం జీవఛ్చవాల్లా బతుకుదామంటావా? లేదు, నాకలా బతకాలని లేదు. నిన్ను కూడా అలా బతకనివ్వను. నీ పెళ్ళయినప్పట్నించీ ఈ ఊళ్ళో ఉండటం నాకు నరకయాతన కన్నా భయంకరంగా అనిపిస్తోంది. ఇక్కణ్ణించి పారిపోవాలని ఉంది. ఇక్కడ ఏముందని? నాన్న ఉన్నన్నాళ్ళూ ఆ సైకిల్ షాపులో పని చెయ్యటం, ఆ తరవాత ఆ షాపు యజమానినై ఇక్కడే పాతుకుపోవటం, అంతేగా? నేను బి.ఎస్సి. చదివింది సైకిల్ షాపు నడిపేందుకా? నువ్వు ఒక పనికిమాలిని వాడికి భార్యగా బతకటానికేనా ఇంగ్లీషు బి.ఏ.ఆనర్స్ చేశావు? నువ్వు లేని ఈ ఊళ్ళో ఉండలేక అప్పట్నించీ వేరే ఊళ్ళో ఉద్యోగ ప్రయత్నాలను చేస్తునే ఉన్నాను. మొన్ననే ఉత్తరం వచ్చింది, లక్నోలో ఒక ప్రభుత్వోద్యోగం దొరికింది. వెళ్ళనా వద్దా అని ఎటూ తేల్చుకోలేకుండా ఉండగా ఇలా నువ్వు రావటం, నీకు జరిగిన అన్యాయం గురించి నాకు చెప్పటం అంతా మన అదృష్టం కొద్దీ జరిగిందనే అనుకోవాలి. నువ్వు సరేనంటే రేపే లక్నో వెళ్ళి ఉద్యోగంలో చేరిపోతాను. నువ్వు తరవాత నా దగ్గరకి వచ్చెయ్యి," అన్నాను.
ఆ రోజు నిర్ణయించుకున్నట్టే మేమిద్దరం లక్నో చేరుకుని కలిసి జీవించటం మొదలుపెట్టాం. మా ఆనందానికి అవధుల్లేవు. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. కానీ కొన్నాళ్ళయాక శకుంతల అప్పుడప్పుడూ దిగులుగా ఉండటం గమనించాను. ఒకరోజు ఉండబట్టలేక అడిగేశాను, "ఏమిటివాళ అంత దిగులుగా ఉన్నావు?"
"దిగులా? నాకా? లేదే!" అని నవ్వేసింది.
"నా దగ్గరకి వచ్చి తప్పు చేశానని అనుకోవటం లేదు కదా?"
"అలాంటిదేం లేదు, కానీ ధీరజ్ గుర్తొస్తూ ఉంటాడు. అతనెలాటివాడైనా, అబధ్ధాలు చెప్పి నాకు అన్యాయం చేసినా, పాపం అతను జబ్బు మనిషి, అతనికి ఉన్నది చాలా సీరియస్ రోగం."
"అతను నిజంగానే జబ్బు మనిషా? నీ మాటలవల్ల ఆ జబ్బు తనలోని లోటుని కప్పి పుచ్చుకునేందుకు ఆడుతున్న నాటకమేమో అనిపించింది నాకు."
"లేదు. అతను నిజంగానే జబ్బు మనిషి."
"అయితే ఇప్పుడేమంటావు?"
"ఏం లేదు. ఎటూ తోచటం లేదు. త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తోంది. అతన్ని వదిలి వచ్చేశాను. కానీ అతను బలహీనుడు. మెత్తని స్వభావం. ఇది పధ్ధతి కాదనో, చట్టరీత్యా నా భార్యవి, అలా ఎలా నన్నొదిలి వెళ్ళిపోతావ్ అనో రెట్టించి లాక్కెళ్ళే ధైర్యం అతనికి లేదు. అయినా...సర్లే, ఇప్పుడవనీ ఎందుకు? ఆలోచించి మాత్రం చేసేదేముంది?" అంది శకుంతల నిట్టూరుస్తూ.
"అలా కాదు. మించిపోయిందేమీ లేదు. బాగా ఆలోచించుకో. అతని దగ్గరకే వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళు."
శకుంతల ఇష్టంలేనట్టు మొహం పెట్టి నా కేసి చూసింది."మళ్ళీ నన్నా నరకంలోకి వెళ్ళమంటావా?" అన్నట్టుగా ఉంది ఆ చూపు.
కానీ నేనేమీ మట్లాడలేదు. నా మనసులో ఎన్నో ప్రశ్నలు రొద చెయ్యటం మొదలుపెట్టాయి. ఇంత వరకూ మా ఇద్దరి మధ్యా ఉన్నది అద్భుతమైన ప్రేమ అనే భ్రమలోనే జీవిస్తూ వచ్చానా? అది నిజంగా అంత గొప్ప ప్రేమ కాదా? ఇది కూడా ఒక రకమైన వ్యభిచారం గాని కాదు కదా? ఇద్దరం నిజంగా మళ్ళీ కలుసుకున్నామా, లేక విడివిడిగా ఎవరి ప్రపంచంలో వాళ్ళం బతుకుతున్నామా?
అలా ఆలోచిస్తుంటే మేం పురుగుల కన్నా హీనమైన వాళ్ళమని అనిపించసాగింది. ఏక కణ జీవులం! ఎక్కడో చదివాను ఒక రకమైన ఏకకణజీవి ఉంటుందిట. అది నీళ్ళల్లో ఉంటూ తనంట తనే పేలి చనిపోతుందట. నాకొక అనుమానం వచ్చింది, అది అలా పేలిపోతే నీళ్ళల్లో అసలు ఒక్క బుడగైనా లేస్తుందా?  అలలు ఏర్పడతాయా? ఆంత సూక్ష్మ ప్రాణి చనిపోతే ఏర్పడే బుడగ ఇంకెంత సూక్ష్మంగా ఉంటుందో కదా? బహుశా అసలు బుడగే ఏర్పడదేమో! మరి ఇంత పెద్ద ప్రపంచంలో ఒక శకుంతల, ఒక రాకేష్, ఒక ధీరజ్ ఆ సూక్ష్మప్రాణికన్నా గొప్పవాళ్ళేమీ కాదుగా? మేం కలిసుంటే ఏమిటి, విడిపోతే ఏమిటి? బతికుంటే ఏం చస్తే ఏం..ఎవరు పట్టించుకుంటారు? అయినా ఎందుకిలా నైతిక విలువలు అంటూ పాకులాడాలి?
శకుంతలతో కలిసి జీవించటం మొదలుపెట్టాక ఈ సమాజంలోని నియమాలనీ, నిబంధనలన్నిట్నీ భస్మీపటలం చెయ్యగలిగానని గర్వించాను. నేను చేసిన పని వల్ల బూజు పట్టిన సంప్రదాయాల పొగమంచు తొలగిపోతుందనీ, నిర్జీవమైన సంబంధాలలోని గడ్డకట్టిన భావాలు కరిగి, వాటిలో కొత్త జీవం తొణికిసలాడుతుందనీ, అంతటా ప్రేమ తాలూకు వెచ్చటి వెల్తురు నిండుతుందనీ ఆశించాను. కానీ ఆ రోజు శకుంతల దిగులుకి అసలు కారణం తెలుసుకున్నాక నిజంగా ఏ బూజుపట్టిన సంప్రదాయాలూ, నియమాలూ, నిబంధనలూ భస్మీపటలం కాలేదని తెలియవచ్చింది. కాసేపు నిప్పురాజుకుని, కాస్త పొగ వచ్చింది, అంతే!
ఆ రోజు మొదలు శకుంతలలో నిజాయితీ లోపించిందన్న భావన నన్ను ఏడిపించసాగింది. శరీరం మాత్రమే నాకప్పగించి, మనసుని ధీరజ్ దగ్గరే వదిలి వచ్చిందన్న నమ్మకం బలపడింది.
ఒక సారి ఆఫీసుపని మీద నాలుగు రోజులు బైటికెళ్ళాను. పనులు పూర్తయాక సాయంత్రం ఇంటికొచ్చాను. మా గది గుమ్మానికి కర్టెను వేలాడుతూ దర్శనమిచ్చింది.అది చూసి నిర్ఘాంతపోయాను. కానీ లోపల శకుంతల ఒక్కతే లేదనీ, ఆమెతో మరెవరో ఉన్నారనీ గ్రహించాను. నాకు ఒళ్ళు మండిపోయింది, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. పళ్ళు కొరకసాగాను. శకుంతల నాకింత ద్రోహం చేస్తుందా? ఎన్నాళ్ళుగా సాగుతోంది ఈ వ్యవహారం? ఈ రోజు బండారం బైట పడింది! నేను విసురుగా కర్టెన్ తొలగించాను.
బండారం బైట పడిందా? అక్కడ నాకు కనిపించిన దృశ్యం... శకుంతల గొంతుక్కూర్చుని నేలమీద పరుచుకున్న రక్తాన్ని శుభ్రం చేస్తోంది. ధీరజ్ నా మంచం మీద స్పృహలేనట్టు పడి ఉన్నాడు. అతను రక్తం వాంతి చేసుకున్నట్టున్నాడు. అతని మొహం తెల్లగా పాలిపోయి ఉంది. నేల తుడుస్తున్న శకుంతల గుమ్మం దగ్గర చప్పుడు విని తలెత్తి చూసింది. నన్ను చూడగానే చాలా కంగారు పడింది. నట్టుతూ, "నువ్వేనా! ... ఈయన ఆరోగ్యం విషమించిందని కబురొస్తే... ఇవాళే వెళ్ళి వెంట పెట్టుకొచ్చాను. సరిగ్గా సమయానికి వచ్చావు...ఎవరైనా డాక్టర్ ఉంటే వెంటనే పిల్చుకురావా, ప్లీజ్?" అంది దీనంగా.
నేను వెంటనే వెనుదిరిగి డాక్టర్ కోసం పరిగెత్తాను. మరుక్షణం పేలిపోతానేమో ననిపించింది..నేను పేలిపోవటానికి నిదర్శనంగా ఎక్కడా ఒక బుడగ కూడా కనిపించదేమో!

("స్టెంటర్" పీరుతో ౧౯౬౩ లో ప్రచురితమైన ఈ హిందీ కథ ౨౦౦౯ లో ’ఏక్ ఘర్ కి డైరీ’ పేరుతో కథాసంపుటిగా వెలువడింది. రచయిత అనుమతి తో ఈ కథ తెలుగులోకి అనువదింపబడింది.)
__________________________

మూల హిందీ రచయిత:
ప్రొఫెసర్ రమేష్ ఉపాధ్యాయ్

అనువాదం :
ఆర్.శాంతసుందరి,